Share News

చింతకుంట చిన్నబోయింది

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:42 PM

రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది.. పిడికెడు అన్నం కోసం ప్రజలు పాట్లు పడుతున్నారు.

   చింతకుంట చిన్నబోయింది
చింతకుంట నుంచి లారీలో పిల్లా పాపలతో వలసవెళ్తున్న గ్రామస్థులు

200 కుటుంబాలు కోసిగి నుంచి తెలంగాణకు వలసలు

నిర్మానుష్యంగా గ్రామం

ఎటుచూసినా ఇళ్లకే తాళాలు

ఈ ఏడాది కూలీలతో పాటు రైతులదీ ఇదే

12 వాహనాల్లో పయనం

రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది.. పిడికెడు అన్నం కోసం ప్రజలు పాట్లు పడుతున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న అన్నదాత అప్పుల పాలయ్యాడు.. బతుకు దుర్భరమైౖ.. గుండె భారమై.. పిల్లాపాపలతో వలసబాట పట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 వాహనాల్లో తెలంగాణకు పయనం అయ్యారు. చదువుకునే పిల్లలు సైతం జీవన పోరుకు సిద్ధమయ్యారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని కోసిగి మండలంలోని చింతకుంట చిన్నబోయింది. గ్రామంలో ఏ ఇంటికి చూసినా తాళాలే కనిపిస్తున్నాయి. ఇంట్లో అందరూ వలస వెళ్లడంతో పెద్దదిక్కు ఉన్న వారు తమ కొడుకులు, కోడళ్లు స్థితిని చూసి కన్నీటి బాధతో వీడ్కోలు పలికారు. ఊరంతా వలస వెళ్లడం నిర్మానుష్యంగా మారింది. ఈ పాపానికి కారణం ఎవరు? అధికారులా..? ప్రజాప్రతినిధులా? లేక పాలకులా?. ఏది ఏమైనా ఈ దృశ్యాలను చూస్తే ఎంతటి వారికైనా కన్నీళ్లు రావాల్సిందే..

కోసిగి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): చింతకుంట గ్రామం వలసలతో చిన్నబోయింది. గ్రామంలో 3,200 మంది జనాభా ఉంది. 2,150 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవలే అందరూ కలిసి దసరా పండుగ చేసుకున్నారు. గ్రామం అంతా వలసబాట పట్టారు. ఈ ఏడాది కూలీలతో పాటు రైతులు కూడా వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోవడంతో ఇంటికి తాళం వేసి పంటల కోసం చేసిన అప్పులు తీర్చాలని, పిల్లాపాపలతో కలిసి తెలంగాణకు వలసబాట పట్టారు. గురువారం చింతకుంట గ్రామం నుంచే 12 వాహనాల్లో సుమారు 180 కుటుంబాల నుంచి 1200 మంది జనాభాకు పైగా పిల్లాపాపలతో కలిసి మూటముళ్ల సర్దుకుని తెలంగాణాలోని వికారాబాద్‌కు పత్తి పనుల కోసం వెళ్లారు. కొందరు రైతులు మొదటిసారిగా దుఖంతో చేసిన అప్పులు కట్టేందుకు పిల్లాపాపలతో కలిసి వలసబాట పట్టారు. బడుల్లో చదువుకునే సుమారు 80 మంది దాకా చిన్నారులు సైతం తల్లిదండ్రులను అనుసరించారు. విద్యార్థులు సైతం తల్లిదండ్రుల వెంట వెళ్లడంతో ప్రభుత్వ బడులలో హాజరు శాతం దక్కింది. ఇప్పుడిప్పుడే పశ్చిమ ప్రాంతంలో వలసలు మొదలయ్యాయి. కోసిగి మండలంలో వేలాది సంఖ్యలో వలసబాట పట్టేందుకు పయనమవుతున్నారు.

మా బతుకులు మారవు.. వలస తప్పదు

ప్రతి ఏటా మేము మా పిల్లలను వెంట పెట్టుకుని వలస వెళ్తున్నాం. మా బ్రతుకులు మారడం లేదు. సుగ్గీకి వెళ్లాలని ఎవరూ అనుకోం. ఇక్కడే ఉంటే పెద్దవారికి పనులు దొరుకుతాయి. పిల్లలకు పనులు ఉండవు. సుగ్గికి వెళితే పని చేసి నాలుగు రూపాయలు వెనుకేసుకుంటాం.

ఫ పీకలబెట్ట అయ్యమ్మ, చింతకుంట, కోసిగి

ఇక్కడే ఉంటే అన్నం..

మా అమ్మనాన్న ఇంటికి తాళం వేసి తమ్ముడిని వలస తీసుకెళ్తున్నారు. ఇక్కడే ఉంటే నాకు అన్నం ఎవరూ పెట్టరు. అందుకే నేను కూడా మా అమ్మనాన్నలతో కలిసి వలస వెళ్తున్నా..

ఫ హరికృష్ణ, 6వ తరగతి విద్యార్థి, పల్లెపాడు హై స్కూల్‌

రైతు కష్టం పగవాడికి వద్దు

ఏడెకరాల పొలంలో మూడెకరాల ఉల్లి, మూడెకరాల పత్తి, ఒక ఎకరా వేరుశనగ వేశా. రూ.4లక్షల మేర పెట్టుబడి పెట్టాను. ఒక్క ఎకరాకు డబ్బులు కూడా రాలేదు. రూ.4లక్షలు అప్పులయ్యాయి. ఇది రైతుల ధీన స్థితి. ఈకష్టం పగవాడికి కూడా వద్దు.

ఫ పులుసు చిన్న వీరన్న, చింతకుంట

ప్రభుత్వమే ఆదుకోవాలి

ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయాం. పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. లేకపోతే అప్పులను తీర్చేందుకు ఒక్క రైతు కూడా గ్రామంలో ఉండడు.

ఫ హనుమయ్యగారి చింతలయ్య, రైతు, చింతకుంట గ్రామం

Updated Date - Oct 09 , 2025 | 11:42 PM