Share News

టీడీపీ రథసారథుల కసరత్తు కొలిక్కి!

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:07 AM

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా రథసారఽథుల ఎన్నికల కసరత్తు కొలిక్కి వచ్చింది. అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీలు ఆదివారం ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తీసుకున్నాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులుగా త్రిసభ్య కమిటీలు ఏడుగురి పేర్లను స్వీకరించాయి.

టీడీపీ రథసారథుల కసరత్తు కొలిక్కి!

- కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల పార్టీ శ్రేణులతో త్రిసభ్య కమిటీల భేటీ

- పరిశీలకుల దృష్టికి ఎన్టీఆర్‌ జిల్లా నుంచి నాలుగు పేర్లు

- వీరిలో బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, గన్నే నారాయణ ప్రసాద్‌, బొమ్మసాని సుబ్బారావు

- కృష్ణాజిల్లా నుంచి మూడు పేర్లు పరిశీలకుల దృష్టికి తెచ్చిన శ్రేణులు

- వీరిలో గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, కొనకళ్ల నారాయణరావు, కోనేరు నాగేంద్రకుమార్‌

- నామినేటెడ్‌ పదవులు పొందిన వారికి అవకాశం దాదాపుగా లేనట్టే !

- కుల సమీకరణల కంటే.. సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా రథసారఽథుల ఎన్నికల కసరత్తు కొలిక్కి వచ్చింది. అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీలు ఆదివారం ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తీసుకున్నాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులుగా త్రిసభ్య కమిటీలు ఏడుగురి పేర్లను స్వీకరించాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో బీసీ సామాజికవర్గం నుంచి బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాల పేర్లు, ఓసీ సామాజికవర్గం నుంచి గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న), బొమ్మసాని సుబ్బారావు పేర్లు ప్రధానంగా వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు నెట్టెం రఘురాంతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కృష్ణాజిల్లా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావును కొనసాగించాలని ఎక్కువశాతం మంది ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. రెండవ పేరుగా గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ను ప్రతిపాదించారు. మూడవ పేరుగా కోనేరు నాగేంద్ర కుమార్‌ను విజయవాడ రూరల్‌ పార్టీ నాయకులు ప్రతిపాదించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల నుంచి స్వీకరించిన ఈ పేర్లను త్రిసభ్య కమిటీలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాయి. వీరిలో అధ్యక్షులెవరన్నది అధినేత చంద్రబాబు నిర్ణయంతో ఫైనల్‌ అవుతోంది.

ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయంలో..

ఎన్టీఆర్‌ జిల్లాలో ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి త్రిసభ్య కమిటీలోని సభ్యులు పయ్యావుల కేశవ్‌, బీటీ నాయుడు హాజరయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ పతాక ఆవిష్కరణ జరిపారు. అనంతరం భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి వివరించారు. ఆ తర్వాత జిల్లా పార్టీ కమిటీల ఎన్నికకు సంబంఽధించి చర్చ నిర్వహించారు. సమావేశానికి మొత్తం 350 మంది హాజరయ్యారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల నుంచి జిల్లా కమిటీలకు సంబంధించి ప్రతిపాదిత పేర్లను స్వీకరించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులతో వన్‌ టూ వన్‌ ముఖాముఖి మాట్లాడారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, శ్రీరాం తాతయ్య, వసంత కృష్ణప్రసాద్‌, కొలికపూడి శ్రీనివాసరావు, తంగిరాల సౌమ్య తమ ప్రతిపాదనలను విడివిడిగా అందజేశారు. పార్టీ నాయకులు కూడా తమ ప్రతిపాదనలను తెలియజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కసరత్తు సాగింది. జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యుల పేర్లతో పాటు, అనుబంధ సంఘాలు, బీసీ సాధికార కమిటీలకు తీసుకోవాల్సిన పేర్లను అందరి నుంచి లిఖితపూర్వకంగా తీసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నెట్టెం రఘురాం పేరును కొందరు సూచించినప్పటికీ ఆయన ప్రస్తుతం కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా నామినేటెడ్‌ పదవిలో ఉన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాకు బీసీ, ఓసీ సామాజిక వర్గాలలో ఎవరికి అన్నదానిపై ఇంకా తుది నిర్ణయానికి అధిష్ఠానం రాలేదు. బలహీనవర్గాల నుంచి పూర్వ అర్బన్‌ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్ధా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్‌మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి. నాగుల్‌ మీరాను ఇప్పటికే నూర్‌ బాషా, దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్‌గా నియమించారు. ఓసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌ (అన్న), బొమ్మసాని సుబ్బారావు పేర్లు ప్రధానంగా వచ్చాయి. గన్నే అన్న అర్బన్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో సమర్థవంతంగా పనిచేశారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా కూడా సేవలందించారు. గతంలో అర్బన్‌ టీడీపీ అధ్యక్ష స్థానానికి బుద్ధా వెంకన్నతో పోటీ పడ్డారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్‌ నాయకుడు. గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు.

మచిలీపట్నం సమావేశానికి ముగ్గురు హాజరు

కృష్ణాజిల్లా పార్టీ సమావేశం మచిలీపట్నంలోని మన కన్వెన్షన్‌ హాలులో జరిగింది. త్రిసభ్య కమిటీ సభ్యులైన కాలువ శ్రీనివాసులు, దామచర్ల సత్య, పి.గోవింద్‌ హాజరయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, బోడె ప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, డిప్యూటీ మాజీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, టీడీపీ సీనియర్‌ నాయకులు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 400 మంది ఈ సమావేశానికి వచ్చారు. కాలువ శ్రీనివాసులు, దామచర్ల సత్య, పి.గోవింద్‌ సంయుక్తంగా ప్రజా ప్రతినిధులు, నాయకుల నుంచి సీల్డ్‌ కవర్లలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలు, బీసీ సాధికార కమిటీల పేర్లను స్వీకరించారు. జిల్లా పార్టీ నుంచి ముక్తకంఠంతో కొనకళ్ల నారాయణరావు పేరును ప్రతిపాదించారు. కొనకళ్ల ఇప్పటికే ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారు. నామినేటెడ్‌ పదవులలో ఉన్న వారికి జిల్లా సారథ్యం బాధ్యతలు అప్పగించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధినేత అవకాశం కల్పిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. పార్టీలో 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సీనియర్‌ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌కు ఇప్పటి వరకు సముచిత స్థానం లభించలేదు. ఈ సారి గొట్టిపాటి పేరును పలువురు గట్టిగా ప్రతిపాదించారు. గొట్టిపాటి పదవులకు ఆశపడకుండా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నారు. పామర్రు పరిశీలకులుగా ఇటీవల పనిచేసి అక్కడ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు.

అధినేత నిర్ణయమే ఫైనల్‌

రెండు జిల్లాల నుంచి ప్రతిపాదించిన వారిలో అధ్యక్షుల ఎంపిక అధినేత చంద్రబాబు స్వయంగా చేపడతారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం చాలా ముఖ్యం. వివిధ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పార్టీ నుంచి పేర్లను తీసుకున్నారు. అధ్యక్షుల ఎంపికలో సామాజిక సమీకరణలు కూడా తప్పనిసరిగా చూసే అవకాశం ఉంది. కొన్నిపరిస్థితుల్లో సామాజిక సమీకరణల ఆధారంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం లేని నాయకులకు బాధ్యతలు ఇస్తే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కుల సమీకరణల కంటే కూడా రాష్ట్రంలో కీలకమైన ఈ రెండు జిల్లాలకు సమర్థవంతులైన వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది అందరి అభిప్రాయంగా ఉంది. మరి అధినేత ఏం చేస్తారో ? ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - Aug 25 , 2025 | 01:07 AM