అభివృద్ధికి ‘బాట’
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:22 AM
మచిలీపట్నంలో క్రాస్ క్లోవర్ లీఫ్ నమూనా రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మచిలీపట్నం-విజయవాడ, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో నిర్మించనున్నారు. రూ.574 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు అవసరమైన 56 ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో రహదారి విస్తరణకు అడుగులు పడుతున్నాయి.
- మచిలీపట్నంలో క్రాస్ క్లోవర్ లీఫ్ నమూనా రహదారి నిర్మాణం!
- 56 ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదనలు
- రూ.574 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులు
- రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధం!
-మచిలీపట్నం శివారులో కలవనున్న మచిలీపట్నం-విజయవాడ, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారులు
మచిలీపట్నంలో క్రాస్ క్లోవర్ లీఫ్ నమూనా రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మచిలీపట్నం-విజయవాడ, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో నిర్మించనున్నారు. రూ.574 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు అవసరమైన 56 ఎకరాల భూమి సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో రహదారి విస్తరణకు అడుగులు పడుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి-65, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి 216 మచిలీపట్నంలో కలిసే ప్రాంతంలో క్రాస్ క్లోవర్ లీఫ్ నమూనా రహదారి నిర్మాణం చేయనున్నారు. మచిలీపట్నం పోర్టు నుంచి నూతనంగా నిర్మాణం చేసే రహదారి మచిలీపట్నం శివారులో ఉన్న హర్ష కాలేజీ వద్ద 216 జాతీయ రహదారికి కలుస్తుంది. ఇక్కడి నుంచి ఎస్‌ఎన్ గొల్లపాలెం వరకు జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. జాతీయ రహదారులు 216, 65 మచిలీపట్నం వద్ద కలిసే ఫ్లైఓవర్ వద్ద మచిలీపట్నం పోర్టుకు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎస్‌ఎన్ గొల్లపాలెం నుంచి హర్ష కాలేజీ వరకు సుమారు 3.5 కిలో మీటర్ల మేర విస్తరించే ప్రతిపాదనలను మినిసీ్ట్ర ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ (మోర్త్)తయారు చేసింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో రెవెన్యూ అధికారులు భూసేకరణకు రంగం సిద్ధం చేశారు.
త్వరలో భూసేకరణకు నోటిఫికేషన్
మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65కి ఎస్‌ఎన్‌గొల్లపాలెం సమీపంలో కత్తిపూడి- ఒంగోలు జాతీయ రహదారి-216 ఫ్లైఓవర్ వద్ద కలుస్తుంది. మచిలీపట్నం పోర్టు నుంచి ఇతర ప్రాంతాలకు, రాష్ర్టాలకు వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల విస్తరణకుమోర్త్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.574 కోట్లతో ఆమోదం తెలిపింది. ఎస్‌ఎన్ గొల్లపాలెం సమీపంలో 216 జాతీయ రహదారి, 65 జాతీయ రహదారులు కలిసే ఫ్లైఓవర్ వద్ద క్రాస్ క్లోవర్ లీఫ్ నమూనాలో ఆధునాతన పద్ధతిలో రహదారి నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఇందు కోసం ఎస్‌ఎన్ గొల్లపాలెం వద్ద 38 ఎకరాలు, అరిసేపల్లి పంచాయతీ పరిధిలో 11 ఎకరాలు, మాచవరం సమీపంలో ఐదు ఎకరాల భూమి, అదనంగా మరో రెండు ఎకరాల భూమి మొత్తంగా 58 ఎకరాలు అవసరమవుతుందని మోర్త్ అధికారులు గుర్తించారు. పంట కాలువలు, డ్రైనేజీలు ఉన్న చోట కల్వర్టులు, వంతెనలు, రోడ్డు క్రాసింగ్ వద్ద అండర్ పాస్‌ల నిర్మాణాలకు కూడా ప్రతిపాదనలు రూపొందించారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి, 216 జాతీయ రహదారి కలిసే ప్రాంతం నుంచి పెడన సమీపంలోని హర్ష కాలేజీ వరక ఆరులేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో భూసేకరణకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. కలెక్టర్ బాలాజీ అనుమతులతో జేసీ గీతాంజలిశర్మ భూసేకరణకు సంబంధించిన ఫైలుపై ఇటీవల సంతకాలు చేశారు. వారం, పది రోజుల్లో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎన్ గొల్లపాలెం పరిధిలో జాతీయ రహదారి పక్కన ఎకరం భూమి రిజిస్ర్టార్ కార్యాలయంలో రూ.85 లక్షల మేర విలువగా ఉంది. రహదారి అభివృద్ధి కోసం భూమిని తీసుకుంటే ప్రస్తుతం ఉన్న భూమి రేటును బట్టి రెండున్నర రెట్లు అధికంగా చెల్లించి భూసేకరణ చేసేందుకు అవకాశం ఉందని రెవెన్యూ అధికారుల మాటగా ఉంది. అయితే జాతీయ రహదారి పక్కనే ఉన్న భూమి గజం స్థలం రూ.80 వేల నుంచి లక్ష రూపాయల్లోపు బహిరంగ మార్కెట్‌లో పలుకుతోంది. దీంతో రైతులు భూములను ఇచ్చేందుకు ఎంతమేర ముందుకు వస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. జాతీయ రహదారుల విస్తరణకు భూమి తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చి, అవార్డ్ పాస్ చేసి తర్వాత రైతులకు నగదు చెల్లింపులు ఉంటాయని, నగదు చెల్లింపులలో ఆలస్యమైతే 12 శాతం వడ్డీతో సహా చెల్లింపులకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
పోర్టుకు అనుబంధంగా జాతీయ రహదారుల విస్తరణ
మచిలీపట్నం పోర్టు నిర్మాణం 2026 అక్టోబరు నాటికి పూర్తి చేసి ఓడలను ఇక్కడకు తీసుకువస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే సరుకుల ఎగుమతులు, దిగుమతుల నిమిత్తం వందలాది వాహనాలు రోజూ ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించాలి. ప్రస్తుతం ఉన్న రహదారులపై వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గతంలో మోర్త్ అధికారులతో చర్చలు జరిపారు. మచిలీపట్నం-విజయవాడ, కత్తిపూడి- ఒంగోలు జాతీయ రహదారులను మచిలీపట్నం పోర్టు, పరిసర ప్రాంతాల్లో విస్తరించేందుకు తన వంతుగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో జాతీయ రహదారుల విస్తరణలో కదలిక వచ్చినట్లయింది.