Pilgrim Rush: తిరుమల కిటకిట
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:02 AM
తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది.శనివారం రద్దీ మరింత ఎక్కువైంది.
వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు.. 3 కిలోమీటర్ల మేర క్యూలైన్
సాయంత్రానికి క్యూలైన్ల మూసివేత.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
గదుల కోసం 6 గంటలకు పైగా నిరీక్షణ.. కల్యాణకట్టలు, అన్నప్రసాద కేంద్రాల్లో రద్దీ
తిరుమల, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది.శనివారం రద్దీ మరింత ఎక్కువైంది.వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 9 షెడ్లు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ, శ్రీవారి సేవా సదన్ సర్కిల్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆక్టోపస్ భవనం దాటి కల్యాణవేదిక మీదుగా వరాహ స్వామి రోడ్డు వైపుగా లైన్ పెరిగింది.భక్తుల సంఖ్య అధికమైన నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత కల్యాణ వేదిక వద్ద క్యూలైన్ మూసివేశారు.దీంతో సాయంత్రం 6గంటలకు క్యూలైన్ సేవా సదన్ వరకు తగ్గింది.సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు ప్రకటించారు. చిన్నపిల్లలు, వృద్ధులు అధిక సమయం క్యూలో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం క్యూ ప్రవేశ మార్గంలో భక్తుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.ఇక స్లాటెడ్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు దాదాపు 4 గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. గదులు పొందేందుకు దాదాపు 6గంటలకు పైగానే నిరీక్షించాల్సి వస్తోంది. గదులు లభించని భక్తులు షెడ్లు, కార్యాలయాల ముందు, చెట్ల కింద, ఫుట్‌పాత్‌లపై సేదతీరుతూ కనిపించారు. మరోవైపు తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగానే మారాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, లేపాక్షి, రాంభగీచా కూడళ్లు.. .ఇలా తిరుమల మొత్తం యాత్రికులతో కిటకిటలాడుతోంది.