Minister Dola Bala Veeranjaneya: మూడు బిల్లులకు శాసనసభ ఆమోదం
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:27 AM
శాసనసభలో మంగళవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లు-2025ను సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి...
వర్గీకరణ బిల్లు ప్రతిపాదించిన మంత్రి డోలా
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో మంగళవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లు-2025ను సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రతిపాదించారు. గ్రామా ల్లో వసూలు చేసే నాలా రుసుములను ఆయా పంచాయతీల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించుకునేందుకు చట్టంలో సవరణలు చేస్తూ ఆంధప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2025ను పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ తరఫున పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. వీటితోపాటు న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రతిపాదించిన భారతీయ నాగరిక సురక్ష సంహిత (ఏపీ సవరణ) బిల్లు-2025ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు మాన్యువల్ స్కావెంజర్స్ నియామకాల రద్దు కోసం మంత్రి డోలా ప్రవేశపెట్టిన తీర్మానాన్నిసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం
ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే గుడ్లన్నగారి లోకనాథ్, రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యేగ కోట శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన తాటిపర్తి చెంచురెడ్డిల మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.