మామూళ్లు ఇచ్చుకోలేక వైన షాపు క్లోజ్..!
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:46 PM
క్సైజ్ అధికారులకు లంచాలు ఇచ్చుకోలేక ఓ మద్యం దుకాణదారుడు తన వైనషా్‌పను క్లోజ్ చేసిన సంఘటన బేతంచెర్ల మండలంలో చోటు చేసుకుంది.
దుకాణదారుడి గగ్గోలు
బేతంచెర్లలో ఎక్సైజ్ అధికారుల ఒత్తిళ్లు
బేతంచర్ల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ అధికారులకు లంచాలు ఇచ్చుకోలేక ఓ మద్యం దుకాణదారుడు తన వైనషా్‌పను క్లోజ్ చేసిన సంఘటన బేతంచెర్ల మండలంలో చోటు చేసుకుంది. నిత్యం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రావడం బలవంతంగా డబ్బులు డిమాండ్ చేసి తీసుకెళ్తుండటంతో ఆ దుకాణ యజమాని బెంబేలెత్తిపోయాడు. ‘ఈ మామూళ్లు నేను ఇవ్వలేనయ్యో...’ అంటూ ఏకంగా వైన షాప్‌నే మూసేశాడు. గురువారం బేతంచెర్ల పట్టణంలోని కాకతీయ వైన షాపు యజమాని ఉన్నం చంద్రశేఖర్ విలేకరుల ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం లాటరీ పద్ధతిలో వైన షాపులకు వేలం నిర్వహించింది. ఇందులో ఉన్నం చంద్రశేఖర్ లాటరీ పద్దతిలో ఐదు వైన షాపులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆయనకు ఏ ఒక్కటి కూడా దక్కలేదు. దీంతో నంద్యాలకు చెందిన సుజల అనే పారిశ్రామికవేత్తకు బేతంచర్లలో ఒక వైన షాపు దక్కిందన్నారు. ఆ వైన షాపును ఆమె దగ్గర నుంచి రూ.48 లక్షలతో కొనుగోలు చేశాడు. మద్యం వ్యాపారాలు సరిగా లేకపోయినా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేందుకు టార్గెట్లు పెట్టారని ఆయన తెలిపారు. దీంతో పాటు ఎక్సైజ్ అధికారులకు ఇప్పటిదాకా రూ.20 లక్షలు మామూలు అందజేశానని, అయినప్పటికీ లేనిపోని కేసులు పెడతామంటూ ఎక్సైజ్ శాఖ ఏఎస్ రాముడు, సీఐ వరలక్ష్మీ, సిబ్బంది తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. మళ్లీ ఇప్పుడు రూ.5 లక్షలు తప్పనిసరిగా ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. మద్యం వ్యాపారాలు సరిగా జరగకపోవడంతో తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఎక్సైజ్ అధికారులకు విన్నవించుకున్నా అధికారులు కనికరించలేదన్నారు. ఇక అధికారులకు లంచం ఇచ్చుకోలేక గురువారం నుంచి మద్యం దుకాణాన్ని మూసివేస్తున్నట్లు తెలిపాడు. మద్యం వ్యాపారంలో తాను పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదని, అలాంటప్పుడు ఎక్కడి నుంచి ఎక్సైజ్ అధికారులకు మామూలు ఇవ్వాలని ఆయన ప్రశ్నించాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్సైజ్ అధికారుల మామూళ్ల వేధింపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు.