కాల్వల నీటిని కాజేస్తున్నారు
ABN , Publish Date - May 11 , 2025 | 01:20 AM
ఇసుక, మట్టి, భూములే కాదు.. నీటిని కూడా దోచేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఏమాత్రం భయం లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. పంచాయతీల్లోని చెరువులను నింపేందుకు ప్రభుత్వం మంచినీటిని వదిలితే.. ఆ నీటితో తమ చేపల చెరువులను నింపుకొంటున్న వైసీపీ నాయకుల బండారం నందివాడ మండలంలో బయటపడింది. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు పాలేటి చంటి.. కాల్వల నుంచి నేరుగా చెరువుల్లోకి తూములను ఏర్పాటు చేసుకుని, మోటార్లను పెట్టుకుని నీటిచౌర్యానికి పాల్పడుతున్నారు.
- దోసపాడు కాల్వలో వైసీపీ నాయకుల నీటి దోపిడీ
- చెరువులు నింపేందుకు ప్రభుత్వం నీటి విడుదల
- ఆ నీటిని చేపల చెరువులకు మళ్లిస్తున్న ఘనులు
- తూములు, మోటార్ల ద్వారా నీటిచౌర్యం
- పట్టించుకోని అధికారులు, ప్లానింగ్ కమిటీ
- వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, కొడాలి నాని ముఖ్య అనుచరుడు పాలేటి చంటి నిర్వాకం
ఇసుక, మట్టి, భూములే కాదు.. నీటిని కూడా దోచేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఏమాత్రం భయం లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. పంచాయతీల్లోని చెరువులను నింపేందుకు ప్రభుత్వం మంచినీటిని వదిలితే.. ఆ నీటితో తమ చేపల చెరువులను నింపుకొంటున్న వైసీపీ నాయకుల బండారం నందివాడ మండలంలో బయటపడింది. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు పాలేటి చంటి.. కాల్వల నుంచి నేరుగా చెరువుల్లోకి తూములను ఏర్పాటు చేసుకుని, మోటార్లను పెట్టుకుని నీటిచౌర్యానికి పాల్పడుతున్నారు.
ఆంధ్రజ్యోతి, గుడివాడ : నందివాడ మండలంలోని పంచాయతీ చెరువులను నింపేందుకు దోసపాడు కాల్వకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20న మంచినీటిని వదిలింది. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు పెదవిరివాడ సెంటర్‌లో కుదరవల్లి ఆయకట్టు వద్ద సుమారు 160 ఎకరాల్లో రెండు చేపల చెరువులున్నాయి. ఇటీవల చేపలను పట్టుబడి చేసి చెరువులను ఎండగట్టారు. వీటిలో 80 ఎకరాల చెరువుకు బుడమేరు నుంచి మోటార్ల సహాయంతో నీటిని నింపగా, మరో 80 ఎకరాల చెరువుకు దోసపాడు కాల్వ నుంచి నేరుగా తూములను ఏర్పాటుచేసి నీటిచౌర్యానికి పాల్పడుతున్నారు. కాల్వలో నీరు పుష్కలంగా ఉన్న క్రమంలో గ్రావిటీ ద్వారా నేరుగా తూముల నుంచి, కాల్వలో నీరు కొంచెం తగ్గడంతో దాదాపు 10 మోటార్లను పెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా చెరువును నింపేసుకుంటున్నారు.
కొడాలి నాని ముఖ్య అనుచరుడి నీటిచౌర్యం
మాజీమంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు పాలేటి చంటికి తుమ్మలపల్లి ఆయకట్టులో 30 ఎకరాల చేపల చెరువు ఉంది. ఇటీవల చేపల పట్టుబడి చేసి చెరువులను ఎండగట్టారు. ఆ చెరువుకు దోసపాడు కాల్వ నుంచి నేరుగా మూడు తూములను ఏర్పాటు చేసుకున్నారు. తూముల ద్వారా కొంతమేర చెరువును నింపి, మిగిలిన భాగాన్ని ఆరు మోటార్ల సాయంతో నింపేసుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా నీటిచౌర్యం జరుగుతున్నా కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
నందివాడ డ్రాప్ వరకు ఫుల్
దోసపాడు కాల్వలో నందివాడ డ్రాప్ వరకు నీరు పుష్కలంగా ఉంటుంది. కట్టలు తెగే స్థాయిలో ఇక్కడ నీటి నిల్వలు ఉంటాయి. అయితే, రామాపురం సెంటర్‌కు వచ్చేసరికి కాల్వలో అడుగు లోతు నీరు కూడా కనిపించదు. నీటిచౌర్యం వల్లే ఈ పరిస్థితి వస్తోందని పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ అధికారుల డ్రామా
పగలు రాత్రి తేడా లేకుండా అక్రమార్కులు మంచినీటిని దోచేస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవట్లేదు. అనుమతులు లేకుండా కాల్వల నుంచి నేరుగా తూములను ఏర్పాటు చేసుకున్నా కనీస చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైనా పర్యవేక్షణకు వస్తున్నారని తెలిస్తే ఆ పూటకు చేపల చెరువుల వారితో తూములను కట్టించడం లేదా మోటార్లను నిలుపుదల చేయడం చేస్తున్నారు. ఈ వారంలో నీటి సరఫరా నిలుపుదల చేయనున్న నేపథ్యంలో పంచాయతీ చెరువులు ఏస్థాయి వరకు నిండుతాయో వేచి చూడాలి. కాగా, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కాల్వ ద్వారా నీటి తరలింపును పరిశీలించేందుకు వస్తున్నారనే సమాచారంతో రెండు రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులు పాలేటి చంటి చెరువుపై ఉన్న మోటార్లను నిలుపుదల చేయించారు.
యాక్షన్ ప్లానింగ్ కమిటీ ఎక్కడ?
నీటిచౌర్యం జరగకుండా, పంచాయతీ చెరువులను సకాలంలో నింపాలనే ఆలోచనతో మండల స్థాయిలో యాక్షన్ ప్లానింగ్ కమిటీని నియమించారు. దీనిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్, ఏఈ ఇరిగేషన్, ఫిషరీస్ డీవో, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో కూడిన కమిటీని నియమించారు. మండలంలో ఎక్కడా కూడా కమిటీ పర్యవేక్షణకు వెళ్లిన దాఖలాలు లేవు. ఫిషరీస్ డీవో, ఇరిగేషన్ ఏఈ మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.
ఆ చెరువులు నిండేదెప్పుడు?
దోసపాడు కాల్వ ద్వారా మండలంలోని వెంకటరాఘవాపురం, వెన్ననపూడి, పెదవిరివాడ, కుదరవల్లి శివారు సూర్యప్రకాశ్‌పేటకు చెందిన పంచాయతీ చెరువులు నిండటం ప్రశ్నార్థకంగా మారింది. కాల్వ నీటిని చేపల చెరువుల యజమానులు అక్రమంగా తరలించుకుపోయారని, కాల్వలో ప్రవాహం కూడా తగ్గిందని, పంచాయతీ చెరువులు పూర్తిస్థాయిలో నింపే పరిస్థితి లేదని ఆయా గ్రామాల సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.
ఇరిగేషన్ అధికారులే అమ్మేసుకుంటున్నారు
నందివాడ వరకు కాల్వలో భారీస్థాయిలో నీరు ఉంది. రామాపురానికి వచ్చేసరికి అడుగు లోతు ఉండట్లేదు. కాల్వలో నీరు పుష్కలంగా వచ్చిన నాడే పంచాయతీ చెరువులను నింపుతా. మోటార్లు పెట్టి నీటిని తోడితే పంచాయతీపై అదనపు భారం పడుతుంది. చేపల చెరువులకు కాల్వ నీటిని ఇరిగేషన్ అధికారులే అమ్మేసుకుంటున్నారు.
- కాకరాల సురేశ్, వెంకటరాఘవాపురం సర్పంచ్, నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు