Share News

మెటీరియల్‌ మెక్కేశారు!

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:10 AM

గృహ నిర్మాణశాఖలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా చేతివాటం ప్రదర్శించడం మాత్రం ఆగడంలేదు. తాజాగా పెడన మండలంలో 36 మంది లబ్ధిదారుల సిమెంట్‌, ఇనుము పక్కదారి పట్టించారు. సుమారు 12 లక్షలపైనే నొక్కేసిన ఈ వ్యవహారంలో పూర్వ ఏఈ హస్తం ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన జిల్లా స్థాయి అధికారులు పట్టనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మెటీరియల్‌ మెక్కేశారు!

- గృహనిర్మాణశాఖలో అవినీతి

- పెడన మండలంలో 36 మంది లబ్ధిదారుల సిమెంట్‌, ఇనుము పక్కదారి

- నిర్మాణాలు చేపట్టని గృహాలకు మెటీరియల్‌ ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదు

- వాటి విలువ రూ.12 లక్షలుపైనే.. నాటి ఏఈ నిర్వాకం

- లబ్ధిదారులు మెటీరియల్‌ కోసం వస్తే విషయం వెలుగులోకి..

గృహ నిర్మాణశాఖలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా చేతివాటం ప్రదర్శించడం మాత్రం ఆగడంలేదు. తాజాగా పెడన మండలంలో 36 మంది లబ్ధిదారుల సిమెంట్‌, ఇనుము పక్కదారి పట్టించారు. సుమారు 12 లక్షలపైనే నొక్కేసిన ఈ వ్యవహారంలో పూర్వ ఏఈ హస్తం ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన జిల్లా స్థాయి అధికారులు పట్టనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

పెడన మండలంలోని నడుపూరు, కొప్పల్లె, కాకర్లమూడి, చెన్నూరుతోపాటు మరో నాలుగు గ్రామాల్లో లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు చేశారు. వివిధ కారణాలతో లబ్ధిదారులు గృహనిర్మాణాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. ఇదే అదనుగా భావించిన గతంలో మండలంలో పని చేసిన ఏఈ 36 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సిమెంటు 40 కట్టలు, ఇనుము 40 చువ్వలు చొప్పున ఇచ్చినట్లుగా రికార్డులో నమోదు చేశారు. అయితే ప్రస్తుతం లబ్ధిదారులు తాము గృహాల నిర్మాణం ప్రారంభిస్తామని, మెటీరియల్‌ ఇవ్వమని మండల గృహ నిర్మాణ కార్యాలయానికి వెళ్లి అడిగితే.. మీకు గతంలోనే ఇనుము, సిమెంటు ఇచ్చాం కదా, మళ్లీ ఇవ్వరని కార్యాలయ అధికారులు తెగేసి చెబుతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే లబ్ధిదారుల పేరున మెటీరియల్‌ ఇచ్చినట్లుగా నమోదై ఉన్న రికార్డులను చూపుతున్నారు. ఇలా ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుండటంతో తాము అసలు గృహ నిర్మాణమే ప్రారంభించలేదని, అయినా మెటీరియల్‌ ఇచ్చినట్లుగా ఎలా నమోదు చేశారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బయటకు చెప్పొద్దంటూ ఒత్తిడి

పెడన మండలంలో 36 మంది లబ్ధిదారులకు సిమెంటు, ఇనుము ఇవ్వకున్నా, ఇచ్చినట్లుగా నమోదు చేసిన మెటీరియల్‌ విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా. గతంలో మండలంలో పనిచేసిన ఏఈ ప్రస్తుతం పెడన పట్టణ ఏఈగా బదిలీ అయ్యారు. ఈ బదిలీ కూడా స్థానిక రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులు మండల గృహనిర్మాణ సంస్థ కార్యాలయానికి వచ్చి తమకు సిమెంట్‌, ఇనుము ఇవ్వాలని కోరితే, మీ పేరున గతంలోనే మెటీరియల్‌ ఇచ్చినట్లుగా నమోదై ఉంద ని, పాత ఏఈ వద్దకు వెళ్లాలని చెప్పి పంపేస్తున్నారు. పాత ఏఈ వద్దకు వెళితే ఈ విషయం బయటకు రానీయవద్దని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, మరికొందరు ఈ విషయంలో జోక్యం చేసుకుని మీకు మెటీరియల్‌ ఇస్తారని చెప్పి నమ్మించి తమ చుట్టూ తిప్పుకుంటున్నారని తెలిసింది.

జిల్లా కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగి సహకారంతో..

పెడన మండలంలో పనిచేస్తూ పెడన పట్టణానికి బదిలీ అయిన ఏఈ బంధువు జిల్లా గృహనిర్మాణసంస్థ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్నాడు. జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడైన ఈ ఉద్యోగి పెడన మండలంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రాకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యోగి జిల్లా కార్యాలయంలో పలు అక్రమాలకు పాల్పడినా, అతన్ని అక్కడ నుంచి పంపకుండా, అదే కార్యాలయంలో వేరే సీటును కేటాయించి అధికారులు అక్కడే కొనసాగించడం గమనార్హం. బంధువు అండ చూసుకుని పెడన మండలంలో ఏఈ తనదైన శైలిలో మెటీరియల్‌ను పక్కదారి పట్టించారని గృహనిర్మాణసంస్థ ఉద్యోగులు బాహటంగానే చెప్పుకుంటున్నారు.

కలెక్టర్‌ తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నా..

గృహ నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యం, ఇతరత్రా అంశాలపై కలెక్టర్‌ బాలాజీ గృహ నిర్మాణ సంస్థ అధికారులతో నెలలో రెండు విడతలుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా ఈ సంస్థ అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడంలేదు. అధికారులతో పూర్తిస్థాయిలో పనిచేయించడానికి గత నాలుగు నెలల క్రితం పౌరసరఫరాలశాఖ విజిలెన్స్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ పోతురాజును గృహనిర్మాణసంస్థ ఇన్‌చార్జి పీడీగా కలెక్టర్‌ బాలాజీ నియమించారు. అయినా ఈఈ, డీఈ, ఏఈలు తమ పనితీరును మెరుగుపరచుకోకపోగా, ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులను తెరవెనుక ఉండి కాపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఏఈల అవినీతి విచారణలో రుజువు కావడంతో కలెక్టర్‌ వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. అక్రమాలకు పూర్తిస్థాయిలో తోడ్పాటును అందించిన డీఈ స్థాయి అధికారికి పదవీ విరమణ అనంతరం వచ్చే బెనిఫిట్‌లను నిలిపివేస్తూ ఆ శాఖ ఉన్నతస్థాయి అఽధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరీ పెడన మండలంలో జరిగిన అక్రమాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - Dec 18 , 2025 | 01:11 AM