సేవాతత్పరుడు అంకినీడు
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:13 AM
చల్లపల్లి రాజధానిగా పరిపాలన చేసిన దేవరకోట సంస్థానాధీశులైన యార్లగడ్డ వంశీయుల్లో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిన వారిలో ఒకరు శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్. చల్లపల్లి రాజాగా చరిత్రలో నిలిచిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ (చల్లపల్లి రాజా) రెండవ కుమారుడైన అంకినీడుప్రసాద్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ప్రజాప్రతినిధిగా రాణిస్తూ ప్రజలకు సేవచేశారు.
-మచిలీపట్నం ఎంపీగా ప్రజలకు విశేష సేవలు
-విద్యాదాతగా పేదల జీవితాల్లో వెలుగులు
-చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అభివృద్ధికి కృషి
- చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా రైతులకు తోడ్పాటు
- నేడు శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ సంస్మరణ సభ
చల్లపల్లి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి):
చల్లపల్లి రాజధానిగా పరిపాలన చేసిన దేవరకోట సంస్థానాధీశులైన యార్లగడ్డ వంశీయుల్లో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిన వారిలో ఒకరు శ్రీమంతు రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్. చల్లపల్లి రాజాగా చరిత్రలో నిలిచిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దూర్ (చల్లపల్లి రాజా) రెండవ కుమారుడైన అంకినీడుప్రసాద్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ప్రజాప్రతినిధిగా రాణిస్తూ ప్రజలకు సేవచేశారు. తండ్రి చల్లపల్లి రాజా కృష్ణాజిల్లా పరిషత తొలి చైర్మన్‌గా, అవనిగడ్డ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయగా, అంకినీడుప్రసాద్ 1967-72 కాలంలో మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. భారత నాల్గవ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. నాడు దేశంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన అతి కొద్దిమందిలో అంకినీడుప్రసాద్ ఒకరు కావటం విశేషం. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాష్ట్రంలోని రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చల్లపల్లి ఎస్టేట్ ప్రాంతంలో పెద్దదిక్కుగా మారారు. రాజకీయ దిగ్గజాలతో సత్సంబంధాలు నెరుపుతూ ఎంతో హుందాగా ఉండేవారు. అందరూ చినబాబు, రాజాగారి బాబు అని అంకినీడు ప్రసాద్‌ను అప్యాయంగా పిలుచుకునేవారు. వ్యవసాయాధారిత పరిశ్రమ చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్‌గా పనిచేసి రైతాంగం, కార్మికుల ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డారు. తండ్రి చల్లపల్లి రాజా స్థాపించిన కళాశాల, హైస్కూల్ అభివృద్ధికి కరస్పాండెంట్‌గా విశేష కృషిచేశారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాలైన మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, పెదకళ్లేపల్లి శ్రీదుర్గానాగేశ్వరస్వామి ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీఆంధ్రమహావిష్ణు ఆలయం, యార్లగడ్డలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, బందరులోని శివగంగ అమ్మవారి ఆలయాలకు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఆధ్మాత్మిక వైభవానికి పాటుపడ్డారు. కాగా, అంకినీడు ప్రసాద్‌కు ఇద్దరు కుమారులు రామేశ్వర ప్రసాద్, హరీశ్వర ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం కోయంబత్తూరులోని స్వగృహంలో కన్నుమూయగా, మచిలీపట్నం శివగంగలోని స్వ గృహంలో శుక్రవారం సంస్మరణ కార్యక్రమాలు జరుగనున్నాయి.