Share News

సౌకర్యాలు శూన్యం

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:21 AM

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్నట్టుగా ఉంది ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సీఆర్‌డీఏ అనుమతి పొందిన లే అవుట్ల పరిస్థితి. సీఆర్‌డీఏ అనుమతి పొందిన లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన లేక ప్లాట్లను కొన్నవారు గగ్గోలు పెడుతున్నారు. డబ్బు కట్టించుకున్నామా? ప్లాన్లు ఇచ్చామా? వంటి అంశాలు తప్ప అనుమతి పొందిన లే అవుట్లలో ప్లాట్ల కొనుగోలుదారులకు కల్పించాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదా? అనేది సీఆర్‌డీఏ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది.

సౌకర్యాలు శూన్యం

- ఉమ్మడి కృష్ణాలోని సీఆర్‌డీఏ అనుమతి పొందిన లే అవుట్ల దుస్థితి

- అనుమతి ఉందన్న కారణంతో ఆశపడి ప్లాట్లు కొన్నవారికి నిరాశ

- సదుపాయాలు లేక నిర్మాణాలు చేపట్టలేకపోతున్న కొనుగోలుదారులు

- అదనంగా వీఎల్‌టీ భారం.. నిర్వాహకులకు మాత్రం లాభం

- పట్టించుకోని సీఆర్‌డీఏ అధికారులు.. తనిఖీలు లేవు..!

- లబోదిబోమంటున్న కొనుగోలుదారులు

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అన్నట్టుగా ఉంది ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సీఆర్‌డీఏ అనుమతి పొందిన లే అవుట్ల పరిస్థితి. సీఆర్‌డీఏ అనుమతి పొందిన లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన లేక ప్లాట్లను కొన్నవారు గగ్గోలు పెడుతున్నారు. డబ్బు కట్టించుకున్నామా? ప్లాన్లు ఇచ్చామా? వంటి అంశాలు తప్ప అనుమతి పొందిన లే అవుట్లలో ప్లాట్ల కొనుగోలుదారులకు కల్పించాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదా? అనేది సీఆర్‌డీఏ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాజధాని అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో అనుమతి పొందిన దాదాపు 7 వేల లే అవుట్లలో కొనుగోలుదారుల కష్టాలు చెప్పనలవిగా ఉన్నాయి. ర్యాపిడ్‌ గ్రోత ఏరియాలో ఉండటం వల్ల వెంచర్లలో ప్లాట్లను కొంటే భవిష్యత్తు బంగారంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆర్థిక శక్తి ఉన్నా, లేకపోయినా ఎంతోమంది ఈ లే అవుట్లలో ప్లాట్లను కొన్నారు. ఐదారేళ్లు దాటినా చాలావరకు లే అవుట్లలో ఆయా సంస్థలు మౌలిక సదుపాయాలు కల్పించక పోవటంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. రామవరప్పాడు నుంచి నిడమానూరు, కేసరపల్లి, గన్నవరం, హనుమాన్‌ జంక్షన్‌.. ఆ ఎగువ వరకు, వెదురుపావులూరు, నున్న వరకు, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, మైలవరం వరకు, ఇంకా ఎగువ ప్రాంతాల వరకు కూడా పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఇవన్నీ ర్యాపిడ్‌ గ్రోత ఏరియాలు కావటం వల్ల నాన్‌ లే అవుట్లు, అనుమతి పొందిన లే అవుట్లు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. నాన్‌ లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన దాదాపు ఉండదు. సీఆర్‌డీఏ అనుమతి పొందిన లే అవుట్లలో మాత్రం కచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిబంధనల మేరకు వెంచర్ల సంస్థలు ప్లాట్ల కొనుగోలుదారులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారా లేదా పర్యవేక్షించటానికి రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) వంటి పర్యవేక్షణ సంస్థ కూడా ఉంటుంది. ప్లాట్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించటంతో పాటు భవన నిర్మాణ రంగాన్ని, లే అవుట్ల క్రమబద్దీకరణ వంటి అంశాలను రెరా పరిశీలించాలి. కానీ, ఇటీవల సీఆర్‌డీఏ, రెరా అధికారులు కూడా తమ బాధ్యతలను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. లే అవుట్లకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలో సీఆర్‌డీఏ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

డెవలపర్లు కల్పించాల్సిన సౌకర్యాలు

అనుమతి పొందిన ప్రతి లే అవుట్‌కు కూడా సముచితరీతిలో ప్రవేశ మార్గం, 60 అడుగుల వెడల్పున ప్రధాన రహదారి (మెయిన్‌ అప్రోచ్‌ రోడ్డు) ఉండాలి. అంతర్గత రోడ్లతో పాటు ప్లాట్ల మధ్యన అంతర్గత రోడ్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ రోడ్లతో పాటు పేవ్‌మెంట్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. డ్రెయినేజీ వ్యవస్థ పక్కాగా ఉండాలి. వర్షపు నీటిని బయటకు పంపించే స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీతో పాటు మురుగునీటి కోసం యూజీడీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. భారీ లే అవుట్లు అయితే సీవేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్‌టీపీ) నెలకొల్పాలి. మంచినీటి సదుపాయాలకు సంబంధించి ఓవర్‌హెచ్‌ ట్యాంక్‌తో పాటు డిస్ర్టిబ్యూషన్‌ పైపు నెట్‌వర్క్‌, ప్రతి ప్లాటుకు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. విద్యుత సరఫరా-లైటింగ్‌ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత పోల్స్‌, పోల్స్‌కు కండక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. ఆహ్లాదం కోసం గ్రీన్‌లాన్స్‌, పార్కులు ఉండాలి. కామన్‌ అవసరాల కోసం కామన్‌ సైట్‌ను నిర్దేశించాలి.

అరకొర సౌకర్యాలతో సరి

సీఆర్‌డీఏ అనుమతి పొందిన చాలా లే అవుట్లలో అరకొర మౌలిక సదుపాయాలే కల్పిస్తున్నారు. మొక్కుబడిగా రోడ్లు, డ్రెయిన్లు నిర్మించి చేతులు దులుపుకొనేవారు కొందరైతే, వాటర్‌ ట్యాంక్‌ను అలంకారప్రాయంగా నిర్మించి ఇతర డిస్ర్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసేవారు ఇంకొందరు. నీటి సదుపాయంపై దృష్టిసారించని వెంచర్లు ఎన్నో ఉన్నాయి. విద్యుత వ్యవస్థ, వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయకపోవటం వల్ల ప్లాట్ల కొనుగోలుదారులు నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నారు. ప్లాన్‌కు అనుమతి ఇచ్చినప్పటి నుంచి మూడేళ్లలో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాల్సి ఉన్నా.. ఏళ్లు గడుస్తున్నా కూడా పూర్తిచేయని ఎన్నో వెంచర్లు ఇప్పటికీ ఉన్నాయి.

కొనుగోలుదారులకు భారం.. వెంచర్ల నిర్వాహకులకు లాభం

లే అవుట్లలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వల్ల కొనుగోలుదారులు నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (వీఎల్‌టీ) బాదుడును ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్లాట్లు నిర్మించుకోకపోవటం వల్ల ఖాళీగా ఉండటంతో వెంచర్ల నిర్వాహకులు ఇతర ప్రయోజనాల కోసం వాడుతూ ప్రయోజనాలు పొందుతున్నారు. బాణాసంచా దుకాణాలు, సంక్రాంతి కోడిపందేలు, ఫంక్షన్లకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

కామన్‌ సైట్లను అమ్మేసుకుంటున్నారు

లే అవుట్లలో 2.5 శాతం నుంచి 5 శాతం వరకు హాస్పిటల్‌, స్కూల్‌, ప్లే గ్రౌండ్‌ తదితర సామాజిక సదుపాయాల కోసం కేటాయించాలి. కానీ, వీటిని కూడా సొమ్ము చేసుకునేందుకు విక్రయించేస్తున్నారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి?

వెంచర్ల నిర్వాహకులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే సీఆర్‌డీఏ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. స్పందించకపోతే వెంచర్‌ నిర్వాహకుడు, సీఆర్‌డీఏపై రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. రెరా కూడా పట్టించుకోకపోతే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) వద్దకు వెళ్లొచ్చు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే లోకాయుక్తలో ఫిర్యాదు చేయవచ్చు.

మార్ట్‌గేజ్‌ రిలీజ్‌ లేకుండానే ప్లాట్ల విక్రయాలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొన్ని వెంచర్ల నిర్వాహకులు ఖాతాదారులను మభ్యపెట్టి సీఆర్‌డీఏకు మార్ట్‌గేజ్‌ చేసిన ప్లాట్లను కూడా విక్రయించేస్తున్నారు. ప్రతి వెంచర్‌ నిర్వాహకుడు సీఆర్‌డీఏ దగ్గర ముందుగా లే అవుట్‌ ప్లాన్‌ తీసుకున్నాక.. ఆ లేఅవుట్‌లో నిబంధనల ప్రకారం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే వరకు పది శాతం ప్లాట్లను సీఆర్‌డీఏకు మార్ట్‌గేజ్‌ చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదారులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించిన తర్వాతే సీఆర్‌డీఏ ఆ పది శాతం ప్లాట్లకు మార్ట్‌గేజ్‌ను రిలీజ్‌ చేస్తుంది. సీఆర్‌ డీఏకు మార్ట్‌గేజ్‌ చేసిన పది శాతం ప్లాట్లను కూడా వెంచర్ల నిర్వాహకులు అమ్మేస్తున్నారు. ఈ విషయం తెలియక కొనుగోలుదారులు మోసపోతున్నారు. మార్ట్‌గేజ్‌లో ఉందన్న విషయం తెలిసి కొనుగోలుదారులు నిలదీసే పరిస్థితి ఏర్పడుతోంది. రిలీజ్‌ చేయిస్తామని చెబుతూ మభ్యపెట్టడమే తప్ప ఏళ్లు గడుస్తున్నా రిలీజ్‌ చేయించటం లేదు. దీంతో కొనుగోలుదారుల ఆ ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టాలంటే బ్యాంకు లోన్లు తీసుకోవటానికి వీలు పడటం లేదు. ఇలా ఎంతో మంది కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Dec 14 , 2025 | 01:21 AM