నిధులు దోచేసి.. నిజాలు దాచేస్తున్నారు!
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:13 AM
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామంటూ గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు - నేడు పథకం మోపిదేవి మండలంలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పనులు చేయకుండా నిధులు డ్రా చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ఒరవడిని కొనసాగించారు. నిధులు దోచేసి..నిజాలను దాచేస్తున్నారని తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
-మోపిదేవి గురుకుల పాఠశాల అభివృద్ధికి రూ.50.99 లక్షలు మంజూరు
- నాడు- నేడు ఫేజ్-2 భాగంగా చేపట్టిన పనుల్లో అక్రమాలు
- పనులు చేయకుండానే నిధులు డ్రా చేసిన వైనం
- కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అక్రమాలు కొనసాగింపు!
- చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామంటూ గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు - నేడు పథకం మోపిదేవి మండలంలో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పనులు చేయకుండా నిధులు డ్రా చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే ఒరవడిని కొనసాగించారు. నిధులు దోచేసి..నిజాలను దాచేస్తున్నారని తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అవనిగడ్డ/మోపిదేవి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వంలో నాడు - నేడు ఫేజ్-2 భాగంగా మోపిదేవి మండలంలోని బీసీ మత్స్యకారుల ఆశ్రమ పాఠశాలకు రూ.50.99 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ పనులకు నాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు 2022, సెప్టెంబరు 17వ తేదీన శంకుస్థాపన చేశారు. నాటి నుంచి పనులు నత్తనడకన జరగటంతోపాటు పనులు చేయకుండానే నిధులు డ్రా చేశారనే ఆరోపణలు రావటంతో ఆ పనులు నిలుపుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులు జరిగిన తీరు వివాదాస్పదంగా ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాలని రాష్ట్ర విద్యాశాఖ జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. సదరు ఆదేశాలను జిల్లా కలెక్టర్, మండల విద్యాశాఖ కార్యాలయాలకు పంపించినప్పటికీ మోపిదేవి మండలంలో మాత్రం ఈ పనులను కొనసాగించిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ నాడే ‘ఇదేం తీరు’ అంటూ వెలుగులోకి తీసుకొచ్చింది. పాఠశాల భవన సామర్థ్యం గట్టిగా లేదని, అందువల్ల భవనంపై ఏ విధమైన నిర్మాణాలు చేపట్టరాదని ఇంజనీరింగ్ అధికారులు లిఖిత పూర్వకంగా లేఖలు అందించినప్పటికీ భవనంపై వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. నాడు-నేడు పనుల్లో భాగంగా 50.99 లక్షలతో టాయిలెట్ బ్లాక్, డ్రింకింగ్ వాటర్, మేజర్, మైనర్ పనులు, విద్యుద్దీకరణ, ఫర్నీచర్ ఏర్పాటు, పెయిటింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా, జూలై నాటికి ఆ పనుల్లో 50 శాతం కూడా పూర్తి కానప్పటికీ దాదాపు రూ.19 లక్షలకుపైగా నిధులను గత ప్రభుత్వ హయాంలోనే డ్రా చేసుకోవటం విమర్శలకు తావిచ్చింది. ఆ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన వారు పనులు పూర్తి కాకుండానే మిగిలిన రూ.19 లక్షల మొత్తాన్ని డ్రా చేయగా, జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించటంతో ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో నాడు జరిగిన నిధుల దుర్వినియోగం కప్పి పుచ్చేందుకు నేడు ప్రయత్నాలు సాగుతున్నాయి.
అసంపూర్తిగా పనులు :
భవన నిర్మాణ పనుల్లో ముఖ్యమైన టాయిలెట్ బ్లాక్, వంటగది పనులు సగం కూడా పూర్తి కాలేదు. మేజర్, మైనర్ రిపేర్లు ఎక్కడివి అక్కడే మిగిలిపోగా, కిటికీలు లేని తలుపులు విరిగి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి పాఠశాలకు, వంటగదికి, టాయిలెట్లకు నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే పనులు పూర్తి కాకుండానే దాదాపు రూ.19 లక్షల మేర నిధులను డ్రా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ పనులను ఎక్కడివక్కడ నిలిపివేయాలని ఆదేశాలివ్వగా, సదరు బదిలీపై వెళ్లిపోయిన ప్రధానోపాధ్యాయుడి స్థానంలో వచ్చిన వారు నాడు జరిగిన తప్పులను కప్పిపుచ్చేందుకు తమ రాజకీయ పలుకుబడితో ప్రయత్నాలను ప్రారంభించారు. పనులను వెంటనే నిలిపివేయాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ పాఠశాల తరగతుల పైఅంతస్తులో వాటర్ ట్యాంక్ నిర్మించి ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులతో ఆ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా చూపించాలని చేస్తున్న ప్రయత్నాలను ‘ఆంధ్రజ్యోతి’ జూలైలోనే వెలుగులోకి తీసుకొచ్చింది.
డ్రా చేసిన రూ.25 లక్షలకు వివరాల్లేవ్!
ఈ విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా రెండు పర్యాయాలు అధికారులను వివరణ కోరగా, ఒకసారి రూ.25 లక్షల మేర నిధులు డ్రా చేసినట్లుగా సమాచారం ఇచ్చిన విద్యాశాఖాధికారులు, తాజాగా రూ.19.40 లక్షలు విడుదలయ్యాయని, అందులో రూ.18 లక్షలు మాత్రమే ఖర్చు అయినట్లుగా ఇటీవల సమాచారాన్ని అందించారు. ఇంకా చేయాల్సిన పనుల గురించి వివరాలు, డ్రా చేసిన నిధులకు సంబంధించిన తీర్మానాల బుక్, క్యాష్ బుక్ ఇంకా గత ప్రధానోపాధ్యాయులు అందించలేదని మండల విద్యాశాఖ తెలుపుతూ ఎమ్మార్సీలో నమోదైన నగదు ఉపసంహరణ వివరాలను మాత్రమే అందించారు. కానీ, గతంలో డ్రా చేసిన రూ. 25 లక్షలకు సంబంధించి ఎలాంటి వివరాలు అందజేయలేదు. నాడు - నేడు పథకం ఇప్పుడు మనబడి - మన భవిష్యతగా మారింది కానీ రూ.50.99 లక్షలతో జరగాల్సిన పనులు మాత్రం అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగానే మిగిలిపోవటంపై మత్స్యకారులు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు నాడు నేడు పనుల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై స్పందించి స్పష్టమైన సమాచారం ఇవ్వటంతోపాటు వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని నియోజకవర్గానికి చెందిన మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.