Share News

Tirumala: కొండపై నిండు కుండలు..

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:15 AM

వారంరోజులుగా కురిసిన వర్షాలకు తిరుమలలోని ఐదు జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వీటిలో 11,805.62 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.

Tirumala: కొండపై నిండు కుండలు..

  • ఐదు జలాశయాలకు జలకళ

  • తిరుమలలో 204 రోజులకు సరిపడా నీరు

తిరుమల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): వారంరోజులుగా కురిసిన వర్షాలకు తిరుమలలోని ఐదు జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వీటిలో 11,805.62 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. గడిచిన వారం రోజుల్లోనే 4,417.91 లక్షల గ్యాలన్ల నీరు డ్యాముల్లోకి చేరింది. తిరుమల అవసరాలకు రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఇందులో సగ భాగాన్ని తిరుమలలోని ఐదు డ్యాముల నుంచి.. మిగతా సగం తిరుపతిలోని కల్యాణి డ్యాం ద్వారా వినియోగించుకుంటారు. అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా తిరుమలలో వర్షం కురుస్తునే ఉంది. దీంతో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యాముల్లో వారం కిందట 51.64 శాతంగా ఉన్న నీటి నిల్వలు ప్రస్తుతం 82.54 శాతానికి చేరాయి. ఇక, తిరుపతిలోని కల్యాణి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 56,775 లక్షల గ్యాలన్లు కాగా.. ప్రస్తుతం 5,925.15 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలున్నాయి. తిరుమలలోని ఐదు జలాశయాలు, తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో ఇప్పుడున్న నీటి నిల్వల్లో డెడ్‌ స్టోరేజీని మినహాయించి 204 రోజులకు (2026 మే 15వ తేదీ వరకు) తిరుమల అవసరాలకు సరిపడా జల వనరులు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అంచనా వేస్తోంది.

Updated Date - Oct 24 , 2025 | 05:16 AM