Political Defection: వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:45 AM
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
రాజశేఖర్, బల్లి కల్యాణ్, కర్రి పద్మశ్రీలకు కండువా కప్పిన సీఎం చంద్రబాబు
మేం రాజీనామాలు చేసి నెలలు గడిచాయి
ప్రత్యేక అజెండాతోనే చైర్మన్ ఆమోదించలేదు: ఎమ్మెల్సీలు
కూటమి అభివృద్ధిని చూసే చేరాం: నేతలు
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నం కావాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, పంచుమర్తి అనురాధ, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాతోనూ మాట్లాడనివ్వలేదు
టీడీపీలో చేరిన అనంతరం మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ, ఆరు నెలలుగా మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని అన్నారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని ఆరోపించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని తెలిపారు. కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. టీడీపీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు. తన తండ్రి పూర్తికాలం టీడీపీతోనే ఉన్నారని తెలిపారు. పద్మశ్రీ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది అవుతోందని కానీ, ఇంత వరకు ఆమోదించలేదని అన్నారు. పదవి ఉన్నా ప్రజలకు పెద్దగా ఏమీ చేయలేకపోయామని, వైసీపీలో ఉన్నప్పుడు కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయుందన్నారు.