Share News

Nellore: చిదిమేసిన టిప్పర్‌

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:07 AM

ఆస్పత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు కారులో బయలుదేరిన వాళ్లంతా విగతజీవులుగా మారి అదే ఆస్పత్రికి చేరిన పెను విషాదమిది. మరో 15, 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరతారనగా...

 Nellore: చిదిమేసిన టిప్పర్‌

  • రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్‌

  • కారులోని ఏడుగురూ దుర్మరణం

  • ఆస్పత్రిలోని బంధువు పరామర్శకు కొత్త కారులో వెళ్తుండగా ఘోరం

  • అదే ఆస్పత్రికి చివరకు విగతజీవులుగా చేరిన విషాదం

  • మాంసం ముద్దలైన మృతదేహాల వెలికితీతకు గంట సమయం

  • నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. డ్రైవర్‌ తప్ప అందరూ బంధువులే

సంగం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు కారులో బయలుదేరిన వాళ్లంతా విగతజీవులుగా మారి అదే ఆస్పత్రికి చేరిన పెను విషాదమిది. మరో 15, 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరతారనగా... మృత్యువులా దూసుకొచ్చిన టిప్పర్‌ వారి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఏడుగురూ మాంసంముద్దల్లా మారగా, వారు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. టిప్పర్‌ కింద ఇరుక్కుపోయిన కారును బయటకుతీయడానికి పోలీసులకు 2 గంటలు, ఆపై మృతదేహాల వెలికితీతకు మరో గంట సమయం పట్టింది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద ముంబై జాతీయరహదారిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...నెల్లూరు సిటీలో తాళ్లూరు శ్రీనివాసులు (40) అనే వ్యక్తి తన భార్య రాధమ్మతో (38) కలిసి ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. వీరు ఇటీవల మారుతి కంపెనీకి చెందిన ఫ్రాంక్స్‌ మోడల్‌ కారు కొన్నారు. రాధమ్మ బంధువు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని వారు... తమ బంధువులు శేషం సారమ్మ (40) బాలవెంగయ్య; చల్లగుండ్ల శ్రీనివాసులు, లక్ష్మి (35) దంపతులతో బయలుదేరారు.


తమ వద్ద పనిచేసే బ్రహ్మయ్య అనే వ్యక్తికి కారు డ్రైవింగ్‌ తెలిసి ఉండటంతో కారు ఎక్కించుకున్నారు. ఇలా ఏడుగురు బుధవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరారు. నెల్లూరు దాటి ముంబై హైవే మీదుగా ఆత్మకూరు దిశగావెళుతూ.. సంగం కొండ దిగి పెరమన సమీపానికి 11.30 గంటలకు కారు వచ్చింది. ఇంతలో రాంగ్‌రూట్‌లో వచ్చిన ఇసుక టిప్పర్‌... ఆ కారును ఢీకొంది. వేగం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయి 20 మీటర్ల వెనక్కి వచ్చిఆగింది. అందులోని ఏడుగురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. టిప్పర్‌ డ్రైవర్‌ ప్రసాద్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.


మద్యం మత్తా? ఓవర్‌టేకా?

టిప్పర్‌ డ్రైవర్‌ మితిమీరిన వేగమే నిండు ప్రాణాలను బలితీసుకొంది. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టిప్పర్‌ ఇసుక లోడుతో ఆత్మకూరు నుంచి సంగం వైపు వెళుతుండగా, కారు ఆత్మకూరు వైపు పోతోంది. అది రెండు లేన్ల హైవే...మధ్యలో డివైడరు లేదు. అప్పటివరకు ఎడమ వైపు సవ్యంగానే వెళుతున్న టిప్పర్‌ ఒక్కసారిగా బాగా కుడి వైపునకు వచ్చింది. అతి వేగానికి తోడు ఓవర్‌టేక్‌ కోసం డ్రైవర్‌ ప్రయత్నించాడా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఓవర్‌ టేక్‌ చేయడానికి ముందు ఎటువంటి వాహనాలు లేవని హైవే పక్కన ఉన్న పశువుల కాపర్లు చెబుతున్నారు. ఇలా... రాంగ్‌రూట్‌లోకి వచ్చేసిన టిప్పర్‌ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ ఢీకొట్టిన ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జయి టిప్పర్‌ బంపర్‌ కిందకు దూసుకుపోయింది. కారు ఇంజన్‌తోపాటు ముందుభాగం వెనుక సీటు వరకు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కారు డోర్‌లు తెరుచుకోకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టమైంది. పోలీసులు రెండు క్రేన్‌లు, ఒక జేసీబీని రప్పించి ఒకదానికొకటి ఇరుక్కున్న కారు, టిప్పర్‌ను ఎట్టకేలకు వేరుచేశారు.

Updated Date - Sep 18 , 2025 | 04:10 AM