తవ్వేస్తున్నారు..!
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:36 AM
జిల్లాలో మట్టి, బసుక మాఫియా దందా జోరుగా సాగుతోంది. బుడమేరులో మోపర్రు వద్ద వందలాది లారీల మట్టిని తవ్వి సమీప ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన వందల ఎకరాల భూముల్లో అక్రమార్కులు బుసక దందాకు తెరలేపారు. యథేచ్ఛగా తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిం చేస్తున్నారు. ఇదేంటి ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. తోట్లవల్లూరు మండలంలో ఏకంగా బందరు కాలువ గట్టుకే ఏసరు పెట్టారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. వరదలు వస్తే గట్టు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇంతలా మట్టి, బుసక మాఫియా రెచ్చిపోతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

-జిల్లాలో మట్టి, బుసక దందా!
-బుడమేరులో మోపర్రు వద్ద జోరుగా మట్టి తవ్వకాలు
-మచిలీపట్నంలోని ముడా భూముల్లో బుసక అక్రమ రవాణా
- తోట్లవల్లూరులో కాలువ గట్టుకు ఏసరు!
- నాగాయలంకలో రాత్రివేళ అక్రమాలు
- ఈ దందాల వెనుక వైసీపీ నాయకులు హస్తం!
- ప్రజల నుంచి ఫిర్యాదులు.. పట్టించుకోని అధికారులు
జిల్లాలో మట్టి, బసుక మాఫియా దందా జోరుగా సాగుతోంది. బుడమేరులో మోపర్రు వద్ద వందలాది లారీల మట్టిని తవ్వి సమీప ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన వందల ఎకరాల భూముల్లో అక్రమార్కులు బుసక దందాకు తెరలేపారు. యథేచ్ఛగా తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిం చేస్తున్నారు. ఇదేంటి ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. తోట్లవల్లూరు మండలంలో ఏకంగా బందరు కాలువ గట్టుకే ఏసరు పెట్టారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. వరదలు వస్తే గట్టు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇంతలా మట్టి, బుసక మాఫియా రెచ్చిపోతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
గుడివాడ నియోజకవర్గంలోని పెదపారుపూడి మండలం మోపర్రు సమీపంలో బుడమేరు గట్టును ఇష్టారాజ్యంగా తవ్వి వందలాది టిప్పర్ల మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఉంగుటూరు. గన్నవరం, గండిగుంట, ఉయ్యూరు తదితర ప్రాంతాలకు ఈ మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అధికారులు హడావుడి చేస్తే ఒక రోజు పనులు నిలిపివేసి, మరుసటి రోజు నుంచే యథావిధిగా మట్టిని తరలించేస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
ముడా భూముల్లో బుసక తవ్వకాలు
మచిలీపట్న మండలంలోని కరగ్రహారం, గోపువానిపాలెం, గిలకలదిండి, తపశిపూడి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల నుంచి బుసకను అక్రమంగా తరలించేస్తున్నారు. పోర్టు నిర్మాణం కోసం రైతులు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)కి 600 ఎకరాలు విక్రయించారు. ఆ భూముల్లో బుసక తవ్వకాలు చేపట్టారు. కరగ్రహారం, తదితర గ్రామాల నుంచి పోతేపల్లి సమీపంలో జాతీయ రహదారి సమీపంలో ఒక జూనియర్ కళాశాల పక్కనే ఉన్న 15 ఎకరాల భూమిని మెరక చేసేందుకు ఇటీవల కాలంలో ఐదు వేల ట్రాక్టర్ల మట్టిని తరలించారు. అయినా అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడలేదు. ఇటీవల ట్రాక్టర్ల ద్వారా కూడా బుసకను తరలించడం గమనార్హం. ప్రభుత్వ భూముల్లో నుంచి ఒక్కో ట్రాక్టరులో బుసకను లోడ్ చేసినందుకు రూ.400 తీసుకుని మరీ అక్రమార్కులు విక్రయాలు జరుపు తున్నారు. పోర్టు నిర్మాణం జరిగితే భవిష్యత్తులో అనుబంధ పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే పరిశ్రమల స్థాపన కోసం పలు సంస్థల ప్రతినిధులు తమకు భూమిని కేటాయించాలని అధికారులను సంప్రదిస్తున్నారు. గుంతలమయంగా ఉన్న ఈ భూములను చూసి ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు.
రాత్రి వేళ ట్రాక్టర్లలో అక్రమ రవాణా
మచిలీపట్నం మండలంలోని గోపువానిపాలెం, తపశిపూడి గ్రామాల్లోని 134 నుంచి 137 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 56 ఎకరాలు, 138 సర్వే నంబరులోని 17 ఎకరాల్లోని బుసకను పూర్తిగా తవ్వేశారు. 139 సర్వే నంబరులోని 112 ఎకరాలను రైతులు పోర్టు నిర్మాణం కోసం ముడాకు ఎకరం భూమిని రూ.25 లక్షల చొప్పున విక్రయించారు. ఈ భూముల్లోని బుసక మొత్తాన్ని అక్రమార్కులు తవ్వి విక్రయించేశారు. 140 నుంచి 144 సర్వే నంబర్లలోని 30 ఎకరాల్లో ఉన్న బుసకను కూడా తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించేశారు. రాత్రి సమయంలో తపశిపూడి, మంగినపూడి, గోపువానిపాలెం గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా బుసకను తరలించేస్తున్నారు. ముడా అధికారులు ఈ వివరాలన్నింటినీ సేకరించి జాతీయ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్డుకు, కలెక్టర్‌కు ఆధారాలతో సహా.. మూడు గ్రామాల ప్రజలతో సంతకాలు చేయించి మరీ నివేదికలు సమర్పించారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యల్లేవు. వివిధ గ్రామాలకు సముద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందని ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని ఒక ప్రజాప్రతినిధి బుసక రవాణాను నిలిపివేయాలని చెప్పినందుకుగాను బుసక రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి రాత్రి సమయంలో సదరు ప్రజాప్రతినిధికి ఫోన్‌చేసి బెదిరింపు ఽధోరణితో మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మొక్కుబడి చర్యలతో సరి..
నాగాయలంక మండలంలో బుసక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వక్కపట్లవారిపాలెం, దిండి, గుల్లలమోద గ్రామాల్లో రాత్రి సమయంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలించేస్తున్నారు. మొక్కుబడిగా రెండు, మూడు సార్లుగా జేసీబీలను పోలీసులు సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులకు ఈ వాహనాలను అప్పగిస్తే.. నామమాత్రపు జరిమానా విధించి సరిపెట్టేశారు. మళ్లీ ఈ గ్రామాల్లో మట్టి రవాణాను కొసాగిస్తూనే ఉన్నారు.
ఏకంగా కాలువ గట్టునే తవ్వేశారు..
తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు-చినపులిపాక గ్రామాల మధ్య బందరు కాలువ గట్టును తవ్వేసి మట్టిని ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాలకు తరలించేశారు. కాలువ గట్టును ఆక్రమించి మట్టిని తవ్వేస్తున్నా నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోలేదు. వర్షాకాలంలో కాలువకు సమృద్ధిగా నీటిని విడుదల చేస్తే కాలువగట్టు తెగిపోతుందని రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలువ గట్టును బలోపేతం చేస్తామని చెప్పి ఆశాఖ అధికారులు ఈ విషయాన్ని మరుగున పెట్టేశారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ మట్టి, బుసక దందాల వెనుక వైసీపీ నాయకులు హస్తం ఉన్నట్లు సమాచారం.