లాటరీ తగిలిందని రూ.38 లక్షలు కొట్టేశారు
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:48 AM
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ వ్యక్తి రూ.38 లక్షలు పోగొట్టుకున్న ఘటన మండలంలో వెలుగు చూసింది.
-సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన నూజెళ్ల వాసి
- ఏడాది వ్యవధిలో విడతల వారీగా నగదు బదిలీ
- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి..
గుడివాడ రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ వ్యక్తి రూ.38 లక్షలు పోగొట్టుకున్న ఘటన మండలంలో వెలుగు చూసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుడివాడ మండలం నూజెళ్ల గ్రామానికి చెందిన దాసరి హరి గంగాధర్‌కు 2024, జూన్ 13వ తేదీన దుబాయ్ ఫౌండేషన్/దుబాయ్ ఇస్లామిక్ బ్యాంకు పేరుతో ఫోన్ సందేశం వచ్చింది. ఆ సందేశంలో గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ లాటరీలో రూ.1.86 కోట్లు గెలుచుకున్నట్లు ఉంది. లాటరీలో గెలిచిన మొత్తం రావాలంటే కొంతమేర ఖర్చు అవుతుందని, తమ బ్యాంకు ఖాతా, ఫోన్‌పేలకు నగదును పంపాలంటూ సందేశాలు పంపించారు. కోట్లాది రూపాయల లాటరీ తగిలిందనే ఆనందంతో గంగాధర్ వచ్చిన సందేశాలపై ఎటువంటి ఆరా తీయకుండా, వారు చెప్పిన విధంగా రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకు విడతల వారీగా వారి ఖాతాలకు ఏడాదిగా రూ.38 లక్షలు చెల్లించాడు. నెల రోజుల క్రితం మళ్లీ రూ.1.85 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు కోరడంతో, అనుమానం వచ్చి తాను మోసపోయినట్లు గ్రహించి గుడివాడ రూరల్ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. సెక్షన్ 420, ఐ.టి యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్.చంటిబాబు తెలిపారు.