వీడని వాన
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:57 PM
మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం శుక్రవారం తెల్లవారుజామున కురిసింది. 13.2 మీ.మీ. వర్షపాతం నమోదైంది.
ఉగ్రరూపం దాల్చిన కుందూ, వక్కిలేరు
స్తంభించిన రాకపోకలు
నీట మునిగిన పంట పొలాలు
చాగలమర్రి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం శుక్రవారం తెల్లవారుజామున కురిసింది. 13.2 మీ.మీ. వర్షపాతం నమోదైంది. రాజోలి ఆనకట్ట వద్ద కుందూనది పొంగి ప్రవహించింది. కుందూలో 28 వేల క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తున్నట్లు కేసీ కెనాల్ ఏఈ జమాల్‌వలి తెలిపారు. ఆనకట్టవద్ద గల 5 గేట్లను ఎత్తి కడప జిల్లా వైపు వరద నీటిని విడుదల చేశామని చెప్పారు. పరిసర గ్రామాల ప్రజలు, కూలీలు, రైతులు నది దాటే ప్రయత్నం చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేలంపాడు, రాంపల్లె గ్రామాల్లో సాగు చేసిన బెండ, జూట్, మొక్కజొన్న పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. రాంపల్లె గ్రామంలో మొక్కజొన్న నేలవాలింది. కలుగొట్లపల్లె, బ్రాహ్మణపల్లె వక్కిలేరు వంతెనలపై వరద నీరు పొంగి ప్రవహించింది. దీంతో ఆయా గ్రామ ప్రజల రాకపోకలు స్తంభించాయి. నేలంపాడు గ్రామంలో రహదారి జలమయమైంది. గ్రామాల్లో మట్టిమిద్దెల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ విజయ్‌కుమార్, పోలీసులు సూచించారు.