Share News

యూరియాపై రచ్చ!

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:21 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. యూరియా సమస్యపై జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు భగ్గుమన్నారు. సరఫరాలో వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం ఎదుట నిలబడి 20 నిమిషాల పాటు ఆందోళనకు దిగారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.

యూరియాపై రచ్చ!

- సరఫరాలో వైఫల్యాలపై ఆగ్రహం

- పోడియం వద్దకు దూసుకొచ్చిన జెడ్పీటీసీ సభ్యులు

- సుమారు 20 నిమిషాల పాటు ఆందోళన

- కొన్ని పీఏసీఎస్‌లకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపణ

- సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు

- జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం రూ.74.93 లక్షలు విడుదలకు ఆమోదం

- వాడీవేడిగా ఉమ్మడి కృష్ణాజిల్లా జెడ్పీ సమావేశం

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. యూరియా సమస్యపై జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు భగ్గుమన్నారు. సరఫరాలో వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం ఎదుట నిలబడి 20 నిమిషాల పాటు ఆందోళనకు దిగారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ కన్వెన్షన్‌ హాలులో గురువారం జరిగింది. తొలుత వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. గూడూరు మండలంలోని తరకటూరు, రాయవరం పీఏసీఎస్‌లకు ఇంతవరకు యూరియా ఇవ్వలేదని గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌ తెలిపారు. ఇంట్లో మహిళల పుస్తెలను తాకట్టుపెట్టి మరీ రైతులు బయట మార్కెట్‌లో అధిక ధరకు యూరియా కొనుగోలు చేస్తున్నారని గన్నవరం జడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెతరాణి ఆవేదన వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలానికి 400 టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 150 టన్నులను మాత్రమే ఇచ్చారని కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి ఆరోపించారు. పెదపారుపూడి, నందిగామ మండలాల్లో అరకొరగానే యూరియాను ఇచ్చారని, కొత్తగా ఎంపికైన పీఏసీఎస్‌ల అధ్యక్షులు తమకు అనుకూలమయిన రైతులకు యూరియా ఇచ్చి, మిగిలిన రైతులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం రేమల్లె, గన్నవరం పీఏసీఎస్‌లకు సక్రమంగా యూరియా పంపలేదని జెడ్పీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బంటుమిల్లి మండలంలో బల్లిపర్రు, కంచడం, బంటుమిల్లి పీఏసీఎస్‌ల పరిధిలో 18 గ్రామపంచాయతీలు ఉన్నాయని, యూరియా సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మహేష్‌ అన్నారు. ఇటీవల బంటుమిల్లి మండలానికి సరిపడా యూరియా ఇవ్వాలని ఆర్డీవోకు రైతులంతా వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. బంటుమిల్లి మండలానికి యూరియా ఇస్తామని జేసీ గీతాంజలిశర్మ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కంచికచర్ల మండలంలో ఐదు వేల టన్నుల యూరియాను ఇవ్వాల్సి ఉండగా, కేవలం 1100 టన్నులను మాత్రమే ఇచ్చారని, బయటి మార్కెట్‌లో బస్తా రూ.450, అంతకు మించి ధరతో రైతులు కొనుగోలు చేస్తున్నారని కంచికచర్ల జెడ్పీటీసీ తెలిపారు. మిగిలిన మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు యూరియా కొరతపై రైతులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.

కొరత లేదని అనడంతో పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు

యూరియా కొరతపై జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అధికారులను ప్రశ్నిస్తూ ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత ఉందా లేదా అనే అంశంపై స్పష్టమైన సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యవసాయశాఖ జేడీ విజయకుమారి స్పందిస్తూ జిల్లాలో యూరియా కొరత లేదని అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా పోడియం వద్దకు వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు సభ్యులంతా పోడియం ఎదుట నిలబడి ఆందోళన చేశారు. కృష్ణా కలెక్టర్‌ బాలాజీ సభ్యులకు సర్దిచెప్పినా వారు పట్టించుకోలేదు. కలిదిండి మండలం క్యాంప్‌బెల్‌ కాల్వకు పూర్తిస్థారులో సాగు నీటిని విడుదల చేయాలని సభ్యులు కోరారు. కంచికచర్ల మండలం తవ్వకాల్వకు గండ్లు పడ్డాయని, వాటిని పూడ్చేందుకు రూ.1.20కోట్ల నిధులు విడుదలైనా పనులు చేయడం లేదని కంచికచర్ల ఎంపీపీ ఎం.గాంధీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, వాటిని తొలగిస్తుంటే రైతులపై కేసులు పెడుతున్నారని తెలిపారు.

యూరియా కొరత లేకుండా చూస్తున్నాం : కలెక్టర్‌

ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ భారీవర్షాల కారణంగా మొక్కదశలో ఉన్న వరిపైరు నీటమునిగిందని, ఆ పైరును బతికించుకునేందుకు అదనపు కోటాగా రైతులు పలు మండలాల్లో యూరియాను వినియోగించారని తెలిపారు. ఒకరిద్దరు యూరియాను పెద్ద మొత్తంలో తరలించుకుపోయారని, ఈ ఘటనలపైనా విచారణ చేశామన్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య యూరియా కొరత కొంతమేర ఏర్పడిందన్నారు. ఈ విషయాలు ప్రభుత్వానికి నివేదించి అదనంగా యూరియాను జిల్లాకు తీసుకువచ్చేందుకు అనుమతులు తీసుకున్నామని తెలిపారు. ఒకటీ రెండు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియా మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జిల్లాలో రైతులకు అవసరమైన 23 వేల టన్నుల యూరియా సరఫరా చేశామని తెలిపారు. ఇంకా 500 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులు సాగుచేసిన భూమిని బట్టి యూరియాను సరఫరా చేయాలని అధికారులను కోరారు. యూరియా సరఫరాలో సమస్యలు ఉంటే తనకు ఏ సమయంలోనైనా ఫోన్‌ చేసి చెప్పాలని కలెక్టర్‌ బాలాజీ భరోసా ఇచ్చారు.

పాఠశాల భవనాలను పూర్తి చేయాలి

విద్యాశాఖపై సమీక్షలో పాఠశాల భవనాల నిర్మాణం తుదిదశలో ఉండగా పనులను నిలిపివేశారని జి.కొండూరు, కృత్తివెన్ను, పెదపారుపూడి, తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కొద్ది మొత్తం నగదు వినియోగిస్తేనే భవనాలు అందుబాటులోకి వస్తాయని, కొన్ని పాఠశాల భవనాలకు అనుమతులు ఇచ్చినా పనులు చేయడం లేదని వివరించారు. ఏ.కొండూరు మండలం కుంటముక్కల గురుకుల బాలికల పాఠశాల చుట్టూ ఉన్న ప్రహరీ వరదల కారణంగా కూలిపోయి ఏడాది అయ్యిందని, నేటివరకు నిర్మాణం చేయలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. తల్లికి వందనం నగదు కొందరికి జమకాలేదని, నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి చేసిన వారిపై చర్యలేవి?

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై గుడివాడలో దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. మూడు నెలలుగా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కలెక్టర్‌ బాలాజీ స్పందించారు. వెంటనే ఎస్పీ గంగాధరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. తాను ఎస్పీతో మాట్లాడానని, ఈ ఘటనపై కేసు నమోదు చేశారని, త్వరలో తగు చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ తెలిపారు. జెడ్పీ నిధులతో చేపట్టే పనులకు నిధులు ఇచ్చిన జెడ్పీటీసీ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని జెడ్పీ చైర్మన్‌తోపాటు సభ్యులంతా కలెక్టర్‌కు వివరించారు.

జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం విడుదలకు ఆమోదం

గత 18 నెలలుగా జెడ్పీటీసీ సభ్యులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం రూ.74.93 లక్షలను జెడ్పీ జనరల్‌ ఫండ్‌ నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇవ్వడంతో, గౌరవ వేతనాన్ని విడుదల చేసేందుకు సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, నూజివీడు సబ్‌కలెక్టర్‌ వినూత్న, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:21 AM