Share News

కరకట్టకు టిప్పర్‌ తిప్పలు

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:18 AM

యనమలకుదురు-స్ర్కూబ్రిడ్జి-యనమలకుదురు మార్గంలో వెళ్లాలన్నా.. రావాలన్నా రామలింగేశ్వరనగర్‌ కరకట్ట ఎక్కి తీరాల్సిందే. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అవనిగడ్డకు రాకపోకలు సాగించే వాహనాల కోసం నిర్మించిన కరకట్టపై ఇసుక టిప్పర్లు దుమారం రేపుతున్నాయి.

కరకట్టకు టిప్పర్‌ తిప్పలు

-రామలింగేశ్వరనగర్‌లో యథేచ్ఛగా ఇసుక లారీల రాకపోకలు

-కట్టపై మరమ్మతులకు గురవుతున్న టిప్పర్లు

-నిలిచిపోతున్న ట్రాఫిక్‌.. ఇబ్బందుల్లో వాహనదారులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

యనమలకుదురు-స్ర్కూబ్రిడ్జి-యనమలకుదురు మార్గంలో వెళ్లాలన్నా.. రావాలన్నా రామలింగేశ్వరనగర్‌ కరకట్ట ఎక్కి తీరాల్సిందే. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అవనిగడ్డకు రాకపోకలు సాగించే వాహనాల కోసం నిర్మించిన కరకట్టపై ఇసుక టిప్పర్లు దుమారం రేపుతున్నాయి. పరిమితికి మించిన ఇసుక లోడ్‌తో వెళ్లడమే కాకుండా ఇప్పుడు ఏకంగా కట్టపై ట్రాఫిక్‌ను దారి మళ్లించే పరిస్థితిని తీసుకొస్తున్నాయి. లోడ్‌తో యనమలకుదురు వైపు వెళ్తున్న టిప్పర్‌ ఇస్కాన్‌ ఆలయం దాటిన తర్వాత అడుగు భాగాన ఉండే కమాన్‌ విరిగిపోవడంతో కట్టపై అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరిగ్గా టిప్పర్‌ ఆగిపోయిన సమయానికి అవనిగడ్డ బస్సు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్తుంది. దీంతో వాహనాలు అటు ఇటు వెళ్లే మార్గం లేకుండా పోయింది. స్ర్కూబ్రిడ్జి వద్ద ఉన్న ట్రాఫిక్‌ బూతకు ఆమడ దూరంలో టిప్పర్‌ ఆగిపోవడంతో విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. యనమలకుదురు వైపు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అటు వైపు వెళ్లే వాహనాలను బెంజ్‌సర్కిల్‌ వైపునకు మళ్లించారు. టిప్పర్‌ ఆగిపోయిన సమాచారాన్ని నాలుగో ట్రాఫిక్‌ స్టేషన్‌ అధికారులకు వైర్‌లెస్‌సెట్‌లో తెలియజేశారు. ఆ పోలీసులు పడవలరేవు వంతెనకు చేరుకుని యనమలకుదురు వైపు నుంచి స్ర్కూబ్రిడ్జి వైపునకు వచ్చే వాహనాలను పటమటలంకలోకి మళ్లించారు. లోడ్‌ టిప్పర్‌ ఆగిపోవడంతో కరకట్టపై మళ్లింపులు తప్పలేదు. అదేవిధంగా ఉదయం కరకట్టపై ఒక టాటా ఏస్‌ వ్యాన్‌ ఆగిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

అడ్డుకుంటే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు

కృష్ణాజిల్లాలోని పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి 40-50 టన్నుల ఇసుకతో టిప్పర్లు కరకట్ట పైనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవ్వడంతో కొద్దిరోజుల పాటు ఈ రాకపోకలకు బ్రేక్‌లు పడ్డాయి. తర్వాత పరిస్థితి మామూలుగా మారింది. ఈ టిప్పర్ల కారణంగా పడవలరేవు సెంటర్‌లో తాగునీరు పైపులైన్‌ జాయింట్ల వద్ద నేల కుంగిపోయింది. దీనితో వీఎంసీ అధికారులు ఈ పైపులైన్‌ వద్ద మరమ్మతు పనులు చేపట్టారు. ఇక్కడ పనులు జరుగుతున్నా ఇసుకాసురులకు మాత్రం కళ్ల ముందు డబ్బులే కనిపిస్తున్నాయి. పోలీసులు కొద్దిరోజులపాటు ఈ టిప్పర్లను ఆపడంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రంగప్రవేశం చేశారు. నేరుగా ఆయనే పోలీసులకు ఫోన్లు చేసి టిప్పర్లను ఆపొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం నడుస్తోంది. పైగా ఈ ఇసుకను రాజధాని నిర్మాణానికి పంపుతున్నట్టు చెబుతున్నారు. దీని ముసుగులో ఇసుక గుంటూరుకు చేరుకుంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ టిప్పర్ల వల్ల ఏ క్షణానైనా తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని పెదపులిపాక వద్ద ప్రజలు ఆందోళన చేశారు.

Updated Date - Apr 15 , 2025 | 12:18 AM