విజయ దరహాసం!
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:00 AM
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నిర్వహించింది. ప్రతిష్టాత్మంగా ఫలితాలు విడుదల చేసింది. అత్యధిక మార్కులతో మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇన్నాళ్లు తాము పడ్డ కష్టాన్ని క్షణంలో మరచి విజయదరహాసం ప్రదర్శించారు. ఉపాధ్యాయ కొలువుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిభచూపిన అభ్యర్థులపై ప్రత్యేక కథనం.
-నిరుద్యోగుల కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
-డీఎస్సీ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన జిల్లా వాసులు
- వీఆర్‌ఏ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా వెళ్లనున్న స్వయం ప్రభ
- తల్లిదండ్రులు లేకున్నా పట్టుదలతో విజయం సాధించిన జయకృష్ణ
- ఉపాధ్యాయులుగా మరెందరికో అవకాశం
- సర్టిఫికెట్ల పరిశీలన కోసం మచిలీపట్నం నోబుల్ కళాశాలలో ఏర్పాట్లు
- కలెక్టర్ చైర్మన్‌గా డీఎస్సీ-2025 కమిటీ ఏర్పాటు
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నిర్వహించింది. ప్రతిష్టాత్మంగా ఫలితాలు విడుదల చేసింది. అత్యధిక మార్కులతో మెరుగైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఇన్నాళ్లు తాము పడ్డ కష్టాన్ని క్షణంలో మరచి విజయదరహాసం ప్రదర్శించారు. ఉపాధ్యాయ కొలువుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిభచూపిన అభ్యర్థులపై ప్రత్యేక కథనం.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/మోపిదేవి:
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటించటంతో ర్యాంకులు సాధించి ఉద్యోగానికి అర్హత పొందిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ-2025లో భాగంగా ఉమ్మడి జిల్లాలో 1,208 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల కోసం 67,470 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ నెల 12వ తేదీన అభ్యర్థులకు సంబంధించిన మార్కులను విడుదల చేయగా, శుక్రవారం అభ్యర్థులు సాధించిన ర్యాంకులను విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లాపరిషత, మండల పరిషత, మునిసిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) 663 పోస్టులు, సెకండరీగ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)లు 545 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మరో ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తేదీలలో మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం రెవెన్యూ అధికారులు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక కమిటీలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. కలెక్టర్, జేసీ, జెడ్పీ చైర్‌పర్సన్, జెడ్పీ సీఈవో, డీఈవోలతో డీఎస్సీ-2025 ఉద్యోగ నియామకాల కోసం జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్‌ల పరిశీలనలో పాటించాల్సిన నియమాలపై కమిటీ సభ్యులకు డీఈవో పీవీజే రామారావు శనివారం నోబుల్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2018లో టీడీపీ అధికారంలో ఉన్నపుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ నోటిషికేషన్‌లను విడుదల చేయలేదు. 2024 ఫిబ్రవరిలో ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసినా, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం చాలదనే కారణంతో హైకోర్టు ఈ నోటిఫికేషన్‌ను నిలిపివేసింది. గత ఐదు సంవత్సరాలుగా డీఎస్పీ నోటిఫికే షన్ విడుదల కాకపోవడంతో బీఈడీ, టీటీసీ కోర్సులు చదివిన వారు ఉద్యోగం పొందేందుకు అవకాశం లేకుండా నిరుద్యోగులుగానే ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కల నెరవేర్చింది.
వీఆర్‌ఏ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా..
మోపిదేవి ప్రజాశక్తినగర్‌కు చెందిన పోలిమెట్ల స్వయం ప్రభ మోపిదేవి రెవెన్యూ విభాగంలో వీఆర్‌ఏగా ఉద్యోగం చేస్తూ సోషల్ స్టడీస్‌లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం డీఎస్సీ రాయగా, 76.94 మార్కులతో జిల్లాస్థాయిలో 20వ ర్యాంకు సాధించింది.
విధిని ఎదిరించిన జయకృష్ణ
మచిలీపట్నం ఫతుల్లాబాద్‌కు చెందిన మొవ్వ జయకృష్ణకు నాలుగేళ్ల వయసున్నపుడే తల్లిదండ్రులు ప్రసాద్, రాణి మరణించారు. నాన మ్మ నాగచింతమ్మ పెంచి పెద్ద చేసింది. పట్టుదలతో చదువుకున్న జయకృష్ణ విధిని ఎదిరించి నిలిచాడు. మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) కోటాలో జిల్లాలో 199వ ర్యాంకు సాధించాడు.