Share News

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:24 PM

జిల్లాలోని మూడు మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో జరగ్గా ముగ్గురు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ఆరుగురికి తీవ్ర గాయాలు

జూపాడుబంగ్లా/మిడుతూరు/గడివేముల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మూడు మండలాల్లో రోడ్డు ప్రమాదాల్లో జరగ్గా ముగ్గురు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలివీ.. జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం మొక్కజొన్న లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో శుక్రవారం ఒకరు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. తూడిచర్ల గ్రామం నుంచి నందికొట్కూరు సమీపంలో ఉన్న రబ్బానీ గోదాముకు మొక్కజొన్న లారీ తీసుకెళుతుండగా తంగడంచ సమీపంలో బోల్తాపడింది. లారీలో మొక్కజొన్న సంచులపై ఉన్న తూడిచర్ల గ్రామానికి చెందిన హామాలీలు ఏడుగురిలో భరత(32) వ్యక్తిపై సంచులు పడటంతో అక్కడిక్కడే మృతిచెందారు. రహదారిపై వెళుతున్న వాహనదారులు, తంగడంచ గ్రామస్థులు కలిసి సంచులు తీసేలోపు భరత మృతిచెందగా మిగతా ఆరుగురిని కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల రాకపోకలు గంట వరకు స్తంభించిపోయాయి. గాయపడిన హమాలీలు వెంకటేశ్వర్లు, యుగంధర్‌, రహమ్మతబాషా, శంకర్‌, శివరాముడు, పుల్లయ్యను చికిత్స నిమిత్తం కర్నూలు వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడినుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మిడుతూరు మండలంలోని తలముడిపి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్వర్లు(34) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ఓబులేసు తెలిపిన వివరాలివీ.. వెంకటేశ్వర్లు నందికొట్కూరు పట్టణంలోని వాల్మీకి నగరంలో తన తల్లి రమణమ్మతో పాటు నివాసం ఉంటూ గౌండ పనికి వెళ్లేవాడు. శుక్రవారం మహానందికి వెళ్లి వస్తానని తన తల్లితో చెప్పి బైక్‌పై తెల్లవారుజామున బయలు దేరాడు. వెంటేశ్వర్లును తలముడిపి గ్రామ సమీపంలోని కుందూ వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కకి అక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు సోదరుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్ష నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గడివేముల మండలంలోని కొరపొలూరు గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వెలుగోడు మండలంలోని రేగడగూడురు గ్రామానికి చెందిన శ్రీనివాసులు (50) తన ద్విచక్రవాహనంలో గడివేముల నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో కల్వర్టు వద్ద ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కల్వర్టులో పడిపోగా శ్రీనివాసులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మహాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీసీ నాగార్జునరెడ్డి తెలిపారు.

Updated Date - Nov 21 , 2025 | 11:24 PM