మంత్రి చొరవతో సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:50 AM
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవటానికి సవాలక్ష ఆంక్షలు, గిట్టుబాటు ధర లేకపోవటం, రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఆశించిన స్థాయిలో ఆదరణ కొరవడటంతో దిక్కుతోచని స్థితితో రైతులు ఆగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు తాను పడుతున్న కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తెలిసిన వారి ద్వారా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన మంత్రి రైతుకు స్వయంగా ఫోన్ చేసి తన ఇబ్బందులను అడిగి తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేయటంతో సమస్య పరిష్కారమైంది.
- సోషల్ మీడియాలో అన్నదాత సమస్య
- స్పందించిన మంత్రి నాదెండ్ల.. రైతుకు ఫోన్
- మంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం
- ధాన్యం కొనుగోలు, తరలింపునకు లారీ ఏర్పాటుపై హామీ
కూచిపూడి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవటానికి సవాలక్ష ఆంక్షలు, గిట్టుబాటు ధర లేకపోవటం, రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఆశించిన స్థాయిలో ఆదరణ కొరవడటంతో దిక్కుతోచని స్థితితో రైతులు ఆగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు తాను పడుతున్న కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తెలిసిన వారి ద్వారా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన మంత్రి రైతుకు స్వయంగా ఫోన్ చేసి తన ఇబ్బందులను అడిగి తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేయటంతో సమస్య పరిష్కారమైంది. ఈ ఘటన కృష్ణాజిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన చలసాని వెంకటేశ్వరరావు గ్రామంలో 14 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. బుధవారం ఏడు ఎకరాల్లో పంట నూర్పిడి చేపట్టి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంచుల కోసం వెళ్లారు. సంచులు 500 మాత్రమే ఉన్నాయి, లోడు రావాల్సి ఉంది, లారీలు కూడా సమయానికి రావటం లేదు, లారీ కిరాయి కూడా మీరే పెట్టుకోవాలి, ధాన్యం డబ్బుతోపాటు కిరాయి కూడా ఇస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది చెప్పారు. చేసేది లేక స్థానిక బేరగాడి వద్దకు వెళ్లగా, ధర రూ.1400 అడుగుతున్నారని తెలపటంతో దిగాలు చెందిన రైతు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారానూ, తెలిసిన వ్యక్తి ద్వారా మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి గురువారం రైతుతో నేరుగా మాట్లాడి అధికారులకు సూచనలు ఇవ్వటంతో అధికార యంత్రాంగం కదిలింది. రైతు వద్దకు వెళ్లి సంచులు పురమాయిస్తామని, లారీలు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో సమస్య పరిష్కారమైంది.
చాలా ఆనందంగా ఉంది : చలసాని వెంకటేశ్వరరావు, రైతు
తాను పడుతున్న ఇబ్బందుల విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వెళ్లింది. గురువారం ఆయన ఫోన్ చేసి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వెను వెంటనే కొందరు అధికారులు నాకు ఫోన్లు చేయగా, తహసీల్దార్ మస్తాన్ మరి కొందరు తన వద్దకు వచ్చి సంచులు ఏర్పాటు చేస్తాము, లారీలు పురమాయిస్తాము, మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పటంతో మిక్కిలి ఆనందం కలిగింది. గంటల వ్యవధిలో సమస్య పరిష్కారం లభించినందుకు మంత్రి నాదెండ్ల మనోహర్‌కు, కూటమి ప్రభుత్వానికి అభినందనలు.
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తాం : తహసీల్దార్ మస్తాన్
తేమ శాతం 17గా ప్రభుత్వం నిర్ణయించింది. రైతు చలసాని వెంకటేశ్వరరావు ధాన్యం తేమ శాతం 27గా ఉండటంతో ఆరబెట్టుకోమ్మని సూచించాం. ఎంత ధర వచ్చినా అమ్ముతానని రైతు తెలపటంతో రైతు అంగీకారంతో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం.