5 నెలలు ఇచ్చి పింఛను ఆపేశారు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:57 AM
‘‘నా కుమార్తె పుట్టకతోనే దివ్యాంగురాలు. వైద్యులు పరిశీలించి నూరుశాతం అంగవైకల్యం ఉందని సర్టిఫికెట్ రాసిచ్చారు. ఐదు నెలల పాటు పింఛను ఇచ్చిన అధికారులు ఉన్నట్టుండి ఇవ్వడం మానేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పింఛను పునరుద్ధరిం చాలని మచిలీపట్నం హెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే సజ్జా చిన్నాదేవి కలెక్టర్ బాలాజీని వేడుకుంది.
- నూరుశాతం అంగవైకల్యం ఉన్నా ఇవ్వడంలేదు
- పింఛను వెంటనే పునరుద్ధరించండి
- కలెక్టర్‌కు దివ్యాంగురాలి తల్లి వేడుకోలు
మచిలీపట్నం/మచిలీపట్నం టౌన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘నా కుమార్తె పుట్టకతోనే దివ్యాంగురాలు. వైద్యులు పరిశీలించి నూరుశాతం అంగవైకల్యం ఉందని సర్టిఫికెట్ రాసిచ్చారు. ఐదు నెలల పాటు పింఛను ఇచ్చిన అధికారులు ఉన్నట్టుండి ఇవ్వడం మానేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పింఛను పునరుద్ధరిం చాలని మచిలీపట్నం హెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే సజ్జా చిన్నాదేవి కలెక్టర్ బాలాజీని వేడుకుంది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు తన కుమార్తెను తీసుకువచ్చింది. ఆమె నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉంది. గమనించిన కలెక్టర్ బాలాజీ నేరుగా ఆమె వద్దకు వచ్చి సమస్య అడిగి తెలుసుకున్నారు. పుట్టకతోనే దివ్యాంగురాలు అయిన తన కుమార్తె నడవలేదని, మాట్లాడలేదని ఆమె తల్లి తెలిపింది. వైద్యులు పరిశీలించి నూరుశాతం అంగవైకల్యం ఉన్నట్టు నిర్ధారించారని చెప్పింది. ఆ రిపోర్టుల ఆధారంగా ఐదు నెలల పాటు పింఛను ఇచ్చారని, ఆ తర్వాత ఎందుకు రద్దు చేశారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఏ పని చేయలేని తనకు ఇద్దరు దివ్యాంగ పిల్లలు ఉన్నారని కన్నీరు పెట్టుకుంది. వారికి పింఛను ఇప్పించాలని వేడుకుంది. స్పందించిన కలెక్టర్ బాలాజీ పింఛను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజల నుంచి అందే మీ కోసం అర్జీలను, ఉద్యోగుల సమస్యలను ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీకోసం ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తొలుత ఉద్యోగుల గ్రీవెన్స్ దినోత్సవం నిర్వహించి ఉద్యోగుల నుంచి అర్జీలు అందుకున్నారు. సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో మొత్తం 149 మీకోసం అర్జీలు రాగా, 10 ఉద్యోగుల అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో మాట్లాడుతూ 11 ప్రభుత్వ శాఖల నుంచి ఉత్తమ విధానాలకు సంబంధించిన నివేదికలు మిగిలిన శాఖలు కూడా వెంటనే సీపీవోకు అందజేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల లబ్ధిదారుల విజయగాధలను డీఆర్‌డీఏ పీడీకి ఇవ్వాలని సూచించారు. డీటీడబ్ల్యూవో ముస్తాబు కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్లు, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రభుత్వ నియమాలు 2023 తెలుగు, ఆంగ్ల భాషలో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్, డీఎస్‌వో మోహన్‌బాబు, డీపీవో జె.అరుణ, పశుసంవర్ధకశాఖ జేడీ అయ్యా నాగరాజు, డీటీడబ్ల్యూవో ధూర్జటి పహాని, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.