నత్తే నయం!
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:53 AM
జిల్లాలో గృహ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 3,783 గృహాలను పూర్తి చేసి శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరగడంలేదు. ఇప్పటి వరకు కేవలం 428 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు, కలెక్టర్ బాలాజీ ప్రతి నెలా 15 రోజులకోసారి గృహనిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, పనులు వేగవంతం చేయాలని చెబుతున్నా ఫలితం కనిపించడంలేదు. వేసవి కాలంలో పూర్తికాని పనులు వర్షాకాలంలో ఎంతమేర చేస్తారనేది ప్రశ్నార్థంగా మారింది.
-జిల్లాలో ముందుకు సాగని గృహ నిర్మాణాలు
-ఆగస్టు నాటికి 3,783 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యం
-15 రోజులకు ఒకసారి సమీక్ష చేస్తున్న కలెక్టర్ బాలాజీ
-అయినా ఊపందుకోని నిర్మాణాలు.. ముందుకురాని లబ్ధిదారులు
- హద్దుమీరుతున్న ఏఈ, డీఈల అవినీతి
జిల్లాలో గృహ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 3,783 గృహాలను పూర్తి చేసి శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు జరగడంలేదు. ఇప్పటి వరకు కేవలం 428 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు, కలెక్టర్ బాలాజీ ప్రతి నెలా 15 రోజులకోసారి గృహనిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించి, పనులు వేగవంతం చేయాలని చెబుతున్నా ఫలితం కనిపించడంలేదు. వేసవి కాలంలో పూర్తికాని పనులు వర్షాకాలంలో ఎంతమేర చేస్తారనేది ప్రశ్నార్థంగా మారింది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో 98,703 గృహాలు నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికి 33,042 వేల గృహాలు పూర్తయ్యాయి. 65,661 గృహాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. లబ్ధిదారులు గృహ నిర్మాణం కోసం పునాదులు తవ్విన 3,402 గృహాలకు తొలివిడతగా అధికారులు మెటీరియల్‌ను ఇచ్చారు. 11,534 గృహాలు పునాదులు వేసే దశలో ఉన్నాయి. 6,858 గృహాలు పునాదుల దశను దాటాయి. రూఫ్‌లెవల్(కిటికీల) దశ వరకు నిర్మాణం చేసిన గృహాలు 8,019 వరకు ఉన్నాయి. శ్లాబు వేసే దశవరకు నిర్మాణం పూర్తయినవి మరో 2,065 గృహాలు. పూర్తిగా నిర్మాణం అయినవి 428 గృహాలు. ఈ లెక్కలు ఎలా ఉన్నా శ్రావణ మాసంలో జిల్లాలోని 3,783 గృహాలను పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. మండల స్థాయిలో ఉండే ఏఈలు లబ్ధిదారుల వద్దకు వెళ్లి గృహనిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నా లబ్ధిదారులు ముందుకు రాని స్థితి నెలకొంది.
అక్రమార్కుల నుంచి నగదు రికవరీ ఎప్పుడు?
అవనిగడ్డ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఏఈలపై చర్యలు తీసుకుంటూ కలెక్టర్ బాలాజీ ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ డీఈగా పనిచేసిన బానోజీరావుపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. చల్లపల్లి మండలం ఇన్‌చార్జి ఏఈలుగా పనిచేసిన అరుణకుమారి, వినయ్‌చంద్రను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో గృహనిర్మాణశాఖ అధికారులు ఈ ఇద్దరు ఏఈలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో చల్లపల్లిలో పనిచేసి ముదినేపల్లి మండల ఏఈగా ఉన్న వై.శేషగిరారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని మండలాల్లో రూ.39 లక్షల మేర అవినీతి జరిగినట్లు అధికారులు తమ విచారణలో తేల్చారు. ఈపరిణామం అనంతరం కోడూరు మండలం గృహ నిర్మాణ సంస్థలో పనిచేసిన ఏఈపై మరిన్ని ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.36 లక్షల విలువైన ఇనుము, సిమెంటు పక్కదారి పట్టినట్లుగా గుర్తించినట్లు గృహనిర్మాణ సంస్థ పీడీ వెంకట్రామ్ తెలిపారు. కోడూరు మండలంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై ఇంకా విచారణ జరుగుతోందని, త్వరిత గతిన ఈ విచారణను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. గత ఏప్రిల్‌లో అక్రమాలకు పాల్పడిన ఏఈలపై చర్యలు తీసుకున్నా, గత రెండున్నర నెలలుగా వారి నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకపోవడం గమనార్హం. అధికారులు వారి నుంచి నగదు రికవరీకి ఎంత సమయం తీసుకుంటారనేది వేచి చూడాలి.
డీఈపై విచారణ చేసినా చర్యల్లేవు!
పామర్రు డివిజన్ గృహ నిర్మాణ సంస్థ డీఈగా గతంలో పనిచేసి రమేష్‌కుమార్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి పెదపారుపూడి మండలంలోని లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సిమెంటు, ఇనుము ఇవ్వకుండా, పామర్రులో ఒక గోడౌన్‌లో ఉంచి డీఈ కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా లారీల కొద్ది సిమెంటు, ఇనుమును విక్రయించారనే ఆరోపణలపై ఫిర్యాదులు అందాయి. గతంలో పామర్రు డీఈగా పనిచేసిన సదరు అధికారి ఆ తర్వాత జిల్లా కార్యాలయానికి బదిలీపై వచ్చి ఇక్కడ మేనేజరు, డీఈగా కొంతకాలం పనిచేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ డీఈ గుడివాడ డివిజన్‌కు బదిలీ అయ్యారు. పెదపారుపూడి మండలంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో ఆ మండలంలో పనిచేసే సిబ్బందిని జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయానికి పిలిపించి రెండు నెలల క్రితం విచారణ చేశారు. ఆ మండల సిబ్బంది ఉన్నది ఉన్నట్లుగా అధికారుల విచారణలో చెప్పారు. అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగు చూసినా జిల్లాస్థాయి అధికారులు ఈ డీఈపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం వెనక బలమైన కారణాలు ఉన్నాయని సంస్థలో పనిచేసే అధికారులు చెప్పుకుంటున్నారు. పెదపారుపూడి మండలంలో జరిగిన అక్రమాలపై విచారణ తుది దశలో ఉందని గృహనిర్మాణ సంస్థ పీడీ తెలిపారు.