Share News

Maoists Encounter: ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:54 AM

ఒక మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఛత్తీస్‌గఢ్లోని అడవుల్లో ఆదివారం జరిగిందీ ఎన్‌కౌంటర్‌.

Maoists Encounter: ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

  • మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు

  • ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఘటన

  • ముగ్గురిపై మొత్తం 14 లక్షల రివార్డు

చింతూరు/చర్ల, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఒక మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఛత్తీస్‌గఢ్లోని అడవుల్లో ఆదివారం జరిగిందీ ఎన్‌కౌంటర్‌. విశ్వసనీయ సమాచారం మేరకు కాంకేర్‌, గరియాబంద్‌ జిల్లాల సరిహద్దులోని చిండ్‌ఖడక్‌ గ్రామ సమీప కొండలపై మావోయిస్టులు ఉన్నారని కాంకేర్‌ ఎస్పీ ఇందిరా కల్యాణ్‌కు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్‌), కోబ్రా, ఎస్టీఎఫ్‌ బలగాలను పంపించారు. వీరికి మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. మృ తులను సీతానది ఏరియా కమిటీ కార్యదర్శి సర్వన్‌ మడ్కం అలియాస్‌ విశ్వనాథ్‌, నగిరి ఏరియా కమిటీ సభ్యుడు రాజేశ్‌ అలియాస్‌ రాకేశ్‌ హేమ్లా, మెయిన్‌పూర్‌-నువాపాడ రక్షణ బృందం సభ్యురాలు బసంతి కుంజాం అలియాస్‌ హిడ్మేగా గుర్తించారు. కాల్పులు జరిగిన స్థలంలో ‘ఎస్ఎల్‌ఆర్‌, 303 రైఫిల్‌, 12 బోర్‌ తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ముగ్గురిపై మొత్తంగా రూ.14లక్షల రివార్డు ఉందని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందరరాజ్‌ చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరికొందరు మావోయిస్టులు మృతి చెంది ఉంటారన్నారు. ఛత్తీస్‌గఢ్ లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్ల 252 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 223 మంది కాంకేర్‌ జిల్లాతో సహా బస్తర్‌ డివిజన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో చనిపోయారని పేర్కొన్నారు. మిగిలిన 27 మంది రాయపూర్‌ డివిజన్‌లోని గరియాబంద్‌ జిల్లా లో జరిగిన ఎన్‌కౌంటర్లలో, మరో ఇద్దరు మావోయిస్టులు దుర్గ్‌ డివిజన్‌లోని మేహ్లా-మన్‌పూర్‌ అటవీప్రాంతంలో మృతి చెందారని తెలిపారు. కాగా, యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌లో భాగంగా ఆదివారం కేంద్ర బలగాలు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా పూజారి కాంకేర్‌ అడవుల్లోకి ప్రవేశించాయి.

Updated Date - Sep 29 , 2025 | 03:55 AM