Share News

‘అమృత’ ధారలు

ABN , Publish Date - May 21 , 2025 | 12:45 AM

కేంద్ర ప్రభుత్వం జిల్లాపై అమృత ధారలు కురిపించింది. తాగునీటి పథకాలు, చెరువుల అభివృద్ధికి మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, గుడివాడ పురపాలక సంఘానికి కలిపి రూ.189.38 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులకు రెండు వారాల్లోపు టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రజల తాగునీటి సమస్యలు త్వరలో తీరిపోనున్నాయి.

‘అమృత’ ధారలు

- అమృత 2.0 పథకంలో మచిలీపట్నం, గుడివాడకు రూ.189.38 కోట్లు మంజూరు

- మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు రూ.73.38 కోట్లు విడుదల

- గుడివాడ పురపాలక సంఘానికి రూ.116 కోట్లు కేటాయింపు

- రెండు వారాల్లోపు పనులకు టెండర్లు పిలిచే అవకాశం

- తాగునీటి సరఫరా, డ్రెయిన్లు, చెరువుల అభివృద్ధికి వినియోగించనున్న వైనం

కేంద్ర ప్రభుత్వం జిల్లాపై అమృత ధారలు కురిపించింది. తాగునీటి పథకాలు, చెరువుల అభివృద్ధికి మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌, గుడివాడ పురపాలక సంఘానికి కలిపి రూ.189.38 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే పనులకు రెండు వారాల్లోపు టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రజల తాగునీటి సమస్యలు త్వరలో తీరిపోనున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అమృత 2.0 పథకం కింద రూ.73.38 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని తాగునీటి చెరువు ఆధునికీకరణకు రూ.2.76 కోట్లు, సబ్‌జైలు అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌, ఫతుల్లాబాద్‌ అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్‌ చివరి పాయింట్లలో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు 5ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మించేందుకు రూ.53.10 కోట్లు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.12.16 కోట్లను కేటాయించాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.32 కోట్లను జమచేయాలి. దీంతో పాటు కార్పొరేషన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయిన్‌ల నిర్మాణానికి రూ.1.16 కోట్లను కేటాయించింది. నీటి ఇబ్బందులు ఉన్న వివిధ కాలనీల్లో తాగునీటి వసతులను మెరుగుపరిచేందుకు రూ.1.12కోట్లు విడుదల చేసింది. మచిలీపట్నంలో తాగునీటి పైప్‌లైన్‌లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం రూ.15.24 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అమృత 2.0 పథకం నిధులతో పనులు చేపట్టేందుకు రెండు వారాల వ్యవధిలో టెండర్లు పిలుస్తారని మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బాపిరాజు తెలిపారు.

గుడివాడలో తాగునీటి సమస్యలకు చెక్‌

గుడివాడ పురపాలక సంఘానికి అమృత 2.0 పథకం కింద మొత్తం రూ.116 కోట్లను విడుదల చేసింది. ఇంటింటికీ తాగునీరు పూర్తిస్థాయిలో అందించేందుకు, తాగునీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు రూ.52.74 కోట్లు, బేతవోలులోని ఊరచెరువును అభివృద్ధి చేసేందుకు రూ. 2.09 కోట్లు, నాగన్నచెరువు అభివృద్ధికి రూ.2.09 కోట్లు, 25వ వార్డులోని పాత, కొత్త సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను పునర్నిర్మించేందుకు రూ.5.61 కోట్లు కేటాయించింది. గుడివాడ పురపాలక సంఘంలోని కాలనీల్లో తాగునీటి వసతిని మెరుగు పరిచేందుకు రూ.10 కోట్లు, వివిధ అభివృద్ధి పనుల కోసం మిగతా నిధులను విడుదల చేసింది.

వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అమృత పథకంతో పాటు, ఇతర అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేసేందుకు ఢిల్లీ నుంచి సాంకేతిక బృందం మచిలీపట్నం వస్తుందని కేంద్రప్రభుత్వ అధికారులు సమాచారం పంపినా ఇక్కడి అధికారులు సరైన విధంగా స్పందించలేదు. దీంతో ఢిల్లీ సాంకేతిక బృందం పనుల అంచనాలు వేసేందుకు మచిలీపట్నం రాలేదు. దీంతో అనేక అభివృద్ధి పనులు అంచనాలకు నోచుకోకుండానే మరుగున పడిపోయాయి. ఈ అంశంపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గతంలో పలుమార్లు మునిసిపల్‌ అధికారులను నిలదీశారు. అప్పట్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగిన పేర్ని నానికి, ఎంపీ వల్లభనేనికి మధ్య రాజకీయపరమైన విభేదాలు రావడం కూడా అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందని సమాచారం.

Updated Date - May 21 , 2025 | 12:45 AM