‘టిడ్కో’ తిప్పలు!
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:15 AM
టిడ్కో గృహ సముదాయాల వద్ద కనీస సౌకర్యాలు కరువై లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్లు తుదిదశ పనులు నిలిపివేశారు. దీంతో గదుల కిటకీలు, తలుపులు, తాగునీటి కనెక్షన్ల పనులు అలాగే ఉండిపోయాయి. ఇదే అదనుగా భావించిన దొంగలు రుద్రవరంలో 400 విద్యుత మీటర్లు ఎత్తుకెళ్లి పోయారు. సౌకర్యాలు కల్పించకుండా ఇళ్లలోకి వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- గృహ సముదాయాల వద్ద కనీస సౌకర్యాలు కరువు
- రుద్రవరంలో 400 విద్యుత మీటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు
- గదులకు సమకూరని కిటికీలు, డోర్‌లు, తాగునీటికి కనెక్షన్లు
- బిల్లులు పెండింగ్ అంటూ పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు
- కూటమి చొరవతో ఉయ్యూరులో మళ్లీ పనులు పునఃప్రారంభం
టిడ్కో గృహ సముదాయాల వద్ద కనీస సౌకర్యాలు కరువై లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్లు తుదిదశ పనులు నిలిపివేశారు. దీంతో గదుల కిటకీలు, తలుపులు, తాగునీటి కనెక్షన్ల పనులు అలాగే ఉండిపోయాయి. ఇదే అదనుగా భావించిన దొంగలు రుద్రవరంలో 400 విద్యుత మీటర్లు ఎత్తుకెళ్లి పోయారు. సౌకర్యాలు కల్పించకుండా ఇళ్లలోకి వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని టిడ్కో గృహాల వద్ద కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,712 టిడ్కో గృహాల నిర్మాణం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. 2019లో వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని తదితర కారణాలు చూపి పనులు నిలిపివేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఏడు వేల మందికి, కూటమి ప్రభుత్వం హయాంలో మచిలీపట్నం గోసంఘం వద్ద 864 మందికి టిడ్కో గృహాలను అప్పగించారు. మచిలీపట్నం రుద్రవరంలో టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తయ్యేదశలో ఉన్నా బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. ఉయ్యూరులోని టిడ్కో గృహాల నిర్మాణం 2019 నుంచి నిలిచిపోయాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఈ గృహాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించడంతో ఇటీవలనే ఈ పనులను ప్రారంభించినా, ఇంకా వేగవంతం కాలేదు.
పెండింగ్‌లోనే తుదిదశ పనులు
మచిలీపట్నం నియోజకవర్గంలోని రుద్రవరంలో 3వేలకు పైగా టిడ్కో గృహాల నిర్మాణం కోసం పునాదులు వేశారు. వివిధ కారణాలతో ఈ గృహాల సంఖ్యను 1,440 తగ్గించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఇక్కడి గృహాల నిర్మాణంలో 60శాతం మేర పనులు పూర్తిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు సంవత్సరాలపాటు ఈ పనులను నిలిపివేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడి గృహాలకు సంబంధించి గదులకు కిటికీలు, డోర్‌లు, తాగునీటికి కనెక్షన్లు వంటి పనులు చేయకుండా నిలివేశారు. ఈ గృహ సముదాయాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణం చూపి తుది మెరుగులకు సంబంధించిన పనులు చేయకుండా కాంట్రాక్టర్ మిన్నకుండిపోయారు. ఈ ఏడాది ఉగాది నాడు టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే పనిలో భాగంగా గృహాలకు సంబంధించిన తాళాలను అందజేశారు. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు గృహాల్లోకి వెళ్లలేదు.
విద్యుత మీటర్లు చోరీ
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గృహాల్లోకి వెళ్లకుంటే చర్యలు తీసుకుంటామని లబ్ధిదారులకు ఇటీవల కాలంలో నోటీసులు జారీ చేశారు. కొందరు లబ్ధిదారులు గృహాల వద్దకు వెళితే అక్కడ 400 గృహాలకు బిగించిన విద్యుత మీటర్లను దొంగలు ఎత్తుకుపోయారు. తమ గృహాల వద్ద విద్యుత మీటర్లు అపహరణకు గురయ్యాయని, వాటి స్థానంలో కొత్త మీటర్లు బిగించి విద్యుత సౌకర్యం పునరుద్ధరించాలని లబ్ధిదారులు విద్యుతశాఖ కార్యాలయానికి వెళ్లారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే విద్యుత మీటర్లు బిగిస్తామని చెప్పి అధికారులు లబ్ధిదారులను పంపేశారు.
తాగునీటి సౌకర్యం నిల్
ఇక్కడ 400 గృహాలకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకుండా అధికారులు మిన్నకుండిపోయారు. గృహాల్లోకి వెళ్లిన కొందరు లబ్ధిదారులు తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినలేదు. దీంతో గత సోమవారం లబ్ధిదారులు కలెక్టర్ బాలాజీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తాగునీటి సౌకర్యాన్ని మూడు రోజుల క్రితం కల్పించారు. విద్యుత మీటర్ల పునరుద్ధరణ అంశంపై అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ గృహాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.2కోట్లకు పైగా బిల్లులను ఇటీవల మంజూరు చేసింది. ఇంకా రూ.1.20 కోట్ల మేర మాత్రమే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గృహాలలో తాగునీటి కుళాయిలు, కిటీకీలకు సంబంధించిన పనులు పెండింగ్ ఉన్నాయని సంక్రాంతి నాటికి పూర్తి చేయిస్తామని టిడ్కో అధికారులు చెబుతున్నారు.
ఉయ్యూరులో ప్రారంభమైన పనులు
పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు టౌన్ పరిధిలోని జెమిని స్కూల్, ఎగినపాడు, గండిగుంటలో టిడ్కోగృహాల నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ కంపెనీకి ఈ పనులు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహాలకు సంబంధించి రూ.100కోట్లకుపైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో పనులను నిలిపివేశారు. సాధారణ ఎన్నికల ముందు ఈ గృహ సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామని పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేశ్ కొద్ది రోజులపాటు హడావిడి చేశారు. అయినా పనులు ప్రారంభించలేదు. ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఉయ్యూరు టిడ్కో గృహాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో ఈ పనులను ఎట్టకేలకు ప్రారంభించారు. రానున్న రోజుల్లో పనులు మరింత వేగవంతం చేస్తామని టిడ్కో విభాగం జిల్లా అధికారి బి.చిన్నోడు తెలిపారు.