Share News

వీడని వర్షాలు

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:35 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

  వీడని వర్షాలు
ఆత్మకూరు శివారులో ఉప్పొంగి ప్రవహిస్తున్న భవనాశి నది

ఉప్పొంగిన వాగులు, వంకలు

స్తంభించిన రాకపోకలు

పొలాలకు తీవ్ర నష్టం

ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు

ఆత్మకూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరులో వర్షం కురియడంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచి ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. సిద్దాపురం చెరువు అలుగు పారుతోంది. దాంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళ్లే వాహనాలను నంద్యాల టర్నింగ్‌ నుంచే నంద్యాల, గిద్దలూరు మీదుగా మళ్లిస్తున్నారు. అలాగే ఆత్మకూరు నుంచి వడ్లరామాపురం గ్రామానికి వెళ్లే రహదారిపై పీతురువాగు ఉప్పొంగడంతో ఆ గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. అంతేకాకుండా నల్లమలలోని మునిమడుగుల వాగుపై నిర్మించిన వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌లో గరిష్ట స్థాయిలో నీటినిల్వలు చేరడంతో ఆ నీరంతా భవనాశి నదిలో చేరడంతో ఆత్మకూరు పట్టణ శివార్లలో నది ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భవనాశి నది సమీపంలోని ఇటుకల బట్టీల ప్రాంతాన్ని కూడా వరద జలాలు ముంచెత్తాయి. ఆత్మకూరు అర్బన సీఐ రాము కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మొక్కజొన్న, పత్తి పంట పొలాల్లో వర్షపునీరు నిలిచి పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు.

మహానంది: మండలంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలకు వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలేరు వాగు, బుక్కాపురం అలుగు నీరు ప్రధాన రహదారిపై ప్రవహించాయి. దీంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు నిలిచిపోయాయి. తిమ్మాపురం జడ్పీ పాఠశాలలో పురాతన భారీ వృక్షం నేలకూలింది. అబ్బీపురం చెంచు కాలనీల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. ఎంపీపీ యశస్వీని, ఎంపీడీవో మహమ్మద్‌ దౌలాతో పాటు అధికారులు పర్యటించారు. ఎంపీపీ వరద బాఽధితులకు ఆర్థిక సాయం అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బుక్కాపురం అలుగును ఎస్‌ఐ రామ్మోహనరెడ్డి పరిశీలించారు.

కొత్తపల్లి: మండలంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి 57.0 మీ.మీల వర్షపాతం నమోదైంది. శివపురం ఎద్దులేరు వాగుపై వరద ఉధృతి కొనసాగుతోంది. కొత్తపల్లి పోలీసులు వాగువద్దనే కాపాలా ఉండి ఎలాంటి ప్ర మాదాలు చోటు చేసుకోకుండా ట్రాక్టర్‌ ద్వారా ఆవలి ఒడ్డుకు గ్రామస్థులను చేరుస్తున్నారు.

Updated Date - Sep 27 , 2025 | 11:35 PM