అవినీతి కంపు!
ABN , Publish Date - May 18 , 2025 | 01:26 AM
‘మంది ఎక్కువైతే.. మజ్జిగ పలచన’ అన్నట్టుగా తయారైంది కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ పరిస్థితి. సిఫార్సులు, డిప్యుటేషన్లు, రికమండేషన్లతో ప్రజారోగ్యశాఖ పరిధిలో తిష్ట వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ స్థాయిలో అంటే.. మంజూరు చేసిన పోస్టుల సంఖ్య కంటే కూడా అదనంగా ఉంటున్నారు. పోనీ, ఆ స్థాయిలో అయినా ప్రజారోగ్యశాఖ పనితీరు మెరుగు పడిందా అంటే మరింత తీసికట్టుగా మారిపోయింది. విచ్చలవిడి అవినీతి, దోపిడీలకు అడ్డాగా తయారైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ నిర్వాకం!
- మంజూరైన పోస్టులు 150.. పనిచేస్తున్నది 511 మంది
- లీడ్ మేస్ర్తీల పేరుతో ఆర్డర్ లేకుండా 154 మంది నియామకం
- సిఫార్సులతో అదనంగా మరో 41 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు
- సచివాలయ శానిటరీ కార్యదర్శులకు జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా విధులు
- కాసుల వేటలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్ర్తీలు!
- ప్రజారోగ్యశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు
‘మంది ఎక్కువైతే.. మజ్జిగ పలచన’ అన్నట్టుగా తయారైంది కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ పరిస్థితి. సిఫార్సులు, డిప్యుటేషన్లు, రికమండేషన్లతో ప్రజారోగ్యశాఖ పరిధిలో తిష్ట వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ స్థాయిలో అంటే.. మంజూరు చేసిన పోస్టుల సంఖ్య కంటే కూడా అదనంగా ఉంటున్నారు. పోనీ, ఆ స్థాయిలో అయినా ప్రజారోగ్యశాఖ పనితీరు మెరుగు పడిందా అంటే మరింత తీసికట్టుగా మారిపోయింది. విచ్చలవిడి అవినీతి, దోపిడీలకు అడ్డాగా తయారైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో ఒక ప్రధాన ఆరోగ్య అధికారి (సీఎంవోహెచ్), ఇద్దరు సహాయ ఆరోగ్య అధికారులు (ఏఎంవోహెచ్‌లు), శానిటరీ సూపర్ వైజర్లు ఆరుగురు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు 32 మంది, హెల్త్ అసిస్టెంట్స్-24 మంది, శానిటరీ మేస్ర్తీలు 85 మంది పోస్టులు శాంక్షన్‌గా ఉన్నాయి. మొత్తంగా ఈ పోస్టుల్లో 150 మంది సిబ్బంది ఉండాల్సి ఉంటే ప్రస్తుతం 511 మంది పనిచేస్తున్నారు. సుమారు మూడు రెట్లు అదనంగా ఉన్నారు. శానిటరీ మేస్ర్తీలు 88 మంది, సచివాలయ కార్యదర్శులు 260 మంది, లీడ్ మేస్ర్తీలు 154 మంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు 73 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజారోగ్యశాఖలోకి వీరంతా ఎలా వచ్చారో చూస్తే.. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో శానిటరీ కార్యదర్శులను నియమించటం జరిగింది. వీరిని వార్డు సచివాలయాల కోసం నియమిస్తే.. కార్పొరేషన్ అధికారులు వీరిని ప్రజారోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనులు చేసే విధంగా వాడుకుంటున్నారు. ఒకరకంగా వారి జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. వీరంతా కూడా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా 260 మంది వచ్చారనుకుంటే.. ఆ తర్వాత కాలంలో లీడ్ మేస్ర్తీల పేరుతో మరో 154 మందిని తీసుకున్నారు. దీనికి ఒక ఆర్డర్ కూడా లేదు. శానిటరీ కార్యదర్శులను పోనీ వారి జాబ్ చార్ట్ ప్రకారం వారిని వార్డు సచివాలయాలలో పనిచేయమని నిర్దేశించారంటే అదీ లేదు.
పైరవీలతో వచ్చేశారు..
లీడ్ మేస్ర్తీల పేరుతో రాజకీయ సిఫార్సులు, రికమండేషన్లు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు సూచించిన వారందరికీ ఎడాపెడా ఇచ్చేశారు. కనీస అర్హతలు లేని వారినే ఎక్కువుగా లీడ్ మేస్ర్తీలుగా తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా మరో 41 మందిని అదనంగా తీసుకున్నారు. నగరంలో ప్రతి 40 వేల జనాభాకు ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉండాలన్నది మునిసిపల్ చట్టం చెబుతోంది. విజయవాడ నగర జనాభా 13 లక్షలుగా ఉంది. ఈ లెక్కన చూస్తే.. మంజూరు చేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నగరావసరాలకు సరిపోతారు. కానీ అదనంగా 15 లక్షల జనాభాకు అనుగుణంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లను నియమించుకోవటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో శానిటరీ మేస్ర్తీలు కూడా 85 మంది ఉంటే సరిపోతుంది. శానిటేషన్, మలేరియా, నైట్ శానిటేషన్, సిల్ట్, జక్కంపూడి, పాతపాడులలో వీరంతా సరిపోను పనిచేస్తున్నారు. లీడ్ వర్కర్ల పేరుతో అదనంగా నియమించుకోవాల్సిన అవసరం లేదు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న శానిటేషన్ సిబ్బంది కారణంగా పని తీరు అయినా మెరుగుపడిందనుకుంటే అత్యంత దారుణంగా తయారైంది.
వసూలు రాజాలుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు!
కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అవినీతిమయమైపోయిందని విమర్శలు వస్తున్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కాసుల వేటలో పడి ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టే పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భవానీపురంలో ఓ ప్రైవేటు ఎగ్జిబిషన్ నిర్వాహకుల దగ్గర దండిగా డబ్బులు తీసుకున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎన్‌వోసీ తప్పనిసరి. కానీ ఎన్‌వోసీ ఇవ్వకుండా డబ్బులు తీసుకుని శానిటరీ ఇన్‌స్పెక్టర్ వదిలేశారు. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రజలు చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్‌వోసీల పేరుతో అడ్డగోలుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు క్షేత్ర స్థాయిలో మేస్ర్తీలు మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలి. పారిశుధ్య కార్మికుల నుంచి నెలవారీ వాటాలు రావాల్సిందే. లేకపోతే వారికి మస్తర్లు ఉండవు. పర్మినెంట్ కార్మికులు పనిచేయకపోయినా వారికి మస్తర్లు ఇస్తారు. ఎందుకంటే వారి నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటారు. నగరంలో దుకాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలు ఇలా ప్రతి చోట అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. శానిటరీ సిబ్బంది చేయాల్సిన పనులను సచివాలయ శానిటరీ కార్యదర్శులతో క్షేత్ర స్థాయిలో చేయిస్తున్నారు. మునిసిపల్ నిబంధనల కంటే అదనంగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఉన్నతాధికారులు చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర మునిసిపల్ మంత్రి నారాయణ ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.