Share News

పట్టని పనులు!

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:24 AM

జల్‌ జీవన్‌ మిషన్‌ను అందిపుచ్చుకోవడంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం తడబడుతోంది. ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా ఇతర జిల్లాల కంటే మన జిల్లా బాగా వెనుకబడింది. ఒక్కో జిల్లా 300 పనులు చొప్పున దక్కించుకుంటే మన జిల్లాకు కేవలం 14 తాగునీటి పైపులైన్ల పనులే మంజూరయ్యాయి. ఇవి కూడా చెంచులు ఎక్కువుగా ఉండే ప్రాంతాలకు కేంద్రం తప్పనిసరిగా ఇచ్చే పనులు కావటం గమనార్హం.

పట్టని పనులు!

- జల్‌ జీవన్‌ మిషన్‌పై అలక్ష్యం

- పట్టించుకోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు

- అన్ని జిల్లాల్లో 300- 350 పనులకు ఆమోదం

- ఉమ్మడి కృష్ణాజిల్లాకు మాత్రం 14 పనులే దక్కాయి..

- అవి కూడా చెంచులు నివాసం ఉండే ప్రాంతాలు కావటంతో తప్పనిసరిగా ఇచ్చినవే!

- రూ.6,063 కోట్ల వ్యయంతో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారీ

- ఆమోదం పొంది.. మనకు శాంక్షన్‌ రావటానికి మరింత సమయం

- జిల్లాలో పనులు లేక పొరుగు జిల్లాలకు కాంట్రాక్టర్లు

జల్‌ జీవన్‌ మిషన్‌ను అందిపుచ్చుకోవడంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం తడబడుతోంది. ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా ఇతర జిల్లాల కంటే మన జిల్లా బాగా వెనుకబడింది. ఒక్కో జిల్లా 300 పనులు చొప్పున దక్కించుకుంటే మన జిల్లాకు కేవలం 14 తాగునీటి పైపులైన్ల పనులే మంజూరయ్యాయి. ఇవి కూడా చెంచులు ఎక్కువుగా ఉండే ప్రాంతాలకు కేంద్రం తప్పనిసరిగా ఇచ్చే పనులు కావటం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గ్రామాల్లో ప్రతి గృహానికి కుళాయి ద్వారా తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం

జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో నడుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయలేదు. దీంతో చాలా పనులు ఆగిపోయాయి. అసంపూర్తిగా ఎక్కడివక్కడ ఉండి పోయాయి. వీటిలో ఎంతో ప్రాధాన్యమైన పనులు కూడా కొన్ని ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పనుల ప్రాధాన్యతను గుర్తించి పలు జిల్లాలు కొన్ని పనులను ప్రభుత్వానికి ప్రతిపాదనలుగా సమర్పించి, వాటికి ఆమోదం తెచ్చుకున్నాయి. పొరుగున ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా 300 పైబడి పనులను తిరిగి తెచ్చుకుంది. ఎక్కడో దూరాన ఉండే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కూడా 300 పైబడి పనులను తిరిగి సాధించుకుని వాటిని చేపడుతోంది. ఇక్కడే ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టుమని 100 పనులను కూడా తెచ్చుకోలేకపోయింది. కేవలం 14 తాగునీటి పైపులైన్ల పనులే మంజూరయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో కంచికచర్ల మండలం పరిధిలో 9 పనులు, విజయవాడ రూరల్‌ మండలం పరిధిలో 5 పనులు మాత్రమే మంజూరయ్యాయి. వీటికి టెండర్లు పిలిచారు. అగ్రిమెంట్ల దశలో ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండల పరిధిలో టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు పనులకు ఆసక్తి చూపిస్తారా ? వదిలేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

తమది కాదన్నట్టు వ్యవహరించారు!

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. రెండు జిల్లాల్లోని ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రాధాన్యతా పనుల జాబితా తెప్పించుకుని వాటి సాకారానికి కృషి చేయాల్సిన ఉన్నతాధికారులు తమది కాదన్నట్టుగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఇక్కడ బలవంతంగా పనిచేస్తున్నారని సమాచారం. ఎప్పుడు వెళ్లిపోదామా అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారు జిల్లాలో ఈ పనులపై ఎంత వరకు శ్రద్ధ చూపుతారన్నది అర్థం చేసుకోవచ్చు. చెంచులు నివశించే ప్రాంతాలు లేకపోతే ఈ 14 పనులు కూడా మనకు వచ్చేవి కావని తెలిసింది.

పొరుగు జిల్లాలకు తరలిన కాంట్రాక్టర్లు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పనులు లేకపోవటంతో ఇక్కడి కాంట్రాక్టర్లు ఇతర జిల్లాలకు తరలి వెళ్లిపోయారు. అక్కడ పనులు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులే కారణమని విమర్శలు వస్తున్నాయి.

వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు విషయంలోనూ తాత్సారం

ఉమ్మడి కృష్ణాజిల్లాకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.6,063 కోట్ల వ్యయంతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ నేతృత్వంలో డీపీఆర్‌ తయారు చేశారు. పాత పనులను పూర్తిగా వదిలేసి.. కొత్త పనులపై దృష్టి సారించారు. 50 మండలాల పరిధిలో నూరుశాతం రక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశ్యంతో సమగ్ర డీపీఆర్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కలిసిన ప్రాంతాలను కూడా ఉమ్మడి కృష్ణా డీపీఆర్‌లో చేర్చటం జరిగింది. ఈ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించటంలోనూ అంతులేని జాప్యం జరిగింది. ప్రభుత్వం నుంచి తెచ్చుకునే విషయంలో కూడా జాప్యం జరుగుతూ వస్తోంది. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగంగా పులిచింతల నుంచి జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలకు మంచినీటిని ఒడిసి పట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ ద్వారా గొల్లపూడి నుంచి తిరువూరు నియోజకవర్గంలో మూడు మండలాలు, మైలవరం నియోజకవర్గం పరిధిలో విజయవాడ రూరల్‌ మండలానికి కృష్ణా నీటిని తీసుకువెళ్లేలా నిర్ణయించారు. వీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలకు పాక్షికంగా మంచినీటి అవసరాలను తీర్చటం జరుగుతోంది. తాజా వాటర్‌గ్రిడ్‌ డీపీఆర్‌లో ఆయా మండలాలకు పూర్తి స్థాయిలో మంచినీటిని అందించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలోని ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు కూడా సంపూర్ణంగా కృష్ణాజలాలను తీసుకు వెళ్లేందుకు వీలుగా ప్రతిపాదనలు చేశారు. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితులను బట్టి మొదటి దశలో ప్రాధాన్యతా క్రమంలో ఎంత వరకు శాంక్షన్‌ ఇస్తుందన్నదానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే నోటి ఫైడ్‌ అయి, టెండర్లు పిలిచిన పనులలో ప్రాధాన్యత కలిగిన వాటిపై నిర్లక్ష్యం చూపటం వల్ల క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Updated Date - Sep 14 , 2025 | 01:24 AM