జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:46 AM
జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
నంద్యాల ఎడ్యుకేషన, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రాజకుమారి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం యూరియా గురించి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా, జేసీ విష్ణుచరణ్‌తో పాటు వ్యవసాయాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 9300 టన్నుల యూరియా చేరుతోందని, బుధవారం 2600 టన్నులు, 5వ తేదీ 2600 టన్నులు, 10వతేదీన 2600 టన్నులు, 13న 1500 టన్నులతో కలిపి మొత్తంగా 9300 టన్నులు జిల్లాకు చేరుతుందని వివరించారు. అందులో మార్క్‌ఫెడ్ ద్వారా 6,050 టన్నులు రైతు సేవా కేంద్రాలకు, మిగితా 3,250 టన్నుల యూరియా ప్రైవేట్ డీలర్‌లకు కేటాయించినట్లు తెలిపారు. ఏ రైతు సేవా కేంద్రానికి యూరియా చేరుతుందో ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్, రెవెన్యూ, మండల వ్యవసాయాధికారులకు తెలియజేయాలని, ఎలాంటి ఆటంకం లేకుండా యూరియా అందజేయాలని ఆదేశించారు. యూరియా పంపిణీలో ఏవైన సమస్యలు తలెత్తితే నంద్యాల కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం 08514293903 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. ఈ కంట్రోల్ రూం ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా మాట్లాడుతూ యూరియాపై పటిష్టమైన నిఘా ఉంచామని, ఎవరైనా అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.