Share News

‘రియల్‌’ మాయ

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:40 AM

అనధికార లే అవుట్‌లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏళ్ల తరబడి ప్రజలను మాయ చేస్తున్నారు. కాలానుగుణంగా మారుతున్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా లే అవుట్‌లు వేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక సంస్థలను మభ్యపెడుతున్నారు. రిజర్వు స్థలాలను కేటాయించే క్రమంలో గోల్‌మాల్‌ చేస్తున్నారు. క్రాస్‌ ముక్కలను, ఇరిగేషన్‌ స్థలాలను రిజర్వు స్థలాలుగా చూపుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘రియల్‌’ మాయ

- జిల్లాలో 70 శాతం అనధికార లేఅవుట్‌లే!

- రిజర్వు సైట్లుగా మిగిలిన క్రాస్‌ ముక్కలు, ఇరిగేషన్‌ స్థలాలు

- కచ్చా డ్రెయిన్లు తీసి రోడ్లుగా చూపే ప్రయత్నం

- సీఆర్‌డీఏ, ముడా అనుమతులు లేకుండానే విక్రయాలు

- కాసుల మత్తులో జోగుతున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు

- పట్టించుకోని జిల్లా స్థాయి అధికారులు

అనధికార లే అవుట్‌లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏళ్ల తరబడి ప్రజలను మాయ చేస్తున్నారు. కాలానుగుణంగా మారుతున్న నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా లే అవుట్‌లు వేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక సంస్థలను మభ్యపెడుతున్నారు. రిజర్వు స్థలాలను కేటాయించే క్రమంలో గోల్‌మాల్‌ చేస్తున్నారు. క్రాస్‌ ముక్కలను, ఇరిగేషన్‌ స్థలాలను రిజర్వు స్థలాలుగా చూపుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, మండలాల్లో వందలాది లే అవుట్‌లు వెలిశాయి. వీటిలో 70 శాతానికిపైగా అనధికార లే అవుట్‌లని గతంలో అధికారులు ధ్రువీకరించారు. ఎకరం నుంచి పదుల సంఖ్యలో అనధికార లే అవుట్‌లను వేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలా చెల్లించకుండా లే అవుట్‌లు వెలిసినా స్థానిక అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో సీఆర్‌డీఏ, ముడాల నుంచి అనుమతులు తీసుకునే క్రమంలో రహదారులు, డ్రెయిన్లు తదితర వసతులను కల్పిస్తామని అనుమతులు పొందు తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం వచ్చినప్పుడు రియల్టర్లు మాయ చేస్తున్నారు. ఎక్కడా కూడా నిబంధనల మేరకు రోడ్లు ఏర్పాటు చేయలేదు. కచ్చా డ్రెయిన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడి లేఅవుట్‌ ప్లాన్‌ అప్రూవల్‌ పత్రాలను కాల్చేసిన దాఖలాలు ఉన్నాయి. కొందరు ప్రభుత్వ నిబంధనలు తమకేమి పట్టవని లేఅవుట్‌లు వేస్తూనే ఉన్నారు. గుడివాడ డివిజన్‌లోని మల్లాయిపాలెం, నాగవరప్పాడు, చిన ఎరుకపాడులో అనధికార లే అవుట్‌లు వెలిశాయి.

రిజర్వు స్థలాల గోల్‌మాల్‌!

లేఅవుట్‌ వేస్తే తప్పనిసరిగా స్థానిక సంస్థలకు 10శాతం మేర రిజర్వు స్థలాలను ఇవ్వాల్సి ఉంది. అసలు మాయ ఇక్కడే జరుగుతుంది. పెద్ద లేఅవుట్‌లలో అమ్మకానికి పనికి రాని చిన్నచిన్న ముక్కలుగా మిగిలిన స్థలాలు, క్రాస్‌ ముక్కలను రిజర్వు స్థలాలుగా మ్యాప్‌లలో చూపుతున్నారు. దీనికి అనుమతులిచ్చే అధికారులు తలాడిస్తున్నారు. ఇచ్చిన రిజర్వు స్థలాలు స్థానిక సంస్థలకు ఏ విషయంలోనూ పనికిరావు. ఏ లేఅవుట్‌లో కూడా ఒకే చోట రిజర్వు స్థలం మొత్తాన్ని చూపిన దాఖలాలు తక్కువ. ఒక్క ప్రభుత్వ లేఅవుట్‌లలో మాత్రమే రిజర్వు స్థలాన్ని ఒకే చోట చూపుతున్నారు. రిజర్వు స్థలాలు ఎక్కడ ఉన్నాయో సరైన రికార్డులు స్థానిక సంస్థల వద్ద లేవంటే అధికారులు పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇరిగేషన్‌ స్థలాన్ని రిజర్వు స్థలంగా చూపి..

నందివాడ మండలం టెలిఫోన్‌ నగర్‌లోని ఒక లేఅవుట్‌లో ఏకంగా ఇరిగేషన్‌ స్థలాన్ని రిజర్వు స్థలంగా చూపి అనుమతులు పొంది ప్లాట్లను అమ్మేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సదరు స్థలం ఇరిగేషన్‌ పోరంబోకు స్థలంగా నమోదై ఉంది. తమకు తెలియకుండా తమ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఎలా రిజర్వు స్థలంగా చూపారంటూ ఇరిగేషన్‌ శాఖ చర్యలకు సిద్ధమైంది. అనుమతులిచ్చే క్రమంలో పేర్కొన్న సర్వే నెంబరులో ఇరిగేషన్‌ పోరంబోకు స్థలంగా ఉంటే రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా అనుమతులిచ్చారంటూ నిలదీస్తున్నారు. తీగలాగితే డొంక కదిలిన చందాన ఇదే తరహాలో పలు లేఅవుట్‌లలో మోసాలు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

అధికారుల కాసుల కక్కుర్తి..

అనధికార లేఅవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా అధికారుల్లో చలనం రావడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్‌డీఏ, ముడా పరిధిలోకి రావడంతో అనుమతులు పొందడం పెద్ద ప్రహసనంగా మారుతుందనే ఆలోచనతో కొందరు అవినీతి అధికారుల అండతో అనధికార లేఅవుట్‌లకు తెరలేపుతున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కావాలనే కాలయాపన చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా అనధికార లేఅవుట్‌లని బోర్డులు పెట్టిన దాఖలాలు లేవు. వాటిపై చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.

అధికారుల నిర్లక్ష్యం

అనధికార లేఅవుట్‌ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే నాలా పన్ను తప్పనిసరి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్‌లు వెలిశాయి. స్థానిక సంస్థలకు రావాల్సిన లక్షలాది రూపాయలకు గండిపడుతోంది. దీనిపై స్థానిక సంస్థలు నిలదీయడం లేదు. మరికొన్ని చోట్ల రిజర్వు సైట్‌లను చూపకుండా ప్లాట్‌లను అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల రిజర్వు సైట్లు ఇచ్చిన ప్లాట్‌ల అమ్మకాలు ముగిసిన వెంటనే సదరు రిజర్వు స్ధలాలను అమ్ముకుంటున్నారు.

బోర్డులు ఏర్పాటు చేస్తే పీకేస్తున్నారు..

మున్సిపాల్టీల పరిధిలో గతంలో ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించి అనధికార లే అవుట్‌లను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేశారు. రెండు రోజులు గడవకముందే వాటిని రియల్టర్లు పీకేశారు. డోజర్లతో గుంతలు తవ్వేశారు. అనధికార లే అవుట్‌లల్లో ప్లాట్‌లను కొనవద్దని, ఎవరైన కొనుగోలు చేస్తే స్థానిక సంస్థల నుంచి ఎటువంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి అనధికార లేఅవుట్‌లపై చర్యలు తీసుకుంటే స్థానిక సంస్థలకు లక్షలాది రూపాయల ఆదాయంతో పాటు రిజర్వు స్థలాలు కూడా దక్కుతాయి.

Updated Date - Sep 19 , 2025 | 12:40 AM