Share News

వదలని వాన!

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:29 PM

నంద్యాల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి వర్షాలు కురుస్తున్నాయి.

   వదలని వాన!
కొత్తపల్లి మండలం నందికుంటలో ఇరుక్కుపోయిన కారు

జిల్లాలో విస్తారంగా వర్షాలు

250 ఎకరాల్లో పంటలకు దెబ్బ

ప్రమాదకరస్థాయిలో ‘కుందూ’ ప్రవాహం

చాగలమర్రిలో రాజోలి ఆనకట్ట దాటి వరద

ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించిన కలెక్టర్‌ రాజకుమారి

రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం

నంద్యాల, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సుమారు రూ.20 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బండిఆత్మకూరు మండలం బోధనం, కాకనూరు గ్రామాల్లో కుందూనది, నిప్పులవాగు నుంచి నీటి ఉధృతికి పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. 15,16,17వ తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు హెచ్చరించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 9గంటల వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 496 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఆరంజ్‌ అలర్ట్‌ జారీ జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. నదులు, వంకలు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

ఫ చాగలమర్రిలో కుందూనది ఉగ్రరూపం దాల్చింది. చాగలమర్రిలోని రాజోలి ఆనకట్టను దాటి కుందూనది ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది.

ఫ చాగలమర్రి మండలంలోని డి.వనిపెంట చెరువు అలుగు వరద నీటితో పొంగి ప్రవహించింది.

ఫ నందికొట్కూరు మండలంలో చెరువుకు గండిపడటంతో వంద ఎకరాల్లో మొక్కజొన్న పంట నీట మునిగింది.

ఫ రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురంలో భారీ వర్షాలకు ఓ మట్టిమిద్దె కూలిపోయింది. దీంతో నివాసంలో నిద్రిస్తున్న జయమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. అదేవిధంగా చందలూరు గ్రామంలో చాకలి శ్రీనివాసులు, బోయ గురువమ్మలకు చెందిన మట్టిమిద్దెలు కూడా కూలాయి.

ఫ రుద్రవరం మండలం చిలకలూరు గ్రామ సమీపంలో వక్కిలేరు వాగు, చందలూరు సమీపంలో చిన్నేరువాగు, కొండమాయపల్లె సమీపంలో బంగారమ్మ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఫ పాములపాడు మండలంలోని చెలిమిల్ల గ్రామంలో ఎద్దులవంక వాగు, సుద్దవాగు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో సమీపంలోని మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగాయి.

ఫ పాములపాడు మండలం ఇస్కాల గ్రామ శివార్లలోని భవనాశి వాగు ఉప్పొంగడంతో చట్టుప్రక్కల పంట పొలాలు మునిగి పోవడమే కాక శ్రీ నందీశ్వర ఆలయం నీట మునిగింది. దుద్యాలతో పాటు కొత్తపల్లి మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి

ఫ కొత్తపల్లి మండలంలోని నందికుంట గ్రామంలో నల్లమల అడవుల నుంచి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు మోకాళ్లలోతు నీటిలోనే రాకపోకలు సాగించారు.

Updated Date - Aug 13 , 2025 | 11:29 PM