తుది దశకు ‘వెస్ట్ బైపాస్’
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:56 AM
ఎప్పటి నుంచో ఊరిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు తుది దశకు చేరాయి. ఎన్‌హెచ్-16, బైపాస్ అనుసంధాన పనులను కాంట్రాక్టు సంస్థ తాజాగా ప్రారంభించింది. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల దగ్గర పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ - ఏలూరు మార్గంలో ఒక వరుసలో ట్రాఫిక్ డైవర్షన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏలూరు - విజయవాడ వైపు మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ పనులు పూర్తయితే మార్చి నాటికి వెస్ట్ బైపాస్ రెడీ కానుంది.
- ఎన్‌హెచ్-16, బైపాస్ అనుసంధాన పనులు ప్రారంభం
- పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల దగ్గర పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ
- విజయవాడ - ఏలూరు మార్గంలో ఒక వరుసలో ట్రాఫిక్ డైవర్షన్
- ప్రస్తుతం ఏలూరు - విజయవాడ వైపు మాత్రమే వాహనాలకు అనుమతి
- నెల రోజుల పాటు జరగనున్న పనులు
- మార్చి నాటికి వెస్ట్ బైపాస్ రెడీ!
ఎప్పటి నుంచో ఊరిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు తుది దశకు చేరాయి. ఎన్‌హెచ్-16, బైపాస్ అనుసంధాన పనులను కాంట్రాక్టు సంస్థ తాజాగా ప్రారంభించింది. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల దగ్గర పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ - ఏలూరు మార్గంలో ఒక వరుసలో ట్రాఫిక్ డైవర్షన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఏలూరు - విజయవాడ వైపు మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ పనులు పూర్తయితే మార్చి నాటికి వెస్ట్ బైపాస్ రెడీ కానుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
పశ్చిమ బైపాస్ పనులు ఎట్టకేలకు ముగింపు దశకు చేరాయి. ప్యాకేజీ-3లో కృష్ణాజిల్లా చిన అవుటపల్లి దగ్గర ఎన్‌హెచ్- 16పై అత్యంత కీలకమైన ల్యాండింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తయితే ప్యాకేజీ - 3 సిద్ధమైనట్టే. జాతీయ రహదారికి బైపాస్‌ను అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో హైవే మీద ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ఎన్‌హెచ్ - 16 మీద ఉన్న ట్రాఫిక్‌ను బైపాస్ ప్రారంభంలో ఉన్న ఆర్‌వోబీ దిగువ నుంచి మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే వాహనాల మళ్లింపు చేపట్టారు. హైవే మీద డబుల్ లేన్‌ను పూర్తిగా బారికేడ్లతో దిగ్బంధించారు. ఏలూరు నుంచి విజయవాడ వచ్చే రెండులేన్ల మార్గంలో మాత్రం యథాతధంగా వాహనాలను అనుమతిస్తున్నారు. హైవే మీద ట్రాఫిక్‌ను డైవర్షన్ చేయటంతో వాహనాలన్నీ కూడా అటు నుంచే వెళుతున్నాయి. ఈ డైవర్షన్ అన్నది దూరంలో ఏమీ లేదు. ఆర్‌వోబీ కూడా హైవే సమీపంలోనే ఉండటంతో అర్ధచంద్రాకారంలో వాహనాలు తిరుగుతూ పిన్నమనేని దాటిన తర్వాత తిరిగి హైవే మీదకు చేరుకుంటున్నాయి. ల్యాండింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేయగలిగితే విజయవాడ బైపాస్ ప్యాకేజీ-3 నూరుశాతం అందుబాటులోకి వస్తుంది. ల్యాండింగ్ కోసం ఇప్పటికే పిన్నమనేని సిద్దార్థ కాలేజీ వైపు ఏలూరు - విజయవాడ మార్గంలో రెండు వరసలను అభివృద్ధి చేశారు. ఈ రెండు వరసలను ప్రస్తుతం మూసివేశారు. ఏలూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు ఈ రెండు వరసల మీదుగా వెళతాయి. ఏలూరు నుంచి హైదరాబాద్, చెన్నై వెళ్లే వాహనాలు మాత్రం బైపాస్ మీదుగా వెళతాయి. విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే వాహనాలు మాత్రం ఆర్‌యూబీ దిగువ వెంట్ నుంచి ప్రస్తుతం వెళుతున్నాయి. అనుసంధానం పనులు పూర్తయిన తర్వాత సింగిల్ లేన్ మీదుగా హైవే మీద నుంచే వెళతాయి.
నిదానంగా ముందుకు..
ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా ఆర్‌వోబీ దిగువున ఉన్న వెంట్ నుంచి వాహనాలు వెళ్లటం వల్ల వేగంగా ముందుకు కదలటం లేదు. డైవర్షన్ మార్గం కూడా చాలా దగ్గరగా ఉండటం వల్ల వాహనాలు నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. రద్దీ సమయంలో ట్రాఫిక్ మీద ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్‌ను నెల రోజుల పాటు కొనసాగించనున్నారు. అవసరమైతే మరో నెల రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
2 నెలల్లో పూర్తి స్థాయిలో అనుసంధానం
పశ్చిమ బైపాస్‌ను ఎన్‌హెచ్-16 మీద ల్యాండింగ్ చేయటానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కీలకమైన బైపాస్ అనుసంధాన పనులు కావటంతో.. చాలా జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంది. గరిష్టంగా రెండు నెలల పాటు జరిగే అవకాశం ఉందని ఎన్‌హెచ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ఫిబ్రవరి నాటికి ల్యాండింగ్ అనుసంధాన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
చివరి దశకు..
పశ్చిమ బైపాస్‌లో 95శాతంపైగా పనులు పూర్తయ్యాయి. ల్యాంకో, ట్రాన్స్‌కో ట్రాన్స్‌మిషన్ విద్యుత లైన్ల అలైన్‌మెంట్ సమస్యల కారణంగా జాప్యం జరిగింది. ఇప్పుడీ సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయి. దీంతో జక్కంపూడి దగ్గర పనులు ప్రారంభమయ్యాయి. ఆర్‌వోబీ బయటకు చొచ్చుకు రావటంతో తిరిగి పునర్నిర్మిస్తున్నారు. నున్న దగ్గర దిగువున ఉన్న విద్యుత లైన్ల సమస్య కూడా పరిష్కారమైంది. టవర్లను ఎత్తు పెంచటంతో ఈ ప్రాంతంలో పనులు కూడా చేపడుతున్నారు. అంతిమంగా పిన్నమనేని సిద్దార్థ మెడికల్ కళాశాల దగ్గర ల్యాండింగ్ పనులు కూడా జరగటంతో రానున్న మార్చి నాటికి విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.