Annamayya District: చెయ్యేరులో మునిగి ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు మృతి
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:41 AM
అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చెయ్యేరు నదిలో ఈతకు వెళ్లి ఇసుక గుంతల్లో మునిగి చనిపోయారు.
అన్నమయ్య జిల్లాలో విషాదం
రాజంపేట, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చెయ్యేరు నదిలో ఈతకు వెళ్లి ఇసుక గుంతల్లో మునిగి చనిపోయారు. గురువారం మధ్యాహ్నం రాజంపేట నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజంపేట-రాయచోటి ఘాట్ రోడ్డులోని చెయ్యేరు నది వద్దకు 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లారు. భోజనాలు తీసుకుని గట్టు వద్ద తిని సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. ఇటీవల చెయ్యేరు నదిలో బాలరాజుపల్లె వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. ఇసుక తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల కిందట ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు పడడం, దానికితోడు పింఛా డ్యాం గేట్లు ఎత్తడం వల్ల నదిలోకి వరద నీరు చేరడంతో ఇసుక రీచ్‌లోని గుంతలను వీరు గుర్తించలేకపోయారు. దీంతో ఈతకు వెళ్లిన 8 మంది విద్యార్థుల్లో రాజంపేట మండలం గాలివారిపల్లెకు చెందిన సోంబత్తిన దిలీప్ మణి కుమార్(22), కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లె గ్రామానికి చెందిన కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22), పోరుమామిళ్లకు చెందిన పీనరోతు కేశవ(22) ఇసుక గుంతల్లో ఇరుక్కుపోయి మృతిచెందారు. వీరికి ఈత రాకపోవడంతో మునిగిపోయి అక్కిడికక్కడే మృతిచెందారు. మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. మిగిలిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.