Road Accident: టైరు పేలి.. జనంపైకి పెళ్లి కారు.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:04 AM
హైవేపై వెళ్తున్న కారు టైరు పేలడంతో.. రోడ్డు పక్క బస్టాప్ వద్ద నిలబడి ఉన్నవారిపైకి దూసుకెళ్లి ముగ్గురు మృత్యువాతపడ్డారు కాకినాడ జిల్లా కిర్లంపూడి...
కిర్లంపూడి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): హైవేపై వెళ్తున్న కారు టైరు పేలడంతో.. రోడ్డు పక్క బస్టాప్ వద్ద నిలబడి ఉన్నవారిపైకి దూసుకెళ్లి ముగ్గురు మృత్యువాతపడ్డారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వద్ద.. జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 7.40గంటల సమయంలో అన్నవరం నుంచి జగ్గంపేట వైపు హైవేపై ఓ పెళ్లికారు అతివేగంగా వస్తోంది. సోమవరంలో రిక్వెస్ట్ బస్టాప్ వద్దకు వచ్చేసరికి టైరు పేలడంతో కారు అక్కడున్నవారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో కాకాడ రాజు(45), తాతా మనవళ్లు మోర్త ఆనందరావు(65), మోర్త కొండయ్య(30) అక్కడికక్కడే మృతిచెందారు. చీపురుపల్లి ఫణిశ్రీ, కొండ్రాపు చైతన్య, బత్తిన భద్రం తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతుల కుటుంబీకులకు తక్షణసాయంగా రూ.25వేల చొప్పున ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందించారు.