Share News

తొలగిస్తే పోయేదానికి.. రూ.కోటి అద్దె చెల్లించారు!

ABN , Publish Date - May 14 , 2025 | 01:24 AM

ట్రాన్స్‌కో అధికారుల తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. నాటి అవసరాల కోసం నున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఏర్పాటు చేసిన రెండు ‘బే’లు 2022 నుంచి నిరుపయోగంగా ఉంటున్నాయి. రూ.20 లక్షలు ఖర్చు చేసి తొలగించాల్సిన వీటికి నెలకు రూ.2 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.కోటి అద్దె చెల్లించారు. ఇంకా చెల్లిస్తూనే ఉన్నారు.

తొలగిస్తే పోయేదానికి.. రూ.కోటి అద్దె చెల్లించారు!

- సబ్‌ స్టేషన్లు లేని సమయంలో ‘నున్న పవర్‌ గ్రిడ్‌‘లో 2 ‘బే’ల ఏర్పాటు

- నెలకు రూ.2 లక్షల అద్దె చెల్లిస్తున్న ట్రాన్స్‌కో

- సబ్‌ స్టేషన్ల సంఖ్య పెరగడంతో 2022 నుంచి నిరుపయోగంగా ‘బే’లు

- తొలగించకుండా ఇంకా అద్దె చెల్లిస్తున్న అధికారులు

ట్రాన్స్‌కో అధికారుల తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. నాటి అవసరాల కోసం నున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఏర్పాటు చేసిన రెండు ‘బే’లు 2022 నుంచి నిరుపయోగంగా ఉంటున్నాయి. రూ.20 లక్షలు ఖర్చు చేసి తొలగించాల్సిన వీటికి నెలకు రూ.2 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.కోటి అద్దె చెల్లించారు. ఇంకా చెల్లిస్తూనే ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గతంలో తగినన్ని సబ్‌స్టేషన్లు లేకపోవటంతో విద్యుత సరఫరా అవసరాలను తీర్చటం కోసం విజయవాడ శివారు నున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌)లో రెండు ‘బే’ లను ట్రాన్స్‌కో ఏర్పాటు చేసింది. ఈ ‘బే’ల ద్వారా ట్రాన్స్‌కో లైన్స్‌కు విద్యుత సరఫరా అవుతుంది. కాలక్రమంలో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లను గణనీయంగా పెంచుకుంది. సత్తెనపల్లి, వేమగిరి వంటి జిల్లాయేతర ప్రాంతాల్లో కూడా సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసుకుంది. దీంతో నున్నలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లోని ‘బే’ల అవసరం లేకుండా పోయింది. ఇక్కడ ‘బే’లను నిర్వహిస్తున్నందుకు నెలకు రూ.2 లక్షలు పీజీసీఐఎల్‌కు ట్రాన్స్‌కో అద్దె చెల్లిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ‘బే’ల వినియోగం నిలిచిపోయింది. దీంతో 2022 నుంచి నిరుపయో గంగా ఉంటున్న ఈ ‘బే’లను తొలగించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. వైసీపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లినా కూడా పట్టించుకోకపోవటంతో అప్పటి నుంచి ట్రాన్స్‌కో అధికారులు అద్దె చెల్లిస్తూనే ఉన్నారు. దాదాపుగా నాలుగేళ్లుగా రూ.కోటి వరకు అద్దె చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పది నెలలుగా ట్రాన్స్‌కో అధికారులు ఉత్త పుణ్యానికి పీజీసీఎల్‌ఐకి అద్దె చెల్లిస్తున్నారు. నున్న పవర్‌ గ్రిడ్‌లో ఉన్న రెండు ‘బే’లను తొలగించటానికి రూ.20 లక్షలు ఖర్చు చేస్తే సరిపోతోంది. ఈ పని చేయటానికి ట్రాన్స్‌కో అధికారులకు చేతులు రావటం లేదు. టెండర్లు పిలుస్తున్నారు కానీ మళ్లీ ఎందుకు ఆగిపోతుందో అర్థం కావటం లేదు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ట్రాన్స్‌కోపై పడుతున్న అద్దె భారాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 14 , 2025 | 01:24 AM