ఇదేం పద్ధతి!
ABN , Publish Date - May 23 , 2025 | 12:53 AM
జిల్లా పరిషత సర్వసభ్య సమావేశంలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బహిష్కరించినట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోవడం రాజకీయ ఎత్తుగడలో భాగమనే వాదన వినపడుతోంది.
- జెడ్పీ సమావేశం బహిష్కరించిన వైసీపీ సభ్యులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- రైతు, ప్రజా సమస్యలు మీకు పట్టవా అంటూ మండిపాటు
- ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా అంటూ ఆరోపణలు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా పరిషత సర్వసభ్య సమావేశంలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బహిష్కరించినట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోవడం రాజకీయ ఎత్తుగడలో భాగమనే వాదన వినపడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌తో సహా సభ్యులంతా అధికారులపై విరుచుకు పడుతున్నారు. గురువారం సమావేశంలో తమకు గౌరవ వేతనం రెండు సంవత్సరాలుగా ఇవ్వడం లేదనే అంశాన్ని ప్రధాన కారణంగా చూపి సభ్యులు సమావేశాన్ని బహిష్కరించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని కొందరు సభ్యులు చెప్పకనే చెబుతున్నారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమేనా!
ఉమ్మడి జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుపొందారు. దీంతో వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ఆదిపత్యాన్ని ప్రదర్శించేందుకు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. జెడ్పీ సమావేశాలు జరిగిన ప్రతిసారి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా గత మూడు విడతలుగా జరిగిన సమావేశాల్లోనూ ప్రభుత్వ విధానాలను, అధికారులను విమర్శిస్తూ వచ్చారు. గురువారం సమావేశంలోనూ ముందస్తు ప్రణాళిక ప్రకారమే సమావేశాన్ని సభ్యులు బహిష్కరించడం గమనార్హం.
ప్రజా సమస్యలు పట్టవా!
ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంట కాలువలకు సాగు నీటిని విడుదల చేసే తేదీపై ఈ సమావేశంలో చర్చించి, ప్రభుత్వానికి తెలియజేయాలి. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ, కౌలు రైతులకు పంట రుణాల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతరత్రా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా సమావేశంలో చర్చించాల్సి ఉంటే వీటిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వైసీపీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్‌లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఖాళీగానే సమావేశపుహాలులో కూర్చుండి పోయారు. సమావేశం అర్ధగంట పాటు కూడా జరగకపోవడంతో అధికారుల సమయం వృథా అయ్యింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ సమావేశానికి హాజరువుతారని అధికారులు చెప్పారు. కృష్ణా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన ఈ సమావేశానికి బయలుదేరారు. సభ్యులు సమావేశాన్ని బహిష్కరిం చారనే సమాచారంతో ఆయన ఆగిపోయారు.