కమ్మేస్తున్న పొగ
ABN , Publish Date - Dec 03 , 2025 | 01:32 AM
విజయవాడ నగరానికి పొగ ముప్పు పొంచి ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వరి కోతలు ముమ్మరం కావడంతో పెద్ద ఎత్తున చేలల్లో ఎండుగడ్డి వ్యర్థాలను రైతులు తగలబెడుతున్నారు. దీంతో భారీగా పొగ వ్యాపిస్తుంది. ఈ పొగ అంతా విజయవాడ నగరాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్న తరుణంలో ఈ పొగాతో ఇంకాస్త ప్రమాదకరంగా మారనుంది. ఈ విషయం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.
- విజయవాడకు పొంచి ఉన్న కాలుష్యం ముప్పు
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందలాది ఎకరాల్లోని గడ్డి వ్యర్థాలకు నిప్పు
- భారీగా వ్యాపిస్తున్న పొగ.. నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- గుండె, క్యాన్సర్, ఊపిరితిత్తులు, శ్వాశకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం
విజయవాడ నగరానికి పొగ ముప్పు పొంచి ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వరి కోతలు ముమ్మరం కావడంతో పెద్ద ఎత్తున చేలల్లో ఎండుగడ్డి వ్యర్థాలను రైతులు తగలబెడుతున్నారు. దీంతో భారీగా పొగ వ్యాపిస్తుంది. ఈ పొగ అంతా విజయవాడ నగరాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తున్న తరుణంలో ఈ పొగాతో ఇంకాస్త ప్రమాదకరంగా మారనుంది. ఈ విషయం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వరి కోతలు సగం వరకు పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా తెరిచారు. ఎన్టీఆర్ జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లు, కృష్ణాజిల్లాలో 1.61 లక్షల హెక్టార్లలో వరి పంట వేశారు. దాదాపుగా రెండు జిల్లాల్లో 20 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. మళ్లీ పంటలకు భూములు సిద్ధం చేసుకునే దానిలో భాగంగా పొలాల్లోని ఎండు దుబ్బులను తొలగించటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ట్రాక్టర్‌తో దున్నటం, ఆ తర్వాత వాటిని ఏరటం రైతులకు పనిగా మారుతోంది. దీంతో రైతులు ఖర్చు లేకుండా ఉండటం కోసం వరి దుబ్బులను కాల్చేస్తున్నారు.
విజయవాడను చుట్టుముడుతున్న కాలుష్యం
జగ్గయ్యపేట రూరల్, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలాల పరిధిలో వరి చేలను తగలబెడుతున్నారు. వందలాది ఎకరాల్లో త గలబెట్టడం వల్ల దట్టంగా పొగ వ్యాపిస్తోంది. గాలి వాటుకు కొంత తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల వైపు వెళ్తోంది. మరికొంత రాజధాని అమరావతి, విజయవాడ నగరాలను చుట్టిముట్టేస్తోంది. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చేలలో వ్యర్థాలను దగ్ధం చేస్తున్నారు. తూర్పుకృష్ణాలో పెడన, బంటుమిల్లి, పెదపారుపూడి మండలాల్లో వరి కోతలు పూర్తి కావటంతో వందలాది ఎకరాల్లో వ్యర్థ గడ్డిని తగలబెడుతున్నారు. పశ్చిమ ఎన్టీఆర్ జిల్లా, తూర్పు కృష్ణాజిల్లాలకు మధ్యన విజయవాడ నగరం ఉంది. దీంతో రెండు జిల్లాల ప్రభావం విజయవాడ మీద పడుతోంది.
ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం
వరి చేలల్లో గడ్డి, ఇతర వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వచ్చే పొగ ద్వారా కార్బన్ మోనాక్సైడ్, నై ట్రోజన్ ఆక్సైడ్స్, పాలీసైక్లిక్ అరోమేటిక్ హైడ్రోకార్బన్స్, సల్ఫర్ డయాక్సైడ్స్‌తో పాటు ఫార్మాల్దిహైడ్, బెంజీన్, అసిటాల్డిహైడ్ వంటి అసిడిటీవ్ గ్యాసెస్, డయాక్సిన్స్, ఫ్యూరాన్లు, మీథేన్, కార్బన్ డై అక్సిడ్ తదితర విషతుల్య వాయువులు ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. గుండె, ఊపిరితిత్తులు, క్యాన్సర్, శ్వాశకోశ సమస్యలు, క్రానిక్ బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దుమ్ము, పొగ వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడటం వల్ల దగ్గు, ఉబ్బసం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పొగ ద్వారా కళ్లల్లో మంట, నీరు కారడం, ముక్కు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
పర్యావరణానికి చేటు
చేలల్లో గడ్డి తగలబెట్టడం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిలో వేడిని పెంచడంతో పాటు అత్యధిక వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి సహజ విపత్తులకు కూడా పరోక్షంగా ఈ కాలుష్యం కారణం కానుంది. మట్టి సారాన్ని నష్టపర చటమే కాకుండా వృక్ష సంపద, వన్య ప్రాణులపై ప్రభావాన్ని చూపిస్తుంది.
కాలుష్యంపై రైతులకు అవగాహన అవసరం
పంటలు వేసే ముందు, కోతల ముందు రైతులకు అధికారులు పెద్ద ఎత్తున వ్యర్థ నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి హాని కల్పిస్తున్న తీరు, ప్రజల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వివరించాలి. విద్యార్థుల ద్వారా తమ తల్లిదండ్రులకు చెప్పించటం వంటివి చేయాలి. అయినా పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
గడ్డిని కాల్చకుండా ఏం చెయ్యొచ్చు!
రైతులు ఖర్చును దృష్టిలో పెట్టుకుని గడ్డిని కాలుస్తున్నారు. అలా కాకుండా చేలకు నీరు పెట్టి వాటిని కుళ్లేలా చేయటం ద్వారా పంటకు కంపోస్టు ఎరువుగా అందించవచ్చునని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల మట్టి సారం పెరుగుతుంది. పంటలపై ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది.