Share News

Supreme Court Collegium: ఏపీ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు

ABN , Publish Date - Aug 26 , 2025 | 04:11 AM

ఏపీ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

Supreme Court Collegium: ఏపీ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు

  • సుప్రీం కొలీజియం సిఫారసు

  • రాష్ట్రానికి తిరిగి రానున్న జస్టిస్‌ రమేశ్‌,జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌

  • కోల్‌కతా నుంచి జస్టిస్‌ శుభేందు కూడా

అమరావతి/న్యూఢిల్లీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలో సోమవారం భేటీ అయిన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ దోనాది రమేశ్‌, కోల్‌కతా హైకోర్టు నుంచి జస్టిస్‌ శుభేందు సమంతను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. వీరి బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. కాగా, వీరిలో జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ డి. రమేశ్‌లు గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులుగా సేవలందించారు.


ఇద్దరూ తెలుగు వారే

జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌.. స్వగ్రామం విజయనగరం జిల్లా, పార్వతీపురం. ఆయన 1964 మే 21న జన్మించారు. విశాఖపట్నంలోని ఎంవీపీ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1988 నుండి 2002 వరకు 14 ఏళ్లపాటు పార్వతీపురం, విజయనగరంలో న్యాయవాదిగా పనిచేశారు. 2002లో జిల్లా సెషన్స్‌ జడ్జి(గ్రేడ్‌-2)గా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలోని వివిధ కోర్టుల్లో న్యాయాధికారిగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. 2015, జూలై 3 నుంచి 2018, డిసెంబరు 31వరకు ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేశారు. 2019, జూన్‌ 12న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేశాక నియమితులైన మొదటి న్యాయమూర్తి ఆయనే. తర్వాత 2023, నవంబరు 2న గుజరాత్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు.


జస్టిస్‌ డి. రమేశ్‌.. స్వగ్రామం చిత్తూరు జిల్లా, మదనపల్లిలోని కమ్మపల్లి. 1965, జూన్‌ 27న జన్మించారు. నెల్లూరు వీఆర్‌ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఉమ్మడి హైకోర్టులో 2000-04 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా, 2007లో ఏపీ సర్వశిక్ష అభియాన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. 2020, జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023, జూలై 24న అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.

జస్టిస్‌ శుభేందు సమంత.. 1971, నవంబరు 25న జన్మించారు. కోల్‌కతా యునివర్సిటీ హజ్రా క్యాంప్‌సలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తమ్లుక్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనంతరం, న్యాయాధికారిగా ఎంపికయ్యారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా పనిచేశారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా చేశారు. కోల్‌కతా సిటీ సెషన్స్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా పనిచేశారు. 2022, మే 18న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Aug 26 , 2025 | 04:14 AM