కరిగిపోతున్న ‘ద్వీపం’
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:17 AM
కృష్ణానదికి తరచూ వస్తున్న వరదలతో భవానీ ద్వీపం విస్తీర్ణం తగ్గిపోతోంది. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీపం ప్రస్తుతం 120 ఎకరాలకు చేరింది. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణం కనుమరుగైంది. గతేడాది రికార్డు స్థాయిలో వచ్చిన వరద కారణంగా ఆరు ఎకరాల విస్తీర్ణం కొట్టుకుపోయింది.
- 133 ఎకరాల భవానీ ఐల్యాండ్ 120 ఎకరాలకు పరిమితం
- 2009 నుంచి తరచూ కృష్ణానదికి వరదలు
- రూ.కోట్ల అభివృద్ధి పనులు వరదపాలు
- ద్వీపం రక్షణకు శాశ్వత పరిష్కారం అవసరం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణానదికి తరచూ వస్తున్న వరదలతో భవానీ ద్వీపం విస్తీర్ణం తగ్గిపోతోంది. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీపం ప్రస్తుతం 120 ఎకరాలకు చేరింది. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణం కనుమరుగైంది. గతేడాది రికార్డు స్థాయిలో వచ్చిన వరద కారణంగా ఆరు ఎకరాల విస్తీర్ణం కొట్టుకుపోయింది. భవానీ ద్వీపానికి 2009 నుంచి 2025 వరకు తరచూ వస్తున్న వరదల వల్ల క్రమంగా భారీ స్థాయిలో కోతకు గురవుతోంది. 2009లో కృష్ణానదికి 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు మొదటిసారి కోతకు గురైంది. ప్రస్తుత టవర్ ఏరియా దాటి ముందుకు ఉండే ద్వీపం కాస్తా.. టవర్ అంచు వరకు వెళ్లిపోయింది. 2009 నుంచి 2024 వర కు చూస్తే భవానీ ద్వీపానికి మొత్తం ఎనిమిది సార్లు వరదలు వచ్చాయి. 2024లో రికార్డు స్థాయిలో వచ్చిన 12 లక్షల క్యూసెక్కుల వరద కారణంగా భవానీ ద్వీపానికి తీవ్ర నష్టం జరిగింది. కృష్ణానదికి 2009కి పూర్వం కూడా వరదలు వచ్చాయి. అప్పట్లో పెద్దగా కోతకు గురి కావటం కానీ, నష్టపోవటం కానీ జరగలేదు. అప్పట్లో పర్యాటకంగా భవానీ ద్వీపంలో పెద్దగా పెట్టుబడులు కూడా పెట్టలేదు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరదలు రావటం రివాజుగా మారిపోయింది. ఉత్తరాది రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి తరచూ వరద వస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కురిసే భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ఉప్పొంగుతోంది. ఉత్తరాది వర్షాలతో పాటు, పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏడాదిలో మూడు నుంచి నాలుగు సార్లు వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది చూస్తే ఇప్పటికి 10 సార్లకుపైగా కృష్ణానదికి వరద వచ్చింది. దసరాకు ముందు ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తరచూ వస్తున్న వరదల కారణంగా భవానీ ద్వీపం కొట్టుకుపోతోంది. ఇప్పటికే 13 ఎకరాలు కొట్టుకుపోయిన నేపథ్యంలో, రానున్న రోజుల్లో భారీ వరదలు వస్తే ఇదే వాలుగా ద్వీపం మరింత తరిగిపోయే ప్రమాదం ఉంది. రానున్న కాలంలో భవానీ ద్వీపం మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.
రూ. కోట్లు వరద పాలు
పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా భవానీ ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రగా ఏర్పడిన క్రమంలో అమరావతి రాజధానికి చెంతనే ఉండటం వల్ల ప్రభుత్వం భవానీ ద్వీపానికి పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. 2024లో వచ్చిన వరదల కారణంగా ద్వీపంలో చేపట్టిన అభివృద్ధి అంతా కూడా వరదకు కొట్టుకుపోయింది. ఆ ఏడాది రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 2016-17 మధ్య కాలంలో కృష్ణానదిలో ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ఆసియా దేశాలలోనే అత్యంత భారీగా మ్యూజికల్ అండ్ ఫ్లోటింగ్ లేజర్ షోను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వచ్చిన వరదల కారణంగా ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెయిన్ అండ్ లేజర్ షో కొట్టుకుపోయింది. దీనికి ఇన్సూరెన్స్ చేసినా ఇప్పటికీ ఆ డబ్బులు రాలేదు. భవానీ ద్వీపంలో ప్రతిదానికి ఇన్సూరెన్స్ చేసినా.. వరదల వల్ల సంభవించిన నష్టాలలో గోరంత సాయం మాత్రమే వచ్చింది. ఇప్పటి వరకు భవానీ ద్వీపంలో వరదల కారణంగా రూ. 30 కోట్ల మేర పెట్టిన పెట్టుబడులకు నష్టం జరిగింది.
ద్వీపం రక్షణకు చర్యలు అవసరం
భవానీ ద్వీపాన్ని ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని అమరావతికి కూత వేటు దూరంలో కృష్ణానదిలో సహజసిద్ధమైన ద్వీపం ఇది. భవానీ ద్వీపం కనుమరుగు కాకుండా ఉండాలంటే తక్షణం భవానీ ద్వీపాన్ని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కాపాడాలి. దీని కోసం రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి ద్వీపం చుట్టూ రిటెయినింగ్ వాల్ నిర్మించటం.. లేదంటే పూర్తిస్థాయిలో స్టీల్ షీటింగ్‌ను ఫైలింగ్ చేయటం వంటి చర్యల ద్వారానే భవానీ ద్వీపాన్ని కాపాడుకోవటం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. లేనిపక్షంలో పెట్టుబడుల పరంగానూ, విస్తీర్ణంగానూ భవానీ ద్వీపానికి నష్టం జరిగే అవకాశం ఉంది.