YS Jagan: అధికారం.. డబ్బు.. విషం
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:40 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం స్కాంపై 3 లఘు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇందులో మొదటి భాగం నిడివి 18.34 నిమిషాలు..
మద్యం స్కామ్‌ను కళ్లకు కడుతూ లఘుచిత్రాలు
మూడు భాగాలుగా చిత్రీకరించిన ఔత్సాహికులు
అధికారం కోసం మద్యంపై జగన్ ఫేక్ హామీలు
విషంతో సమానమైన నాసిరకం మద్య విక్రయం
జగన్ వీడియో క్లిప్పింగ్‌లు, బాధితుల కథనాలు...
సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి..
లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం స్కాంపై 3 లఘు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇందులో మొదటి భాగం నిడివి 18.34 నిమిషాలు. హాజీ మస్తాన్, దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా డాన్‌లతో జగన్‌ను పోలుస్తూ, మద్యం మాఫియా డాన్‌గా పేర్కొంటూ ఈ భాగం మొదలవుతుంది. అధికారం కోసం 2019 ఎన్నికలకు ముందు జగన్ మద్యం అంశాన్ని ఎలా వాడుకున్నారో ఈ భాగం వివరిస్తుంది. నాటి ఎన్నికల ప్రచారంలో.. మందు అనేది లేకుండా చేస్తానని ఆయన చెప్పిన వీడియో క్లిప్‌ను చూపిస్తూ, ఆ తర్వాత ఆ హామీని ఎలా తుంగలో తొక్కారో వివరించారు. ప్రజలు మద్యం తాగకుండా చేసేందుకు మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచుతానంటూ కల్లిబొల్లి మాటలు చెబుతూ.. నిబంధనలను తనకు ఇష్టం వచ్చినట్లు మార్చేస్తూ.. ప్రజలకు చీప్ లిక్కర్‌ను అధిక ధరలకు అమ్ము తూ.. ప్రభుత్వ ఖజానాను ఎలా కొల్లగొట్టారో పేర్కొన్నారు. త్రీ క్యాపిటల్స్, రాయల్ రైట్, స్పెషల్ స్టేటస్ అంటూ పిచ్చి పిచ్చి పేర్లతో పిచ్చి బ్రాండ్లను నాసిరకం మద్యాన్ని మాత్ర మే అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలు ఫణం పెట్టి వేల కోట్లు సంపాదించిన వైనా న్ని వివరించారు. ఇలా సంపాదించి న మద్యం డబ్బును 2024 ఎన్నికల్లో ఖర్చు పెట్టి మరోసారి అధికారంలోకి రావడానికి జగన్ చేసిన ప్రయత్నాన్నీ వివరించారు. మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది. అక్రమాల తీరు.. వైసీపీ పెద్దలు డబ్బులు దండుకుని వాటిని ఎక్కడెక్కడికి తరలించా రు.. ఎవరెవరు మద్యం కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారు వంటి అనేక అంశాల ను వివరించారు. మద్యం డబ్బుతో సినిమాల నిర్మాణం.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. బం గారు బిస్కట్లు.. విదేశాల్లో ఖరీదైన విల్లాల కొనుగోలు చేసిన తీరును ప్రస్తావించారు. మద్యం కారణంగా ఆరోగ్యాలు పాడుచేసుకున్న బాధితుల దీన పరిస్థితిని వారి మాటల్లోనే చూపారు. ‘ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నలు’ అంటూ తొలి భాగాన్ని ముగించారు. దీన్ని యూట్యూబ్‌తోపాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచనున్నారు.
రెండో భాగంలో... మద్యం డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారన్న అంశాలను వివరించారు. మూడో భాగంలో... మద్యం పేరుతో విషాన్ని ప్రజలతో ఎలా తాగించారు....దాని వల్ల ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడారన్న విషయాలను ప్రస్తావించారు.