వీరు మారరంతే..!
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:46 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది గడిచినా అధికారుల్లో మార్పు మాత్రం రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు డ్రైనేజీ విభాగంలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ అద్దం పడుతోంది.
- డ్రైనేజీశాఖలో అధికారుల తీరుపై విమర్శలు
- వైసీపీ కాంట్రాక్టర్‌లకు బిల్లుల చెల్లింపునకు రంగం సిద్ధం
- టీడీపీ కాంట్రాక్టర్‌లకు మొండి చెయ్యి
- సీరియల్ ప్రకారం బిల్లుల చెల్లింపుల్లేవ్
- హైకోర్టు చెప్పిన లెక్క చేయని అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది గడిచినా అధికారుల్లో మార్పు మాత్రం రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు డ్రైనేజీ విభాగంలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ అద్దం పడుతోంది.
ఆంధ్రజ్యోతి - గుడివాడ :
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో డ్రైనేజీ శాఖ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో సింహభాగం పనులను వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లు ఒకరిద్దరు మాత్రం ఆన్‌లైన్ ద్వారా కాంట్రాక్టులు పొందారు. గత పాలకులు కావాలనే కాంట్రాక్టు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్లకు సీసీ పిటీషన్‌ల ప్రకారం సీరియల్ వారీగా నగదు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేశారు. ఈ క్రమంలో 2025 మేలో సీఎంఎఫ్‌ఎస్ ద్వారా అప్లోడ్ చేయాలని డ్రైనేజీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీసీ పిటీషన్‌ల ప్రకారం సీరియల్ వారీగా అప్లోడ్ చేయాల్సి ఉంది. గుడివాడ డ్రైనేజీ ఓఅండ్‌ఎం వర్క్స్‌కు ఎల్‌వోసీకి సంబంధించి రూ.8.59 కోట్ల బిల్లులను అప్లోడ్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. డ్రైనేజీ అధికారులు మాత్రం ఇంకా వైసీపీ మత్తులోనే జోగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌లకు పెద్ద పీట వేస్తూ బిల్లులను అప్లోడ్ చేశారు. సదరు బిల్లుల్లో టీడీపీ అనుకూల సీఎన్‌ఆర్ ప్రాజెక్ట్సుకు చెందిన సుమారు రూ.45లక్షల బిల్లులను అప్లోడ్ చేయకపోవడం గమనార్హం. పనులు అప్పియరెన్స్, కంప్లెయింట్స్, అడ్మిషన్ స్టేజ్‌లో ఉన్న వాటిని కూడా అప్లోడ్ చేశారు. నూరు శాతం పనిపూర్తి చేసిన టీడీపీ కాంట్రాక్టర్ బిల్లులను మాత్రం అప్లోడ్ చేయకుండా వదిలేశారు.
ప్రాధాన్యత క్రమాన్ని మరచి..
హైకోర్టు సూచించిన విధంగా బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యత క్రమంలో సీఎన్‌ఆర్ ప్రాజెక్ట్సుకు బిల్లులను అప్లోడ్ చేయాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ తాలూకు బిల్లులను ఎందుకు అప్లోడ్ చేయలేదో డ్రైనేజీ అధికారులే చెప్పాలి. బిల్లుల అప్లోడ్ వ్యవహారంలో వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లు చక్రం తిప్పినట్లు కార్యాలయ వర్గాలో గుసగుసలు వినవస్తున్నాయి.
అంతా కలెక్టర్ ఆదేశాలతోనే..
తమ బిల్లును ఎందుకు అప్లోడ్ చేయలేదని డ్రైనేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిరణ్‌బాబును సదరు సీఎన్‌ఆర్ కాంట్రాక్టు సంస్థ అడుగగా, తమకేమి తెలియదని, రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు బిల్లులను అప్లోడ్ చేశామని సమాధానం ఇచ్చారు. కోర్టులో పర్సనల్ అప్పియరెన్స్ తాలూకు బిల్లులను మాత్రమే అప్లోడ్ చేశానని పేర్కొన్నారు. సిఎన్‌ఆర్ ప్రాజెక్ట్సుకు చెందిన బిల్లుల పరంగా నగదు మొత్తం ఎక్కువగా ఉండటంతో అప్లోడ్ చేయలేదని ఇ.ఇ కిరణ్‌బాబు తెలిపారు.