Tirumala Police: శ్రీవారి దర్శనాల పేరిట వసూళ్ల దందా
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:11 AM
శ్రీవారి దర్శనం, ఆర్జితసేవలు, వసతి పేరుతో భక్తులను మోసగిస్తూ తప్పించుకు తిరుగుతున్న అశోక్‌కుమార్ రెడ్డి అనే దళారీని తిరుమల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
దళారీ ఖాతాలో ఏడాదిలో రూ.కోటి లావాదేవీలు.. అరెస్టు
తిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనం, ఆర్జితసేవలు, వసతి పేరుతో భక్తులను మోసగిస్తూ తప్పించుకు తిరుగుతున్న అశోక్‌కుమార్ రెడ్డి అనే దళారీని తిరుమల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గడిచిన ఏడాది కాలంలో అతని బ్యాంకు ఖాతాల్లో రూ.కోటికిపైగా లావాదేవీలు జరిగినట్టు విచారణలో వెల్లడైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి పాతపేటకు చెందిన బురిగాల అశోక్ అలియాస్ అశోక్‌కుమార్ రెడ్డి రాక్‌స్టార్ ఈవెంట్స్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన అమన్ గోయల్, గౌతమ్ గుప్తాకు వీఐపీ బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, అభిషేకం, గదులు ఇప్పిస్తానని నమ్మించి రూ.4,16,500 నగదును విడతల వారీగా ఆన్‌లైన్ ద్వారా తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. తీరా ఆ భక్తులు తిరుమల చేరుకోగా అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి జరిగిన మోసాన్ని వివరించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 16వ తేదీన తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే గోపాల్ నత్మల్ అగర్వాల్, రాధిక అనే భక్తులూ 17వ తేదీన నేరుగా వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో అశోక్‌పై ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో వన్, టూటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘాతో అశోక్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి ఓ సెల్‌ఫోన్, బైక్, నాలుగు బ్యాంక్ పాస్‌పుస్తకాలను స్వాధీనం చేశారు. రెండు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసి మంగళవారం తిరుపతి రెండో కోర్టుకు తరలించారు.
విచారణలో వెలుగుచూసిన అక్రమాలు
పోలీసుల విచారణలో అశోక్ అక్రమాలు వెలుగుచూశాయి. గడిచిన ఏడాదిలో రూ.కోటికిపైగానే బ్యాంకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పడంతో పాటు టీటీడీలో తనకు మంచి పరిచయాలున్నట్టు భక్తులను నమ్మించి మోసగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా భక్తులను మోగిస్తూ లక్షల్లో వసూలు చేసినట్టు తేలింది. ఈ డీఎస్పీ విజయ్‌శేఖర్ మంగళవారం తిరుమల టూటౌన్ పోలీస్టేషన్ అలిపిరి పాదాలు అవుట్‌పోస్టులో మీడియాతో మాట్లాడారు. స్వామి దర్శనాలు, గదులు, సేవల పేరుతో అశోక్ భక్తులను మోగిస్తున్నాడని, భక్తుల నుంచి నగదు వసూలు చేసిన తర్వాత ఫోన్ ఆఫ్ చేసి పారిపోతున్నాడని వివరించారు. భక్తులు ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శనం, వసతి, సేవలు పొందాలని సూచించారు.