జీఎస్టీ తగ్గింపును బొక్కేస్తున్నారు!
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:21 AM
వైద్యం ఖరీదు అయిన ప్రస్తుత పరిస్థితుల్లో మందుల విషయంలో అంతో, ఇంతో జీఎస్టీ ప్రయోజనం రోగులకు దక్కుతుందనే ఉద్దేశంతో మెడిసిన్‌పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ఆ ఫలాలు పేదలకు అందడంలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్పొరేట్ హాస్పిటల్స్‌లోని సింహభాగం మెడికల్ షాపుల నుంచి మార్కెట్‌లో రిటైల్ మందుల దుకాణాల వరకు జీఎస్టీ ప్రయోజనాలను బొక్కేస్తున్నారు. కొత్త ఎంఆర్‌పీలు వచ్చినా పాత ఎంఆర్‌పీలకే అమ్మకాలు యథేచ్ఛగా చేసేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు అటువైపు కన్నెత్తి చూడటంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- మెడికల్ విభాగంలో రిటైల్ వ్యాపారుల దందా!
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొనుగోలుదారులకు అందని జీఎస్టీ ప్రయోజనాలు
- కొత్త ఎంఆర్‌పీలు వచ్చినా పాత ఎంఆర్‌పీలకే అమ్మకాలు
- మెడికల్ షాపుల నిర్వహణ తీరుపై తనిఖీలు నిల్
- విమర్శలు వ్యక్తం చేస్తున్న ప్రజలు
వైద్యం ఖరీదు అయిన ప్రస్తుత పరిస్థితుల్లో మందుల విషయంలో అంతో, ఇంతో జీఎస్టీ ప్రయోజనం రోగులకు దక్కుతుందనే ఉద్దేశంతో మెడిసిన్‌పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ఆ ఫలాలు పేదలకు అందడంలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్పొరేట్ హాస్పిటల్స్‌లోని సింహభాగం మెడికల్ షాపుల నుంచి మార్కెట్‌లో రిటైల్ మందుల దుకాణాల వరకు జీఎస్టీ ప్రయోజనాలను బొక్కేస్తున్నారు. కొత్త ఎంఆర్‌పీలు వచ్చినా పాత ఎంఆర్‌పీలకే అమ్మకాలు యథేచ్ఛగా చేసేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు అటువైపు కన్నెత్తి చూడటంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల వ్యాప్తంగా మొత్తం 700 హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు, మూడు వేల మెడికల్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 600 హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉండగా.. రెండు వేలకుపైగా రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో మరో 100 మెడికల్ హోల్‌సేల్ ఏజెన్సీలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 1000 వరకు మెడికల్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీల నుంచి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం సవరించిన ఎంఆర్‌పీలతోనే రిటైల్ వ్యాపారులకు విక్రయించటం జరుగుతోంది. పాత మందులు ఉండటంతో వాటిపై కొత్త ఎంఆర్‌పీ కూడా వేసి ఇస్తున్నారు. పాత, కొత్త ఎంఆర్‌పీలు మందులపై ఉంటున్నాయి. సవరించిన ఎంఆర్‌పీతో పాటు హోల్‌సేల్ వ్యాపారి లాభం కూడా తగ్గించి ఇవ్వటంతో పాటు, మరికొంత డిస్కౌంట్ కూడా ఇచ్చి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని మందులు, సిరప్‌లు చూద్దాం.. డయటాల్ డీ క్యాప్స్ (10 ట్యాబ్లెట్స్ షీట్) పాత ఎంఆర్‌పీ రూ.150 కాగా, కొత్త ఎంఆర్‌పీ రూ.133.47 ఇచ్చారు. ఈ ఎంఆర్‌పీపై విక్రయించేందుకు రిటైల్ దుకాణదారుడికి లాభం రావాలి కాబట్టి ట్యాబ్లెట్ షీట్‌ను రూ.101.70లకే అందిస్తున్నారు. డిస్కౌంట్‌గా మరో రూ.12 ఇస్తున్నారు. దీంతో అసలు ట్యాబ్లెట్ షీట్ రూ.90 మాత్రమే ఉంటోంది. కానీ రిటైల్ వ్యాపారులు రూ. 150లకు విక్రయిస్తూ ఆ ట్యాబ్లెట్ షీట్ మీద రూ. 60 లాభం పొందుతున్నారు. ఇందులో కొనుగోలుదారులకు రూ.35 వరకు ప్రయోజనం దక్కాల్సి ఉన్నా దక్కటం లేదు. డయటాల్ క్యాప్స్ పాత ఎంఆర్‌పీ రూ. 125 కాగా, కొత్త ఎంఆర్‌పీ రూ.111.23గా ఉంది. లైజోఫోర్స్ 600 ట్యాబ్లెట్స్ పాత ఎంఆర్‌పీ రూ.399,39 కాగా, కొత్త ఎంఆర్‌పీ రూ.374.43 గా ఉంది. ఇలా పలు రకాల మందుల మీద కేంద్రం తగ్గించిన జీఎస్టీ మినహాయింపులను రిటైల్ వ్యాపారులకు అందిస్తున్నారు. కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం నూటికి 90 శాతం పైగా ఎక్కడా జీఎస్టీ ప్రయోజనాలను తమ దగ్గర మందులను కొనుగోలు చేసే వారికి అందించటం లేదు. మెడికల్ హోల్‌సేల్ ఏజెన్సీల నుంచి కొత్త ఎంఆర్‌పీల మేరకు మందులను కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఇంకా పాత ఎంఆర్‌పీ ధరలకే విక్రయిస్తున్నారు. మందులకు సంబంధించిన జీఎస్‌టీలో ప్రభుత్వం 18 శాతం నుంచి 5 శాతం, 12 శాతం నుంచి 5 శాతం మార్పు చేసింది. దీంతో కొనుగోలుదారుల మీద మందుల భారం తగ్గుతుందనుకుంటే.. రిటైల్ వ్యాపారుల నిర్వాకం వల్ల అది నెరవేరటం లేదు.
పట్టించుకునే నాథుడు కరువు!
జీఎస్టీ ప్రయోజనాలు మందుల కొనుగోలుదారులకు దక్కుతున్నాయా లేదా అని తెలుసుకొనే వ్యవస్థలు కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ చేసే వ్యవస్థలు కానీ లేవు. జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏనాడో చేతులెత్తేసింది. కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్న విజిలెన్స్ విభాగం అయినా మెడికల్ షాపులపై దాడులు జరుపుతుందా అంటే అదీ లేదు. కొనుగోలుదారుల ప్రయోజనాలను వ్యాపారులు బొక్కేస్తుంటే ఏ వ్యవస్థ కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.