Share News

Tirumala Police : ఘరానా మోసగాడు అరెస్ట్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:33 AM

టీటీడీ ఈవో పేరిట నకిలీ ఈమెయిల్‌ క్రియేట్‌ చేసి భక్తులను మోసగిస్తున్న యువకుడిని తిరుమల టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tirumala Police : ఘరానా మోసగాడు అరెస్ట్‌

  • టీటీడీ ఈవో పేరిట నకిలీ మెయిల్‌

  • టికెట్లు జారీ చేస్తానంటూ నగదు వసూలు

  • భక్తుల ఫిర్యాదుతో అరెస్ట్‌ చేసిన తిరుమల పోలీసులు

తిరుమల, మార్చి 11(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈవో పేరిట నకిలీ ఈమెయిల్‌ క్రియేట్‌ చేసి భక్తులను మోసగిస్తున్న యువకుడిని తిరుమల టూటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌, నాలుగు బ్యాంకు పాస్‌ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన బోయ పవన్‌ కల్యాణ్‌ అలియాస్‌ పవన్‌ (24) టీటీడీ ఈవో ఒరిజనల్‌ ఈమెయిల్‌ తరహాలో ఉండేలా ‘టీటీడీఈవోటీవోటీఅట్‌జీమెయిల్‌.కామ్‌’ అనే నకిలీ ఈమెయిల్‌ క్రియేట్‌ చేశాడు. భక్తులు ఎవరైనా గూగుల్‌లో టీటీడీ ఈవో, టీటీడీ జేఈవో, అడిషనల్‌ ఈవో అని వెతికితే తన నకిలీ ఈమెయిల్‌ కనిపించేలా సెట్‌ చేసుకున్నాడు. భక్తులు దర్శనం కోసం లేఖను పంపితే అందులోని నంబర్లకు పవన్‌ ఫోన్‌ చేసేవాడు. తాను జేఈవో కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నానని, టికెట్ల జారీకి కొంత నగదు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. నగదు చెల్లించిన భక్తులు కాల్‌ చేస్తే ట్రూకాలర్‌లో టీటీడీ జేఈఈవో ఆఫీస్‌ అని వచ్చేలా ఫీడ్‌ చేసి పెట్టుకున్నాడు. దీంతో భక్తులు నమ్మి మోసపోయేవారు. నగదు తీసుకున్న తర్వాత భక్తుల నంబర్లను బ్లాక్‌ చేసేవాడు. ఈ నేపథ్యంలో కొంతమంది భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూటౌన్‌ పోలీసులు మంగళవారం పవన్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై ఇప్పటికే కొత్తచెరువు, తమిళనాడులోని రామనాథపురం పోలీస్టేషన్లలో కేసులు ఉన్నట్టు తెలిసింది.

Updated Date - Mar 12 , 2025 | 05:33 AM