Education Department: వీళ్లా..భావి టీచర్లు
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:44 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉంటేనే డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డీఎస్సీలో టాపర్‌గా నిలిచినా ప్రయోజనం ఉండదు.
టెట్ లేకుండానే డీఎస్సీ రాశారు.. 2 వేల మంది అనర్హులుగా గుర్తింపు
టెట్‌లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసినవారు 35 వేల మంది
టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత.. ఇంకా తేలాల్సినవారు 9 వేల మంది
క్షుణ్నంగా పరిశీలిస్తున్న విద్యా శాఖ.. 2-3 రోజుల్లో తుది మార్కులు
వాటిపైనా అభ్యంతరాలకు అవకాశం.. పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉంటేనే డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డీఎస్సీలో టాపర్‌గా నిలిచినా ప్రయోజనం ఉండదు. కానీ, ఏం అనుకున్నారో ఏమోగానీ దాదాపు 2వేల మంది అభ్యర్థులు టెట్‌లో అర్హత లేకుండానే మెగా డీఎస్సీ-2025 పరీక్షలు రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి. సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన సంవత్సరం, హాల్‌టికెట్ నంబరు, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో టెట్‌లో అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్‌తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు. అలాగే, మరో 35 వేల మంది టెట్ మార్కులు తప్పుగా నమోదుచేశారు. వీరిలో 26 వేల మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు. ఇంకా 9 వేల మంది వివరాలు సరిపోలలేదు. టెట్ అర్హత లేకుండా డీఎస్సీ రాయడం, టెట్‌లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానినే ప్రామాణికంగా తీసుకోరు. వారి హాల్ టికెట్ నంబరు ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకుని వాటినే పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసినా వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడం గమనార్హం.
మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం తెలియనివారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి. వాస్తవానికి డీఎస్సీ దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు.
ముందస్తు జాగ్రత్తలు
తొలుత సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని డీఎస్సీ పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ, అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ను తొలగించింది. దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికెట్లలో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే, ఇప్పుడు పొరపాటు చేసినా మాన్యువల్‌గా జరిగే తుది సర్టిఫికెట్ల పరిశీలనలో పొరపాట్లు చేసినవారు, అనర్హులు దొరికిపోతారు. అయితే, తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహ పరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్‌లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి, అనర్హుల వడపోత ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయట పడుతున్నారు.
తుది ‘కీ’పై కూడా..
డీఎస్సీ ఫైనల్ ‘కీ’పై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దుచేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యల అనంతరం రెండు, మూడు రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తోంది. డీఎస్సీ పరీక్షల నార్మలైజేషన్, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు. తుది మార్కులపైనా అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది. ఒక్క మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరం, ‘శాప్’ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది. ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబరు మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.