Enforcement Failure: టిప్పర్.. హారర్
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:12 AM
పరిమితికి మించిన లోడు.. మితిమీరిన వేగం.. అడ్డూ అదుపూ లేదన్నట్టుగా రోడ్లపై టిప్పర్లు దూసుకెళ్తున్నాయి. ఇక ఖాళీ బండి అయితే పట్టపగ్గాలుండవు. డ్రైవర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం, ట్రాఫిక్...
వాహనదారుల పాలిట మృత్యుశకటాలు
అధిక లోడు, మితిమీరిన వేగంతో భయోత్పాతం
రోడ్లపై అడ్డూ అదుపూ లేకుండా హల్‌చల్
చాలా బండ్లు రాజకీయ నాయకుల చేతుల్లోనే
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
పరిమితికి మించిన లోడు.. మితిమీరిన వేగం.. అడ్డూ అదుపూ లేదన్నట్టుగా రోడ్లపై టిప్పర్లు దూసుకెళ్తున్నాయి. ఇక ఖాళీ బండి అయితే పట్టపగ్గాలుండవు. డ్రైవర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మితిమీరిన వేగం కారణంగా టిప్పర్లు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టిప్పర్ రాంగ్ రూట్‌లో వెళ్లి ఓ కారును ఢీకొట్టడంతో ఏడుగురు మరణించారు. రోడ్డుపై టిప్పర్ కనపడగానే వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. టిప్పర్ డ్రైవర్లు అందరూ నిర్లక్ష్యంగా ఉంటారని కాదు కానీ చాలా వరకు రోడ్లపై భయానక వాతావరణం సృష్టిస్తున్నాయు. ఇసుక, మట్టి, గ్రావెల్ వంటి వాటిని తరలించడానికి టిప్పర్లు వాడుతారు. కొండలు, క్వారీల్లోకి వెళ్లి రావాల్సి ఉన్నందున టిప్పర్లకు ఎక్కువ పవర్ ఉంటుంది. లోడు బండ్లు కూడా చాలా వేగంగా వెళ్తాయి. ఖాళీ బండ్లు అయితే ఇక చెప్పనవసరం లేదు. డ్రైవర్లకు ట్రిప్పులను బట్టి డబ్బులు ఇస్తుండటంతో ఎన్ని ఎక్కువ ట్రిప్పులు తోలితే అంత డబ్బు వస్తుందనే ఆశతో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. తమకు దారి ఇవ్వకపోతే ఇతర వాహనదారుల చెవులకు చిల్లులు పెడుతున్నారు. మామూలు రహదారులపై మోటారు సైకిల్‌ను తిప్పినట్టుగా తిప్పేసి ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు. టిప్పర్లు వస్తున్నాయంటే పక్కకు పారిపోయే పరిస్థితి రహదారులపై కనిపిస్తోంది. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. టిప్పర్ యజమానులకూ కాసులపై ఉన్న ధ్యాస ప్రజల ప్రాణాలపై ఉండడం లేదు.
రాష్ట్రంలో 70 వేల టిప్పర్లు
రాష్ట్రంలో ఉన్న భారీ వాహనాల్లో లారీల తర్వాత టిప్పర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం 70 వేల టిప్పర్లు ఉన్నాయి. ఇవి కాకుండా 4 లక్షల లారీలు ఉన్నాయి. వాటిలో 2.75 లక్షలు నేషనల్ పర్మిట్ ఉన్నవి ఉన్నాయి. లారీలు సరుకు రవాణాకు మాత్రమే వెళ్తుంటాయి. మట్టి, ఇసుక, సిమెంట్, కంకర వంటి రవాణాకు టిప్పర్లను ఉపయోగిస్తున్నారు. ఇసుక రీచ్‌లు, గ్రానైట్, గ్రావెల్ క్వారీలు ఉన్న ప్రాంతాల్లో ఈ టిప్పర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఈ టిప్పర్లు ఎక్కువగా ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో టిప్పర్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని నియోజకవర్గాల్లో జరిగే మైనింగ్‌లో కాంట్రాక్ట్‌కు ఇస్తున్నారు. ఇసుక రీచ్‌లు ఉన్న జిల్లాలో ఇసుక తరలింపునకు ఉపయోగిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఇ సుక రీచ్‌లు ఎక్కువగా ఉండడంతో టిప్పర్ల కొనుగోలు పెరుగుతోంది. సాధారణంగా ఆరు చక్రాల టిప్పర్‌కు 12 టన్నులు, 10 చక్రాల వాహనానికి 20 టన్నులు, 12 చక్రాల టిప్పర్‌కు 25 టన్నులు, 14 చక్రాల వాహనానికి 30 టన్నులు, 16 చక్రాల వాహనానికి 35 టన్నులు లోడ్ వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టిప్పర్లు, లారీలు పాటించడం లేదన్నది బహిరంగ రహస్యం. టిప్పర్ బాడీని దాటేసి పైకి కనిపించేలా ఇసుక, గ్రావెల్‌ను నింపుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా దానిపై టార్పాల్‌ను గట్టిగా కట్టాలి. అయితే లోడింగ్ పూర్తవ్వగానే పైపైన టార్పాల్ కట్టి వదిలేస్తున్నారు. టిప్పర్లు వేగంగా వెళ్లినప్పుడు ఈ టార్పాల్ పైకి ఎగిరిపోవడంతో ఇసుక, గ్రావెల్ బయటకు వస్తున్నాయి. ఇవి రోడ్లపై పడటం, ద్విచక్ర వాహనదారుల కళ్లలో పడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం 5 టన్నుల అధిక లోడ్ లేకుండా ఏ ఒక్క టిప్పర్ రోడ్డు పైకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. హెవీ లోడ్‌తో వేగంగా వెళ్లే టిప్పర్‌కు బ్రేక్ వేసినా వాహనం అదుపులోకి రాదని, కొంత దూరం వరకు బ్రేక్ పని చేయదని చెబుతున్నారు.
రాజకీయ గండం
బిల్డర్లు, కాంట్రాక్టర్లు టిప్పర్ల యజమానులుగా ఉంటున్నారు. ఇసుక రీచ్‌లు, క్వారీలు నడిపేవారు, రోడ్డు నిర్మాణం చేసే కాంట్రాక్టర్లు రవాణా నిమిత్తం వాటిని కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారంలో వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకుని, అక్రమార్జనను పెంచుకునేందుకు పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అవతారం ఎత్తుతున్నారు. పదవులను దక్కించుకుని అధికారం అండతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
అనుభవం లేకుండా డ్రైవింగ్
భవన, రహదారుల నిర్మాణ సామగ్రిని అత్యధికంగా టిప్పర్లు రవాణా చేస్తున్నాయి. యజమానులు బాగానే సంపాదిస్తున్నా డ్రైవర్ల జీతాల విషయంలో కక్కుర్తి పడుతున్నారు. తక్కువ జీతానికి పని చేసే యువత చేతికి యజమానులు స్టీరింగ్ ఇస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని క్వారీల్లోని కంకర, డస్ట్‌ను తరలించేందుకు అనుభవం లేని యువకులను డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. కొన్ని క్వారీల్లో మైనర్లు డ్రైవర్లుగా ఉంటున్నారు. పరిమితికి మించిన వేగం, రోడ్డు ప్రమాదకర మలుపుల్లోనూ అతివేగం, రాంగ్ రూట్‌లో టిప్పర్లను తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.