రూ.కోటి పరిహారం కాలదన్నుకున్నారు!
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:19 AM
దుర్గామల్లేశ్వరస్వామి దత్తత ఆలయమైన గూడవల్లిలోని కోదండరామాలయం భూముల విషయంలో దేవదాయశాఖ నిర్లక్ష్యం మరొకటి వెలుగు చూసింది. గూడవల్లిలో బుడమేరు కాలువ వెంబడి ఉన్న భూములను కాలువ విస్తరణ కోసం తీసుకున్నారు. ఈ విషయం ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఈ భూములకు రావాల్సిన పరిహారం రూ. కోటి వరకు దేవస్థానం కోల్పోవాల్సి వచ్చింది.
-గూడవల్లిలో దుర్గామల్లేశ్వరస్వామి దత్తత ఆలయం
-కోదండరామాలయానికి సర్వే నెంబరు 202/1లో 6.25 ఎకరాల భూమి
- బుడమేరు విస్తరణ కోసం 2.69 ఎకరాలు తవ్వేసిన ఇరిగేషనశాఖ
- ఇప్పటి వరకు పరిహారం కోరని దేవస్థానం అధికారులు
- స్థానికుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన విజయవాడ ఆర్‌డీవో
-విజయవాడ రూరల్ తహసీల్దార్ పరిశీలన.. నష్టపరిహారానికి సిఫార్సు
దుర్గామల్లేశ్వరస్వామి దత్తత ఆలయమైన గూడవల్లిలోని కోదండరామాలయం భూముల విషయంలో దేవదాయశాఖ నిర్లక్ష్యం మరొకటి వెలుగు చూసింది. గూడవల్లిలో బుడమేరు కాలువ వెంబడి ఉన్న భూములను కాలువ విస్తరణ కోసం తీసుకున్నారు. ఈ విషయం ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఈ భూములకు రావాల్సిన పరిహారం రూ. కోటి వరకు దేవస్థానం కోల్పోవాల్సి వచ్చింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణాజిల్లా గూడవల్లిలోని సర్వే నెంబర్ 202/1లో 6.25 ఎకరాల భూమి ఉంది. బుడమేరు కాలువ పక్కనే ఈ భూములు ఉన్నాయి. ఐదేళ్ల కిందట బుడమేరు ఆధునీకరణ పనుల నిమిత్తం కాలువను విస్తరించాల్సి వచ్చింది. ఇరిగేషన ప్రతిపాదనల మేరకు అప్పటి జిల్లా యంత్రాంగం భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. కాలువ పక్కనే ఉండటం వల్ల దుర్గామల్లేశ్వరస్వామి దత్తత ఆలయమైన కోదండరామాలయానికి చెందిన 6.25 ఎకరాలలో 3.60 సెంట్ల భూమి కావాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత విస్తరణలో భాగంగా 2.69 ఎకరాల భూమిని మాత్రమే తవ్వారు. కానీ, దేవస్థానానికి ఎలాంటి పరిహారాన్ని చెల్లించలేదు. కనీసం దేవస్థాన భూములను తీసుకుంటున్నట్టు కూడా తెలపలేదు. కాలువ తవ్విన తర్వాత విషయం తెలిసింది. కానీ అటు దేవస్థానం అధికారులు కానీ, ఇటు దేవదాయ శాఖ అధికారులు కానీ పరిహారాన్ని డిమాండ్ చేయలేదు. ఇదిలా ఉండగా.. స్థానికులు కొందరు విజయవాడ ఆర్‌డీవోకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ ఆర్‌డీవో విచారణకు ఆదేశించారు. విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణకు బాధ్యతలు అప్పగించారు. ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరిపి ఆర్డీవోకు నివేదిక ఇచ్చారు. కోదండరామాలయానికి ఎంత భూమి ఉంది? ఎంత అప్పట్లో తవ్వటం జరిగింది ? అన్న వివరాలను పొందుపరుస్తూ ఈ భూములకు నష్టపరిహారం చెల్లించాలని సిఫార్సు చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా తహశీల్దార్ కోరారు. దీనిని బట్టి పరిహారానికి అర్హతమైనదని తెలుస్తోంది. స్థానిక ప్రజలు చూపిస్తున్న శ్రద్ధను దేవస్థాన అధికారులు కానీ, దేవదాయశాఖ అధికారులు కానీ మచ్చుకు కూడా శ్రద్ధ చూపించటం లేదు.
భూములపై ఎందుకింత నిర్లక్ష్యం?
గూడవల్లిలోని కోదండ రామాలయానికి గ్రామంలోనే సర్వే నెంబర్ 314లో 1.10 ఎకరాలు, సర్వే నెంబర్ 23/3ఏలో 1.50 ఎకరాలు, సర్వే నెంబరు 207లో 8 ఎకరాలు, సర్వే నెంబర్ 202/1, 2022/3లో 8.27 ఎకరాలు మాగాణి భూమి ఉంది. నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలోని సర్వే నెంబర్ 334లో 8.24 ఎకరాల మాగాణి భూమి ఉంది. దీన్ని చేపల చెరువుగా తవ్వేశారు. కోదండరామాలయం భూములపై దేవస్థాన అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థం కావటం లేదు.