Share News

దివ్యాంగుడి బియ్యాన్ని బొక్కేశారు!

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:39 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు వక్కలగడ్డ శ్రీకాంత. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామం. కాళ్లు, చేతులు సక్రమంగా లేకపోవడంతో నడవలేడు.. పనిచేయలేడు. తల్లిందండ్రులు కూడా లేరు. స్థానిక దాతృత్వంతో జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం 2016లో అంత్యోదయ అన్నయోజన బియ్యం కార్డును మంజూరు చేసింది. శ్రీకాంతకు నెలకు 35కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, డోకిపర్రు రేషన్‌ డీలర్‌ కేవలం ఐదుకిలోల బియ్యం మాత్రమే ఇస్తూ వచ్చాడు.

 దివ్యాంగుడి బియ్యాన్ని బొక్కేశారు!

- గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో రేషన్‌ డీలర్‌ నిర్వాకం

- 2016లో వక్కలగడ్డ శ్రీకాంతకు అంత్యోదయ కార్డు మంజూరు

- 35 కేజీల బియ్యానికి ఐదు కేజీలే ఇచ్చి సరిపెడుతున్న డీలర్‌

- కూటమి ప్రభుత్వం ఈ నెలలో 35 కేజీలు ఇవ్వడంతో బయటపడ్డ మోసం

- డీలర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు వక్కలగడ్డ శ్రీకాంత. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామం. కాళ్లు, చేతులు సక్రమంగా లేకపోవడంతో నడవలేడు.. పనిచేయలేడు. తల్లిందండ్రులు కూడా లేరు. స్థానిక దాతృత్వంతో జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం 2016లో అంత్యోదయ అన్నయోజన బియ్యం కార్డును మంజూరు చేసింది. శ్రీకాంతకు నెలకు 35కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, డోకిపర్రు రేషన్‌ డీలర్‌ కేవలం ఐదుకిలోల బియ్యం మాత్రమే ఇస్తూ వచ్చాడు. అదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఒక్కరికి ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేందుకు అనుమతులు ఉన్నాయని బుకాయించాడు. సరిగా మాట్లాడలేని శ్రీకాంత ఇంతకాలంగా ఐదు కిలోల బియ్యం మాత్రమే తీసుకుని సరిపెట్టుకున్నాడు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ద్వారా బియ్యం పంపిణీ జరిగింది. శ్రీకాంతకు నెలకు కేవలం ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇవ్వాలని రేషన్‌ డీలర్‌ చెప్పడంతో ఎండీయూ ఆపరేటర్‌ కూడా అలాగే ఇస్తూ వచ్చాడు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌ డీలర్‌ మారడంతో ఈ నెలలో శ్రీకాంతకు 35 కిలోల బియ్యం వచ్చాయి. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధిత దివ్యాంగుడు తొమ్మిదేళ్ల నుంచి తనను మోసం చేశారని స్థానికుల సాయంతో కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌ బాలాజీకి ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్‌ ఈ విషయంపై వివరాలు ఇవ్వాలని డీఎస్‌వో పార్వతిని ఆదేశించగా, ఆమె ఆన్‌లైన్‌లో పరిశీలించి శ్రీకాంత పేరున నెలకు 35 కిలోల బియ్యం ఇస్తున్నట్లుగా ఉందని తెలియజేశారు. దీంతో వెంటనే పాత రేషన్‌ డీలర్‌, ఎండీయూ వాహన ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

మానవత్వం చాటుకున్న కలెక్టర్‌

శ్రీకాంత నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కలెక్టరేట్‌కు రావడం గమనించిన కలెక్టర్‌ బాలాజీ అతడికి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సేవలను పలువురు ప్రశంసించారు.

Updated Date - Jun 17 , 2025 | 12:39 AM